‘తప్పు చేస్తే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పని తీరుపై మూడు నెలలకోసారి ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కమిటీ’ మానిటరింగ్ చేస్తుందని పురపాలక శాఖమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ శాసన మండలిలో పురపాలిక బిల్లుకు ఆమోదం పొందిన అనంతరం అయన మాట్లాడుతూ.. ‘ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా అభ్యర్థులు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. పని చేయని వారిపై పార్టీలతో సంబంధం లేకుండా వేటు వేస్తాం. ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపునకు పాల్పడబోము. అస్తిత్వం చాటుకోవడం కోసం కొందరు నాయకులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇలా చేస్తే నాయకత్వ లక్షణాలు రావు. ప్రజల్లో ఉంటే వస్తాయ్. అలాంటి వాటికి నేను వ్యతిరేకం. కేంద్రం ప్లాస్టిక్ నియంత్రణపై చట్టం తీసుకువస్తే దాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధం. మున్సిపల్ చట్టంలో ఐదు సవరణలు చేశాం. సెక్షన్ 1, 3, 103, 113ఏ, 195ఏ. స్వీయ పరిశుభ్రత లోపం కారణంగానే డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తున్నాయని’ కేటీఆర్ పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. తప్పు చేస్తే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం. జనంలో భయం, అవగాహన క్షల్పించేందుకే చట్టాన్ని కఠినంగా రూపొందించాము.75 గజాల లోపు స్థలాలు ఉన్న వారు ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు. 76 - 600 గజాల స్థలం ఉన్న వారు ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలి. 21 రోజుల్లో అనుమతి ఇస్తాం.ఎలక్ట్రానిక్ ఆఫీసు వ్యవస్థ ద్వారా ఎవరైనా.. కావాలని అనుమతి నిలుపుదల చేస్తే సదరు అధికారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఇల్లు పర్మిషన్ తీసుకుని ఆరు నెలల్లో కట్టకపోతే పర్మిషన్ రద్దు అవుతుంది. మూడేళ్ళలో మొత్తం ఇల్లు పూర్తి చేస్తాం. కొత్తగా ఏర్పడిన 68మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ వ్యవస్థను తీసుకు వస్తాం. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే రోడ్లపై ఉన్న అన్ని ప్రార్థన మందిరాలను తొలగిస్తా’ మని కేటీఆర్ పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పురపాలకులపై కలెక్టర్లకు పెత్తనం ఇవ్వడం దారుణం. ఐఏఎస్‌లకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఫ్లెక్సీలకు విరుద్ధం అని చెబుతున్న మంత్రి ఫ్లెక్సీలే.. నగరంలో ఎక్కువగా ఉన్నాయి. ఫ్లెక్సీల వల్ల నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. ఫంక్షన్‌హాల్స్‌లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని’ తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలు తగ్గించవద్దని ముందు నుంచే చెబుతున్నాం. ఈ బిల్లు కఠినమైన బిల్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్నులు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా వార్డుల విభజనపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోనుండి. చెత్త తీయకపోతే, లైట్ వేయకపోతే స్థానిక ప్రజాప్రతినిధులను తీసువేస్తామని చెప్పడం సరికాద’న్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ గ్రామాల ప్రజలకు చట్టంపై అవగాహన వచ్చే వరకు కొత్త మున్సిపల్ చట్టం అమలు చేయకూడదు. నేను ఒక బహుళ అంతస్థుల భవనం నిర్మించేందుకు అనుమతి తీసుకోవడం కోసం ఆరేళ్ళ సమయం పట్టింద’ని తెలిపారు. రోడ్ల మీద ఉన్న ప్రార్థన మందిరాలు తొలగించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు కాకుండా మున్సిపల్ కౌన్సిల్‌కే ఇవ్వాలి కోరారు.