టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం
టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం
Published Sun, Jul 23 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
సాంకేతిక సమస్యతో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్
ప్రధానోపాధ్యాయుల వరకే పరిమితం
కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 134 మంది హెచ్‌ఎంలు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. మే నెల 31న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెలువరించిన నాటి నుంచి అనేక మలుపులు తిరిగిన బదిలీల ప్రక్రియ ప్రారంభం నాడు కూడా అనుమానాలు రేకెత్తించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం దాదాపు 6 గంటల వరకూ ప్రారంభం కాలేదు. దీంతో ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. చాలామంది రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఈ ప్రక్రియలో పాల్గొనడంతో ఉదయమే హాజరైన వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకూ 25 సార్లు బదిలీలపై జీఓలు, సవరణలు, 5 సార్లు షెడ్యూళ్లు విడుదల చేయడంతో ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి రావడం, బదిలీ నిబంధనల్లో గందరగోళ పరిస్థితులు ఉపాధ్యాయులకు తలనొప్పిగా పరిణమించాయి.
సాంకేతిక సమస్యతో ఆలస్యం
స్థానిక సెయింట్ థెరిస్సా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉదయం ఏడు గంటలకే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని, ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. చివరిగా సాయంత్రం 6 గంటలకు కౌన్సెలింగ్ జరుగుతుందని విద్యాశాఖాధికారులు ప్రకటించడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం ప్రారంభమైన బదిలీల్లో 134 మంది ప్రధానోపాధ్యాయులు వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై ప్రదర్శించిన స్థానాల నుంచి తమకు నచ్చిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. రాత్రి సుమారు 9.30 గంటల వరకూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, తప్పనిసరి బదిలీలు కావాల్సిన ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 9.30 గంటల నుంచి ఇటీవల అడహక్ విధానంలో పదోన్నతులు పొందిన ప్రదానోపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ విధానాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్ గంగాభవాని పర్యవేక్షించారు. కాగా ఆదివారం కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో 190 మంది పీఈటీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని గంగాభవాని తెలిపారు.
Advertisement
Advertisement