ప్రమాణ స్వీకారం ఖర్చు రూ.98 లక్షలు
ముంబై: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ ప్రభుత్వం వాంఖడే స్టేడియంలో నిర్వహించిన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ఖర్చు రూ.98.33 లక్షలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఒకవైపు మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా, ఖజానా ఖాళీగా ఉందని చెప్పిన బీజేపీ విలాసవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గాలి కోరిన సమాచారాన్ని ప్రభుత్వ అండర్ సెక్రటరీ ఎస్జీ మోఘె అందించారు. ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.98,33,830 ఖర్చయినట్లు ఆయన తెలిపారు. తాను కోరిన సమాచారాన్ని బీజేపీ ముంబై నగర శాఖ ఇచ్చేందుకు నిరాకరించిందని, దీంతో తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించానని గల్గాలి తెలిపారు.