Course of life
-
అన్నిటికీ భయమే... ఏం చేయను?!
జీవన గమనం నేను బీఈడీ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో పెరిగాను. మానసికంగా చాలా కుంగిపోయాను. దానివల్ల యాంగ్జయిటీ కూడా వచ్చేసింది. ప్రతిక్షణం భవిష్యత్ గురించి భయమే. చదువు మీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నాను. రేపు ఏమవుతుందో, నా జీవితం ఎలా ఉంటుందో అనే చింత. ఈ భయం పోయేదెలా? - నవ్యశ్రీ, ఊరు రాయలేదు చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగానన్నారు. కానీ ఎటువంటి కష్టాలో రాయలేదు. కష్టాలు మూడు రకాలు. ఆరోగ్యం, మానసికం, ఆర్థికం. కొన్ని నియంత్రణల ద్వారా శారీరక కష్టాలను కొంతవరకు అధిగమించొచ్చు. సరైన పద్ధతులు తెలిస్తే, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా అంత కష్టం కాదు. కానీ మానసిక సమస్యలు మాత్రం చాలా వరకూ మనం కల్పించుకున్నవే. ఇదంతా చెబుతున్నది కేవలం మీ కష్టాల్ని మీరు విశ్లేషించుకోవడానికి! మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా చదివి మంచి ఉద్యోగానికి ప్రయత్నించండి. రేపు ఏమవుతుందోనన్న భయం ఉందన్నారు. ఇంతకన్నా ఇంకేమవుతుంది? కష్టాలు మనిషిని రాటుదేల్చాలి. అంతే తప్ప మరింత ఆందోళనకు గురి చెయ్యకూడదు. యాంగ్జయిటీ చీకట్లో నల్లపిల్లి లాంటి భ్రాంతి. ఉనికి లేకుండా భయపెడుతుంది. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో విజయం సాధించిన తొంభై శాతం వ్యక్తులు కష్టాల్లోంచి వచ్చినవారే. ఆ స్ఫూర్తితో ముందుకు సాగండి. ఈ మధ్య చాలామంది పిల్లల గురించి మాట్లాడుతూ మా పిల్లలు హైపర్ యాక్టివ్ అంటున్నారు. నేను చాలా సందర్భాల్లో పిల్లల విషయంలో హైపర్ యాక్టివ్ అన్న మాట విన్నాను. అసలు ఈ మాటకు అర్థం ఏమిటి? పిల్లలు అలా ఉండాలా ఉండకూడదా? - సుమతి, రాజమండ్రి విపరీతమైన అల్లరి, ఒక చోట కుదురుగా ఉండకపోవటం, చేతిలో వస్తువులు గిరాటు వేయటం, టీవీ చానల్స్ తరచూ మారుస్తూ దేనితోనూ సంతృప్తి చెందకపోవడం మొదలైన విశేషణాలను హైపర్ అంటారు. అయితే హైపర్ యాక్టివ్‌గా ఉండటం కన్నా, లేకపోవటం (ఆటిజం) భయపడాల్సిన పరిస్థితి. అలాంటి పిల్లలు మన్ను తిన్న పాముల్లాగా ఎంతో నెమ్మదిగా ఉంటారు. అంతకంటే హైపర్‌గా ఉండటం ఎంతో మేలు. ఆలోచించకుండా సమాధానం చెప్పటం, పరిణామం ఆలోచించకుండా పని చెయ్యటం కూడా హైపరే. సరదాగా ఒక ఉదాహరణ చెబుతాను. కేవలం సరదాగానే సుమా! కోహ్లీ 94, ఇషాంత్‌శర్మ 94 పరుగుల్లో ఉన్నారు. అదే ఆఖరి వికెట్టు. ఇద్దరిలో ఎవరు అవుటయినా ఇండియా ఓడిపోతుంది. రెండు బంతుల్లో ఏడు పరుగులు తీయాలి. అంతకన్నా ఎక్కువ పరుగులే తీసి గెలిచింది మన జట్టు. అంతిమ స్కోర్లు: కోహ్లీ- 100, శర్మ - 100. ఇదెలా సాధ్యమయింది? దీనికి నాలుగు రకాల సమాధానాలు న్నాయి. మీ పిల్లల్ని ఆలోచించమనండి. వాళ్లు క్షణం కూడా ఆలోచించకుండా ‘నో బాల్’ అని అరిచారనుకోండి. ‘హైపర్’కి అదే గుర్తు. చిన్నతనంలో పిల్లల్లో హైపర్-యాక్టివిటీ మంచి లక్షణం. కొంత వయసు వచ్చాక (అంటే దాదాపు పన్నెండేళ్లు దాటాక) నిబద్ధత, నమ్రత, నెమ్మది అలవాటవ్వాలి. అలా అలవాటవ్వని పిల్లల హైపర్ - యాక్టివిటీని తగ్గించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో వీటి గురించి చర్చ జరిగింది. అవి తెలుసుకుంటే సరిపోతుంది. నేను అన్ని విషయాల్లోనూ తెలివిగానే ఉంటాను. కానీ నాకు భయం చాలా ఎక్కువ. పదిమందిలో మాట్లాడలేను. ఒక్కడినే ఏ పనినీ చక్కబెట్టుకోలేను. ఏం చెయ్యాలన్నా ఏదో గుబులుగా ఉంటుంది. ఎందుకో నాక్కూడా తెలియదు. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? - ఓ సోదరుడు అన్నిటికీ భయపడేవాడు అసమర్థుడు. దేనికీ భయపడనివాడు మూర్ఖుడు. దేనికి భయపడాలో తెలుసుకున్నవాడు జ్ఞాని. సహేతుక భయానికి జాగ్రత్త పడేవాడు మేధావి. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను వచ్చిందంటే అది నిన్ను భయపెట్టడానికి కాదు. తుఫానులో పడవ ఎలా నడపాలో నీకు నేర్పడానికి. కొంతమందికి అన్నిటికీ భయమే. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడ లేరు. అంటే వాళ్లలో ఏ గిల్టో, అభద్రతా భావమో ఉందన్నమాట. అదే నీ కళ్లలోకి ఎవరూ చూసి మాట్లాడటం లేదంటే నిన్ను ప్రేమించడం లేదనో లేక నువ్వు ఎవరికీ ప్రేమను ఇవ్వలేకపోతున్నావనో అర్థం. రెండు సందర్భాల్లోనూ నీదే తప్పు. -
నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనుంది.. కానీ..?
జీవన గమనం నేనో ప్రభుత్వ ఉద్యోగిని. మూడేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కానీ మా ఇంట్లో వాళ్లు వేరే కులం అమ్మాయిని చేసుకుంటే మా బంధువులకు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది అంటున్నారు. వాళ్ల మాట వినాలనే ఉంది. కానీ మావాళ్ల అభిప్రాయం విని ఆ అమ్మాయి ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తన ఇంట్లో పరిస్థితులు కూడా బాలేదు. తను చాలా మంచి అమ్మాయి. తనకి అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి. - బీఎన్, ప్రకాశం జిల్లా ఆ అమ్మాయి మీ పట్ల గాఢమైన ప్రేమలో ఉన్నదా లేక మిమ్మల్ని ఎమో షనల్‌గా మార్చి వివాహం చేసుకోవడం కోసం ఆత్మహత్యాప్రయత్నం చేసిందా అన్నది నిర్ధారించుకోండి. మూడేళ్లుగా ప్రేమలో ఉండి, ఇంకా ఈ విషయాన్ని ఎందుకు నానుస్తున్నారు? కేవలం కులం కారణంగా ఓ అమ్మాయిని దూరం పెట్టాలి అనుకున్నప్పుడు... ఆ అమ్మాయిని ముగ్గు లోకి దింపేముందు ఆ విషయం తెలియ లేదా? ఇంతదూరం వచ్చాక ఎలా వెనక్కు వెళ్లగలరు? మీ పెద్దవాళ్లతో చర్చించి, ఒప్పించండి. ప్రేమించిన అమ్మాయిని శాశ్వతంగా దూరం చేసుకోవడం కన్నా, కేవలం ఆ అమ్మాయిని చేసుకున్నందుకే దూరం అయిపోయే బంధువులను శాశ్వతంగా దూరం చేసుకోవడం మంచిది. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనుంది. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోతే భవిష్యత్తు మొత్తం పాడైపోతుందేమోనని భయం. ఇప్పుడు నా వయసు ఇరవై. నేను రాజకీయాల్లోకి ఎలా వెళ్లాలి? అసలు వెళ్లాలా వద్దా? - కృష్ణపాల్, మెయిల్ చాలామంది రాజకీయాల్లోకి వెళ్లి, విజయం సాధించలేక వెనక్కి వచ్చారు. కొంతమంది అందులోనే ఆస్తులు పోగొట్టు కున్నారు. కొంతమంది ఖాళీ చేతులతో వెళ్లి కోట్లు సంపాదించారు. ఇది కేవలం రాజకీయాలకే కాదు, ఏ రంగానికైనా వర్తి స్తుంది. చదువు పాడు చేసుకుని, భారత దేశం తరఫున క్రికెట్ ఆడి కోట్లు సంపా దిద్దామనుకున్న కుర్రవాళ్లు... రంజీ కూడా ఆడలేక రెంటికీ చెడ్డ రేవళ్లవడం గమనించి ఉంటారు. అలా అని అసలు ప్రయత్నమే చేయకపోతే అది మరీ దారుణం. ముందు రాజకీయ నాయకుడికి కావలసిన నాయ కత్వ లక్షణాల్ని అలవర్చుకోండి. పది మందిలో మాట్లాడ గలగడం, పరిచయ మైన వ్యక్తుల పేర్లతో సహా అన్ని విష యాలు/వివరాలు గుర్తు పెట్టుకోవడం మొదలైనవన్నీ అభివృద్ధి చేసుకోండి. ఏ పార్టీలో చేరాలి, ఏ విధంగా ఎదగాలి అన్నది క్రమక్రమంగా మీకే తెలుస్తుంది. మీకు ప్రస్తుతం ఇరవయ్యేళ్లే అన్నారు కాబట్టి, చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు రాజకీయాల్లో స్థిరపడి, ఒక స్థానం సంపాదించే స్థాయికి వచ్చే సరికి మరో దశాబ్దకాలం పట్టవచ్చు. అప్పటికి రాజకీయ నాయకుల వెనుక ఎన్ని విద్యార్హతలున్నాయి అని ప్రజలు గమనించే స్థితి వస్తుంది. పూర్వంలాగా నిరక్షరాస్యులైన రాజకీయ నాయకులని అంతగా ఆదరించకపోవచ్చు. కాబట్టి చదువుకుంటూనే మీకు ఇష్టమైన రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిం చండి. అప్పుడు ఒకవేళ అక్కడ నెగ్గక పోయినా మీకు పోయేదేమీ ఉండదు. నాకు ముప్ఫయ్యేళ్లు. మావారికి అరవై. తన భార్య చనిపోతే పదేళ్ల క్రితం నన్ను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించు కోవడం వల్ల నాకు పిల్లలు కూడా లేరు. ఆపరేషన్ సంగతి దాచిపెట్టి పెళ్లాడారు. నేను ఇన్నేళ్లలో సంతోషంగా గడిపిన సందర్భాలను వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. అయితే ఈ మధ్య నా జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. నా కష్టాల్ని అర్థం చేసుకున్నాడు. కన్నీళ్లు తుడుస్తు న్నాడు. నా సంతోషం ముఖ్యమనుకునే తనకి దగ్గరవ్వాలని ఉంది. కానీ నాకంటే ఆరు నెలలు చిన్నవాడు. తనకి దగ్గరవ్వొచ్చా? లేక సంప్రదా యాలకు, తాళికి విలువిచ్చి ఏ సంతోషం లేని ఈ జీవితంతో సర్దుకుపోవాలా? - ఓ సోదరి, చిత్తూరు మీ ప్రశ్న కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ‘అతనికి దగ్గర కావాలని ఉంది’ అని రాశారు. అంటే కేవలం శారీరకంగా అతనికి దగ్గరవ్వాలనా లేక మీవారికి విడాకులిచ్చి అతణ్ని చేసుకోవాలనా? మొదటిదే అయితే అందులో రిస్క్ ఉంది. సాధారణంగా ఇలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవవు. మీరు అతణ్ని ఎక్కువ కాలం హోల్డ్ చేయలేరు. అతనికి వివాహం జరిగిందో లేదో మీరు రాయలేదు. అతడికి వివాహం జరిగినా, మీమీద ఆసక్తి తగ్గి పోయి క్రమక్రమంగా దూరమైనా మరింత మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. అదీగాక మీ భర్తకి ఈ విషయాలు తెలిసే రిస్కు ఎలానూ ఉన్నది కదా! ఒకవేళ మీరు మీ భర్తకి విడాకులిచ్చి అతణ్ని వివాహం చేసుకోవాలనుకుంటే... అతను మీకన్నా చిన్నవాడన్నది అసలు సమస్యే కాదు. మంచి లాయరును సంప్రదించి అనుకున్నది చేయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. భర్తతో సుఖం లేని స్త్రీకి దగ్గర కావడానికి చాలామంది మగవాళ్లు సిద్ధంగా ఉంటారు. మీ స్నేహితుడు అటువంటివాడు అవునో కాదో తెలుసుకోవడం చాలా అవసరం. చివరిగా ఒక మాట. నిరాసక్తమైన జీవితం ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. అయితే ఆ సుఖప్రదంలో రిస్క్ ఎలిమెంట్ ఉండ కూడదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. -
ప్రేమను పెత్తనం అంటోంది... ఏం చేయను?
జీవన గమనం మాదో మధ్య తరగతి కుటుంబం. పైగా ఉమ్మడి కుటుంబం. నేను ఇంట్లో చిన్న కోడలిని. అందుకనో ఏమో, అందరూ ప్రతి పనీ నాకే చెబుతారు. ఇద్దరు తోటి కోడళ్లు ఉన్నా అత్తగారు, మామగారు మంచినీళ్ల దగ్గర్నుంచి ప్రతిదీ నన్నే అడుగుతారు. అలా అని ప్రాముఖ్యతనిస్తారా అంటే అదీ లేదు. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలను కున్నప్పుడు మాత్రం పెద్ద కోడళ్లిద్దరితోనే చెప్తారు. నేనెంత సర్దుకుపోదామన్నా ఇలాంటివి నన్ను బాధపెడుతున్నాయి. పైగా పని చేసీ చేసీ విసుగు పుడుతోంది. నేనూ మీలాంటిదాన్నే కదా అని అడిగేద్దామంటే తోటికోడళ్లు ఏమనుకుంటారోనని భయం. నాకు వాళ్లంటే ఇష్టమే. కానీ మరీ ఇంతగా అడ్జస్ట్ అవ్వాలంటే కష్టంగా ఉంది. నా బాధ వాళ్లకు అర్థమవ్వాలంటే ఏం చేయాలి? - శ్రీవల్లి, నెల్లూరు జాయింట్ ఫ్యామిలీలో ఇలాంటివన్నీ మామూలే శ్రీవల్లిగారూ! కొత్త కోడలికే సీనియర్లు పని చెప్పడం, మిగతా కుటుంబ సభ్యులు ఏమాత్రం ప్రాముఖ్యత నివ్వకపోవడం సాధారణంగా కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు రాసిన ఈ సమస్య మీ భర్తతో చర్చించారో లేదో చెప్పలేదు. ముందు ఆ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా కలిసి ఉండాలా లేక విడిగా వెళ్లిపోవడానికి ఆస్కారం ఉందా అనేది మీ భర్తని ఆలోచించమనండి. అయితే ప్రతి సమస్యకీ పరిష్కారం దూరంగా వెళ్లిపోవడం కాదు. చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు లోతుగా ఆలోచించి బాధ పడుతున్నారేమో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ వివాహం జరిగి ఎంత కాలమైంది? మీకు సంతానం ఉన్నారా? ఒకవేళ ఇంకా లేకపోతే, ఎలాగూ మీరు తల్లి అవుతున్న కాలంలో కొంతకాలం పుట్టింట్లోనే ఉంటారు. ఆ తర్వాత బిడ్డ సేవతో చాలాకాలం గడిచిపోతుంది. అప్పుడు ఆటోమేటిగ్గా ఇంట్లోవాళ్లంతా మీకు దగ్గరవుతారు. ఈ కోణంలో ఆలోచించి చూడండి. నేనో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాను. కొన్నాళ్లు బాగానే కలిసున్నా, తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. ఆఫీసు నుంచి త్వరగా వచ్చేది కాదు. ఫోన్ చేస్తే తీసేది కాదు. ఎప్పటికో ఇంటికొచ్చేది. అడిగితే ఫ్రెండ్‌తో రెస్టారెంటుకు వెళ్లాననో, కొలీగ్ ఇంట్లో పార్టీకి వెళ్లాననో అనేది. ఓ మాట చెప్పొచ్చు కదా అంటే నాకా మాత్రం స్వేచ్ఛ లేదా అంటూ అరిచేది. చివరికి ఓసారి నాతో చెప్పకుండా వేరే ఊరు కూడా వెళ్లిపోయింది. తిరిగొచ్చాక కోప్పడ్డాను. దాంతో ఆవేశంగా నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను తనను హింసిస్తున్నా నంటూ కేసు పెట్టింది. రెండేళ్లుగా ఆ కేసు తేలక నరకం అనుభవిస్తున్నాను. నేను చేసిన తప్పేంటి? ఎక్కడున్నావో తెలియకపోతే టెన్షన్‌గా ఉంటుంది, ఓ మాట చెప్పమనడమేనా? దానికి ఇలా కోర్టుల చుట్టూ తిప్పాలా? - గంగాధర్, రాజమండ్రి మీ ఉత్తరం కేవలం మీ తరఫు నుంచి రాసినట్లు ఉంది. ఏ అమ్మాయీ కూడా కారణం లేకుండా తన భర్తపై కేసు పెట్టదు. ఆఫీసు నుంచి త్వరగా రాకపోవడం, మీరు ఫోన్ చేసినా తీయకపోవడం, మీమీద గట్టిగా అరవడం మొదలైనవన్నీ మీ అభియోగాలు. ఆమె ఒప్పుకుంటే ఓసారి ఇద్దరూ కలిసి మ్యారేజ్ కౌన్సెలర్ దగ్గరకు వెళ్లండి. కానీ మీరు రాసిన ఉత్తరం ప్రకారం ఆమె బహుశా దీనికి ఒప్పుకోకపోవచ్చు. విడాకులు ఒక్కటే మీ సమస్యకు పరిష్కారంగా కనబడుతోంది. నాకు ఈ మధ్యనే ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చెరర్‌గా ఉద్యోగం వచ్చింది. నిజానికి నేను మొదట్నుంచీ బాగా చదివేవాడిని. కానీ నాకు భయం చాలా ఎక్కువ. రోడ్డుమీద వెళ్తుంటే ఎవరైనా నన్ను కొట్టి దోచుకుంటారేమోనని భయం. కొత్త టెక్నాలజీ వాడాలంటే భయం. పొడవుగా ఉన్నవాళ్లను చూసినా, భారీ కాయుల్ని చూసినా భయం. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మరీ భయం. నా ఈ భయాల గురించి ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ మధ్య నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇన్ని భయాలున్న నేను ఆ అమ్మాయిని ఏం సుఖపెట్టగలుగుతాను? అందుకే పెళ్లి చేసుకోబుద్ధి కావడం లేదు. ఒకవేళ నా గురించి ఆ అమ్మాయికి ముందే చెబుదామంటే, చెప్పాక చేసుకోదేమోనని భయం. ఇప్పుడు నేనేం చేయాలి? - కుమార్, హైదరాబాద్ భయాలు, ఫోబియాలు రకరకాలుగా ఉంటాయి. కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో ఏ మానసిక శాస్త్రవేత్త అయినా మీ భయాన్ని తొలగించగలడు. అయితే దీనికి ‘పారనాయిడ్’ అని పేరు పెట్టి, వేలల్లో ఫీజు వసూలు చేసే ఫేక్ డాక్టర్ల దగ్గరకు మాత్రం వెళ్లకండి. మీ భయాలకూ వివాహానికీ ఏ సంబంధమూ లేదు. పెళ్లికి ముందే మీ భయాల గురించి ఆ అమ్మాయికి చెబుతారా లేదా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఉత్తరంలో రాసిన భయాలేవీ కంగారు పడాల్సినంత ఫోబియాలు కాదు. దాచిపెట్టేటంత రహస్యాలూ కాదు. యండమూరి వీరేంద్రనాథ్