సాంకేతికమక
సాంకేతికమక
Published Fri, Jul 28 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
మందకొడిగా బదిలీల ప్రక్రియ
సమీపిస్తున్న గడువు
టీచర్ల ఆందోళన
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైన నాటి నుంచి షెడ్యూలుకు విరుద్ధంగానే కొనసాగుతోంది. బదిలీల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభించి ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే నిర్వహించాలి. ఐతే ప్రారంభమైన నాటి నుంచి ఏ ఒక్క రోజూ షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ జరగలేదు. తొలిరోజు నుంచి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉండడంతో కొన్ని పోస్టులకు కౌన్సెలింగ్ వాయిదాపడుతూ వస్తోంది. అయినా ఎలాగోలా కొనసాగిస్తున్న అధికారులు గురువారం తలెత్తిన సమస్యను పరిష్కరించలేక పోవడంతో ఆ రోజు కౌన్సెలింగ్‌లను పూర్తిగా రద్దు చేశారు.
అసలు షెడ్యూల్ ఇలా..
22న ఉదయం జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులు132, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్, పీడీ 56, పీఈటీలు 191 మందికి కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది.. 23న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)552, స్కూల్ అసిస్టెంట్ (హిందీ)142 మంది.. 24న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)230, స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం)19 మంది
మధ్యాహ్నం భాషా పండితులు (తెలుగు) 212, హిందీ 179, ఉర్దూ 01, సంస్కృతం 02, మందికి కౌన్సెలింగ్ జరగాలి. 25న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (గణితం) 728 మంది, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 522 మంది, పీఎస్‌హెచ్‌ఎంలు 151 మందికి, 26న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (బయాలజికల్ సైన్స్) 494, సోషల్ స్టడీస్ 393 మంది మందికి కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. 27 నుండి 31వ తేది వరకు స్పెషల్ గ్రేడ్ టీచర్లు (తెలుగు) జాబితా ప్రకారం ఉదయం 350 మంది, సాయంత్రం 350 మందికి, 31వ తేది మధ్యాహ్నం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఉర్దూ) 9 మందికి కౌన్సెలింగ్ జరగాలి.
సాంకేతిక కారణాలతో ఆలస్యం..
బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి సాంకేతిక కారణాలతో మందకొడిగా జరుగుతున్నాయి. సీనియారిటీ ప్రకారం ముందుగా తమకు నచ్చిన స్థానాలు కోరుకున్న ఉపాధ్యాయులు ఆ మేరకు బదిలీ ఉత్తర్వులు పొందుతుండగా ఆ స్థానాలు జాబితా నుండి తొలగిపోవాల్సి ఉంది. అయితే తరువాత కోరుకునే ఉపాధ్యాయులకు కూడా ముందుగా ఉపాధ్యాయులు కోరుకున్న స్థానాలు కూడా ప్రదర్శితం కావడంతో ఉపాధ్యాయులు, అధికారులు గందరగోళానికి గురయ్యారు. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన స్పెషల్‌గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీల్లో కూడా ఒకే రెవెన్యూ పంచాయితీలోని రెండు మూడు గ్రామాల్లో స్థానాలు కోరుకోవచ్చని నిబంధనలు తెలుపుతుండగా ఆ మేరకు వెబ్‌సైట్‌లో ఆయా రెవెన్యూ పంచాతీలను ఒకే స్థానంగా చూపడంతో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం లేవనెత్తాయి. దీంతో గురువారం కౌన్సెలింగ్ ప్రక్రియను రద్దు చేశారు. దానిని శుక్రవారం నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ సాఫ్టవేర్‌లో ఆ ఇబ్బంది తొలగక పోవడంతో శుక్రవారం ఉదయం తెలుగు లాంగ్వేజ్ పండిట్లు 212 మందికి, హిందీ లాంగ్వేజ్ పండిట్లు 179 మందికి, సంస్కృతం లాంగ్వేజ్ పండిట్లు 02 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
మూడురోజుల్లో 3176 మందికి సాధ్యమయ్యేనా..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 31వ తేదీ నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేసి ఉపాధ్యాయులు ఆగష్టు 1వ తేదీన తమ కొత్త స్థానాల్లో జాయిన్ కావాల్సి ఉంది. ఐతే స్పెషల్ గ్రేడ్ టీచర్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 3176 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాలి. అంటే రోజుకి సుమారు 1050 మందికి కౌన్సెలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రోజుకి సుమారు 700 నుంచి 800 మందికంటే ఎక్కువ మందికి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లెక్కన ఆగష్టు 1వ తేదీన కూడా కౌన్సెలింగ్ నిర్వహించాల్సి వస్తుంది. అలాగైతే 1వ తేదీన కౌన్సెలింగ్ జరిగే ఉపాధ్యాయులు ఆ తరువాతి నెల జీతాలు అందుకోవడంలో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
ఎట్టి పరిస్థితిలోనూ పూర్తి చేస్తాం..
ఆర్‌ఎస్ గంగాభవాని, జిల్లా విద్యా శాఖాధికారి..
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరునాటికి కౌన్సెలింగ్ పూర్తి చేస్తాం. ఉపాధ్యాయులకు ఎటువంటి నష్టం జరుగకుండా చూస్తాం. ఆగష్టు 1వ తేదీ నాటికి బదిలీలు పొందిన ఉపాధ్యాయులందరూ తమ నూతన స్థానాల్లో జాయిన్ కావాలి.
Advertisement