కోదండ రామిరెడ్డి, దశరథ్, యండమూరి వీరేంద్రనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, అమర్
దిండు కింద నల్లత్రాచు... ఈ ఊహే ఎంతో భయంకరంగా ఉంది. ఇలాంటి ఊహ ఒకటి వచ్చి, దానిని కథగా మలిచి నవలల పోటీకి పంపితే 50000 రూపాయల బహుమతి గెలిచింది. ఆ కథను రాసింది, ఆ బహుమతి గెలిచింది ఎవరో కాదు.. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఇప్పుడు ఆ కథను ‘దుప్పట్లో మిన్నాగు’ పేరుతో సినిమాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా దర్శకుడు యండమూరి మాట్లాడుతూ– ‘‘12 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియాతో ఈ కథ రాయటం జరిగింది. కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపోయిన తన తండ్రిని ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది? ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు. ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘యండమూరి రచనలకు నేను అభిమానిని. విశిష్టమైన రచయిత. నా ఆలోచనలకు ఇంథనం ఇచ్చే రచనలు ఆయనవి. సెలబ్రిటీల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగు తెలిసినవారందరికీ ఆయన తెలుసు. అన్ని తరహా పాఠకులకు ఆయన శైలి నచ్చుతుంది. ఇప్పుడు సినిమా చేస్తున్నారు.
ఆయన సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కాంటెంపరరీ దర్శకులకు ఏ మాత్రం తక్కువ కాకుండా అడ్వాన్స్‌డ్‌గా సినిమా తీశారు యండమూరి గారు’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. బాగుంది. ఇప్పుడున్న పరిణామాలకు కరెక్ట్‌గా సరిపోయే సినిమా ఇది. యండమూరి రచించిన 12 నవలలను సినిమాలుగా తీశాను. అన్నీ సూపర్‌హిట్టే’’ అన్నారు. చిత్రనిర్మాత అమర్ మాట్లాడుతూ– ‘‘1992 నుండి ఇండస్ట్రీలో ఉండి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీస్తున్నాను. ఇది నా మొదటి చిత్రం. యండమూరిగారితో సినిమా తీయటం ఆనందంగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment