ప్రేమను పెత్తనం అంటోంది... ఏం చేయను? | Course of life | Sakshi
Sakshi News home page

ప్రేమను పెత్తనం అంటోంది... ఏం చేయను?

Published Sun, Jan 17 2016 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

ప్రేమను పెత్తనం అంటోంది... ఏం చేయను?

ప్రేమను పెత్తనం అంటోంది... ఏం చేయను?

జీవన గమనం
  మాదో మధ్య తరగతి కుటుంబం. పైగా ఉమ్మడి కుటుంబం. నేను ఇంట్లో చిన్న కోడలిని. అందుకనో ఏమో, అందరూ ప్రతి పనీ నాకే చెబుతారు. ఇద్దరు తోటి కోడళ్లు ఉన్నా అత్తగారు, మామగారు మంచినీళ్ల దగ్గర్నుంచి ప్రతిదీ నన్నే అడుగుతారు. అలా అని ప్రాముఖ్యతనిస్తారా అంటే అదీ లేదు. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలను కున్నప్పుడు మాత్రం పెద్ద కోడళ్లిద్దరితోనే చెప్తారు. నేనెంత సర్దుకుపోదామన్నా ఇలాంటివి నన్ను బాధపెడుతున్నాయి. పైగా పని చేసీ చేసీ విసుగు పుడుతోంది. నేనూ మీలాంటిదాన్నే కదా అని అడిగేద్దామంటే తోటికోడళ్లు ఏమనుకుంటారోనని భయం. నాకు వాళ్లంటే ఇష్టమే. కానీ మరీ ఇంతగా అడ్జస్ట్ అవ్వాలంటే కష్టంగా ఉంది. నా బాధ వాళ్లకు అర్థమవ్వాలంటే ఏం చేయాలి?
 - శ్రీవల్లి, నెల్లూరు
  జాయింట్ ఫ్యామిలీలో ఇలాంటివన్నీ మామూలే శ్రీవల్లిగారూ! కొత్త కోడలికే సీనియర్లు పని చెప్పడం, మిగతా కుటుంబ సభ్యులు ఏమాత్రం ప్రాముఖ్యత నివ్వకపోవడం సాధారణంగా కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు రాసిన ఈ సమస్య మీ భర్తతో చర్చించారో లేదో చెప్పలేదు. ముందు ఆ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా కలిసి ఉండాలా లేక విడిగా వెళ్లిపోవడానికి ఆస్కారం ఉందా అనేది మీ భర్తని ఆలోచించమనండి. అయితే ప్రతి సమస్యకీ పరిష్కారం దూరంగా వెళ్లిపోవడం కాదు. చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు లోతుగా ఆలోచించి బాధ పడుతున్నారేమో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ వివాహం జరిగి ఎంత కాలమైంది? మీకు సంతానం ఉన్నారా? ఒకవేళ ఇంకా లేకపోతే, ఎలాగూ మీరు తల్లి అవుతున్న కాలంలో కొంతకాలం పుట్టింట్లోనే ఉంటారు. ఆ తర్వాత బిడ్డ సేవతో చాలాకాలం గడిచిపోతుంది. అప్పుడు ఆటోమేటిగ్గా ఇంట్లోవాళ్లంతా మీకు దగ్గరవుతారు. ఈ కోణంలో ఆలోచించి చూడండి.
 
   నేనో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాను. కొన్నాళ్లు బాగానే కలిసున్నా, తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. ఆఫీసు నుంచి త్వరగా వచ్చేది కాదు. ఫోన్ చేస్తే తీసేది కాదు. ఎప్పటికో ఇంటికొచ్చేది. అడిగితే ఫ్రెండ్‌తో రెస్టారెంటుకు వెళ్లాననో, కొలీగ్ ఇంట్లో పార్టీకి వెళ్లాననో అనేది. ఓ మాట చెప్పొచ్చు కదా అంటే నాకా మాత్రం స్వేచ్ఛ లేదా అంటూ అరిచేది. చివరికి ఓసారి నాతో చెప్పకుండా వేరే ఊరు కూడా వెళ్లిపోయింది. తిరిగొచ్చాక కోప్పడ్డాను. దాంతో ఆవేశంగా నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను తనను హింసిస్తున్నా నంటూ కేసు పెట్టింది. రెండేళ్లుగా ఆ కేసు తేలక నరకం అనుభవిస్తున్నాను. నేను చేసిన తప్పేంటి? ఎక్కడున్నావో తెలియకపోతే టెన్షన్‌గా ఉంటుంది, ఓ మాట చెప్పమనడమేనా? దానికి ఇలా కోర్టుల చుట్టూ తిప్పాలా?
 - గంగాధర్, రాజమండ్రి
 మీ ఉత్తరం కేవలం మీ తరఫు నుంచి రాసినట్లు ఉంది. ఏ అమ్మాయీ కూడా కారణం లేకుండా తన భర్తపై కేసు పెట్టదు. ఆఫీసు నుంచి త్వరగా రాకపోవడం, మీరు ఫోన్ చేసినా తీయకపోవడం, మీమీద గట్టిగా అరవడం మొదలైనవన్నీ మీ అభియోగాలు. ఆమె ఒప్పుకుంటే ఓసారి ఇద్దరూ కలిసి మ్యారేజ్ కౌన్సెలర్ దగ్గరకు వెళ్లండి. కానీ మీరు రాసిన ఉత్తరం ప్రకారం ఆమె బహుశా దీనికి ఒప్పుకోకపోవచ్చు. విడాకులు ఒక్కటే మీ సమస్యకు పరిష్కారంగా కనబడుతోంది.
 
  నాకు ఈ మధ్యనే ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చెరర్‌గా ఉద్యోగం వచ్చింది. నిజానికి నేను మొదట్నుంచీ బాగా చదివేవాడిని. కానీ నాకు భయం చాలా ఎక్కువ. రోడ్డుమీద వెళ్తుంటే ఎవరైనా నన్ను కొట్టి దోచుకుంటారేమోనని భయం. కొత్త టెక్నాలజీ వాడాలంటే భయం. పొడవుగా ఉన్నవాళ్లను చూసినా, భారీ కాయుల్ని చూసినా భయం. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మరీ భయం. నా ఈ భయాల గురించి ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ మధ్య నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇన్ని భయాలున్న నేను ఆ అమ్మాయిని ఏం సుఖపెట్టగలుగుతాను? అందుకే పెళ్లి చేసుకోబుద్ధి కావడం లేదు. ఒకవేళ నా గురించి ఆ అమ్మాయికి ముందే చెబుదామంటే, చెప్పాక చేసుకోదేమోనని భయం. ఇప్పుడు నేనేం చేయాలి?
 - కుమార్, హైదరాబాద్
 భయాలు, ఫోబియాలు రకరకాలుగా ఉంటాయి. కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో ఏ మానసిక శాస్త్రవేత్త అయినా మీ భయాన్ని తొలగించగలడు. అయితే దీనికి ‘పారనాయిడ్’ అని పేరు పెట్టి, వేలల్లో ఫీజు వసూలు చేసే ఫేక్ డాక్టర్ల దగ్గరకు మాత్రం వెళ్లకండి. మీ భయాలకూ వివాహానికీ ఏ సంబంధమూ లేదు. పెళ్లికి ముందే మీ భయాల గురించి ఆ అమ్మాయికి చెబుతారా లేదా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఉత్తరంలో రాసిన భయాలేవీ కంగారు పడాల్సినంత ఫోబియాలు కాదు. దాచిపెట్టేటంత రహస్యాలూ కాదు.
 యండమూరి వీరేంద్రనాథ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement