counsling
-
జూన్ 19 నుంచి ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని (జోసా) కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. అందుకు అనుగుణంగా జోసా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను వచ్చే నెల 14న ఐఐటీ రూర్కీ ప్రకటించనుంది. దీంతో వచ్చే నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాలను చేపట్టేందుకు జోసా చర్యలు చేపట్టింది. మొత్తానికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మొత్తం 42 వేల సీట్ల భర్తీని జూలై 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 39,425 సీట్ల భర్తీకి ఏడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించిన జోసా ఈసారి అవసరమైతే 8 దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి 2 వేలకు పైగా ఈడబ్ల్యూఎస్ కోటా, బాలికల కోటా కింద సూపర్‌న్యూమరరీ సీట్లు రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 42 వేలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 39 వేల సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొదట్లో 2.24 లక్షల మంది విద్యార్థులనే ఎంపిక చేసింది. అయితే అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో చివరకు 2,31,024 మందిని అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతి ఇచ్చింది. కానీ అందులోనూ అడ్వాన్స్‌డ్‌కు 1,65,656 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పలు కాలే జీల్లో సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి జేఈఈ మెయిన్‌లో టాప్ 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పించింది. అయితే ఈసారి ఎంత మంది దరఖాస్తు చేస్తారో వేచిచూడాల్సిందే. నేటి నుంచి దరఖాస్తులు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను ఈనెల 3 నుంచి స్వీకరించేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.45 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన దాదాపు 35 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన వారిలో ఓపెన్ కేటగిరీలో 1,13,925 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 9,800 మంది, ఓబీసీలో 66,150 మంది, ఎస్సీలో 36,750 మంది, ఎస్టీల్లో 18,375 మంది ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రధాన తేదీలు ఈనెల 3 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 9 సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు అవకాశం. ఈనెల 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఈనెల 27న: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష. జూన్ 4న జవాబు పత్రాల కీలు విడుదల. జూన్ 14న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 14, 15 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 17న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు 21న ఫలితాలు జూన్ 19 నుంచి జూలై 15 వరకు సీట్ల కేటాయింపు -
ఒకేరోజు 1200 మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్
-వేగవంతమైన ప్రక్రియ -అకాలవర్షంతో ఇబ్బందిపడ్డ ఉపాధ్యాయులు ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం గడువులోపు ముగుస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమైన తరుణంలో ఆదివారం ఒక్క రోజే 1200 మంది స్పెషల్ గ్రేడ్ టీచర్లకు(ఎస్జీటీలకు) కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండడంతో దాదాపు 1500 మంది వరకూ తప్పనిసరి బదిలీలు కావాలి్సన ఉపాధ్యాయులు శని ఆదివారాల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. పాయింట్లు అధికంగా ఉండి తమకు కావాలి్సన ప్రాంతాల్లో చోటు లభిస్తుందని భావించి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయుల్లో చాలా మందికి కోరుకున్న చోటు దక్కడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత వేగవంతమైంది. సోమవారం 2001 నుంచి 3105 నంబర్ వరకూ ఉన్న ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్ఎస్ గంగా భవానీ తెలిపారు. వీరితోపాటు ఏజెన్సీ ప్రాంత ఎస్జీటీలకు, ప్రభుత్వ ఎస్జీటీలకు, అడ్‌హక్ పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్లకూ సోమవారమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం కౌన్సెలింగ్ జరుగుతుండగా సాయంత్రం సుమారు 4.30 గంటల నుంచి మొదలైన వర్షం వల్ల ఉపాధ్యాయులు అసౌకర్యానికి గురయ్యారు. టెంట్లలో వర్షపు నీరు కారడంతో కౌన్సెలింగ్ కొద్దిసేపు నిలిచింది. వారంలో విధుల్లో చేరాలి బదిలీ అయిన ఉపాధ్యాయులు వారంలోగా కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉందని డీఈఓ ఆర్.ఎస్.గంగా భవానీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్చేసే విషయంలో కొన్ని సూచనలు పాటించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. lఒక్క ఉపాధ్యాయుడు/ సబ్జెక్ట్ టీచర్ ఉన్న పాఠశాలలో ఆ స్థానంలో వేరొక టీచర్ వచ్చే వరకూ రిలీవ్ చేయరాదు. lఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో ఇద్దరూ బదిలీ అయ్యి ఉత్తర్వులు పొందితే వారిలో జూనియర్ ఉపాధ్యాయుడు తన సబ్‌స్టిట్యూట్ వచ్చే వరకూ రిలీవ్ కారాదు. lముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో ముగ్గురూ బదిలీ ఉత్తర్వులు పొందితే వారిలో ఇద్దరు జూనియర్ టీచర్లు తమ సబ్‌స్టిట్యూట్ వచ్చే వరకూ రిలీవ్ కారాదు. lనలుగురు ఉపాధ్యాయులున్న పాఠశాలలో నలుగురూ బదిలీ ఉత్తర్వులు పొందితే వారిలో ఇద్దరు జూనియర్ ఉపాధ్యాయులు తమ స్థానంలో వేరొకరు వచ్చే వరకూ రిలీవ్ కాకూడదు. l11 మంది పనిచేస్తున్న పాఠశాలలో అందరూ బదిలీ అయితే వారిలో ఆరుగురు జూనియర్లు సబ్‌స్టిట్యూట్ వచ్చే వరకూ రిలీవ్ కారాదు. -
టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం
సాంకేతిక సమస్యతో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రధానోపాధ్యాయుల వరకే పరిమితం కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 134 మంది హెచ్ఎంలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. మే నెల 31న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెలువరించిన నాటి నుంచి అనేక మలుపులు తిరిగిన బదిలీల ప్రక్రియ ప్రారంభం నాడు కూడా అనుమానాలు రేకెత్తించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం దాదాపు 6 గంటల వరకూ ప్రారంభం కాలేదు. దీంతో ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఈ ప్రక్రియలో పాల్గొనడంతో ఉదయమే హాజరైన వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకూ 25 సార్లు బదిలీలపై జీఓలు, సవరణలు, 5 సార్లు షెడ్యూళ్లు విడుదల చేయడంతో ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి రావడం, బదిలీ నిబంధనల్లో గందరగోళ పరిస్థితులు ఉపాధ్యాయులకు తలనొప్పిగా పరిణమించాయి. సాంకేతిక సమస్యతో ఆలస్యం స్థానిక సెయింట్ థెరిస్సా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉదయం ఏడు గంటలకే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని, ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. చివరిగా సాయంత్రం 6 గంటలకు కౌన్సెలింగ్ జరుగుతుందని విద్యాశాఖాధికారులు ప్రకటించడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం ప్రారంభమైన బదిలీల్లో 134 మంది ప్రధానోపాధ్యాయులు వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై ప్రదర్శించిన స్థానాల నుంచి తమకు నచ్చిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. రాత్రి సుమారు 9.30 గంటల వరకూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, తప్పనిసరి బదిలీలు కావాల్సిన ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 9.30 గంటల నుంచి ఇటీవల అడహక్ విధానంలో పదోన్నతులు పొందిన ప్రదానోపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ విధానాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవాని పర్యవేక్షించారు. కాగా ఆదివారం కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో 190 మంది పీఈటీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని గంగాభవాని తెలిపారు. -
18న ఓయూ ఎంఈడీ కౌన్సెలింగ్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూసెట్-2015లో భాగంగా ఎంఈడీ కోర్సులో ప్రవేశానికి తొలిసారిగా ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహించనునట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలలో గల 242 సీట్ల భర్తీకి ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 18న ఉదయం 9 గంటల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానునట్లు చెప్పారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
విద్యార్థులు లేకున్నా కౌన్సెలింగ్!
• 26 నుంచి పీజీఈసెట్ వెబ్ ఆప్షన్లు • ఫీజులు ఇవ్వని ప్రభుత్వం... •సర్టిఫికెట్లను నిరాకరించిన కాలేజీలు •గందరగోళంగా విద్యార్థుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా వేల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన విద్యార్థుల్లో అనేకమంది ఇప్పటికీ... బీటెక్ సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈనెల 26 నుంచి ఎంటెక్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ సిద్ధమైంది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోలేని వారంతా విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పు చేసో, మరెలాగో కాలేజీలకు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకున్నవారు మాత్రం ఈనెల 14వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారు మాత్రమే ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి చదువుకొని, డబ్బు చెల్లించలేక సర్టిఫికెట్లను తెచ్చుకోలేని వారి గురించి మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన 43,776 మందిలో 38,882 మంది అర్హత సాధించారు. వారిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 16 వేల మంది మాత్రమే. మిగతా వారిలో చాలా మంది కాలేజీలకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక.. వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. దీనికితోడు ఈనెల 14వ తేదీ తరువాత సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి వెరిఫికేషన్ అవకాశం లేకపోవడంతో.. వారంతా ఆందోళన చెందుతున్నారు. సర్కారు ‘ఫీజు’ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు విలువైన ఒక ఏడాది సమయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. -
పద్ధతి మార్చుకోకపోతే జైలుకే...
ఈవ్‌టీజర్లకు డీసీపీ రమారాజేశ్వరి హెచ్చరిక 11 మంది ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్ హైదరాబాద్: షీ-టీమ్స్‌కు పట్టుబడిన ఈవ్‌టీజర్లు కౌన్సెలింగ్ తర్వాత తమ పద్ధతి మార్చుకోకపోతే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని మల్కాజిగిరి డీసీపీ, షీ-టీమ్స్ నోడల్ అధికారి రమారాజేశ్వరి హెచ్చరించారు. సోమవారం 11 మంది ఈవ్‌టీజర్లను అరెస్టు చేసిన సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షీ-టీమ్స్ పని తీరును ఆమె వివరించారు. కేపీహెచ్‌బీ, ఉప్పల్, జీడిమెట్ల ప్రాంతాలలో ఈవ్‌టీజింగ్ ఎక్కువగా ఉందన్నారు. సైబరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు గతనెల 24న 60 షీ-టీమ్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఈస్ట్‌జోన్‌లో 5, వెస్ట్‌జోన్‌లో 11 ప్రాంతాలల్లో 45 మంది పట్టుబడ్డారన్నారు. వీరంద రిపై సిటీ పోలీసు యాక్ట్ కింద కేసు నమోదు చేసి క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్ (కావ్) సెల్లో నిపుణులతో వారి కుటుంబ సభ్యుల ముందే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. వీరు తమ పద్ధతి మార్చుకుని మంచిగా ఉంటే సరేనని, మరోసారి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే మాత్రం ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ముఖ్యంగా ఐటీ జోన్ అయిన మాదాపూర్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, మియాపూర్, చందానగర్‌లలో 10 షీ-టీమ్స్ తిరుగుతున్నాయన్నారు. బస్టాపులు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు, సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఈవ్‌టీజింగ్‌పై గట్టి నిఘా వేశామన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిని సాక్ష్యాలతో సహా వీడియో తీస్తున్నామన్నారు. మహిళా కానిస్టేబుళ్లతో డెకాయి ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొన్న బాధితులు 100 డయల్‌కు ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లోనే షీ-టీమ్ అక్కడికి చేరుకొని పోకిరీల భరతం పడుతుందన్నారు. సమావేశంలో క్రైమ్స్ ఏసీపీ ఉష, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ స్నేహిత పాల్గొన్నారు. తాజాగా పట్టుబడిన ఈవ్‌టీజర్లు షీ-టీమ్స్ ప్రచారంలో పాలు పంచుకుంటారని చెప్పారు. కళాశాలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ దుష్ఫలితాలపై వివరిస్తారన్నారు. షీ-టీమ్స్ మహిళా కానిస్టేబుళ్లు విలేకరుల సమావేశానికి ‘షీ-టీమ్స్ సైబరాబాద్’ మాస్క్‌ను ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.