నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనుంది.. కానీ..?
జీవన గమనం
నేనో ప్రభుత్వ ఉద్యోగిని. మూడేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కానీ మా ఇంట్లో వాళ్లు వేరే కులం అమ్మాయిని చేసుకుంటే మా బంధువులకు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది అంటున్నారు. వాళ్ల మాట వినాలనే ఉంది. కానీ మావాళ్ల అభిప్రాయం విని ఆ అమ్మాయి ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తన ఇంట్లో పరిస్థితులు కూడా బాలేదు. తను చాలా మంచి అమ్మాయి. తనకి అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- బీఎన్, ప్రకాశం జిల్లా
ఆ అమ్మాయి మీ పట్ల గాఢమైన ప్రేమలో ఉన్నదా లేక మిమ్మల్ని ఎమో షనల్‌గా మార్చి వివాహం చేసుకోవడం కోసం ఆత్మహత్యాప్రయత్నం చేసిందా అన్నది నిర్ధారించుకోండి. మూడేళ్లుగా ప్రేమలో ఉండి, ఇంకా ఈ విషయాన్ని ఎందుకు నానుస్తున్నారు? కేవలం కులం కారణంగా ఓ అమ్మాయిని దూరం పెట్టాలి అనుకున్నప్పుడు... ఆ అమ్మాయిని ముగ్గు లోకి దింపేముందు ఆ విషయం తెలియ లేదా? ఇంతదూరం వచ్చాక ఎలా వెనక్కు వెళ్లగలరు? మీ పెద్దవాళ్లతో చర్చించి, ఒప్పించండి. ప్రేమించిన అమ్మాయిని శాశ్వతంగా దూరం చేసుకోవడం కన్నా, కేవలం ఆ అమ్మాయిని చేసుకున్నందుకే దూరం అయిపోయే బంధువులను శాశ్వతంగా దూరం చేసుకోవడం మంచిది.
నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనుంది. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోతే భవిష్యత్తు మొత్తం పాడైపోతుందేమోనని భయం. ఇప్పుడు నా వయసు ఇరవై. నేను రాజకీయాల్లోకి ఎలా వెళ్లాలి? అసలు వెళ్లాలా వద్దా?
- కృష్ణపాల్, మెయిల్
చాలామంది రాజకీయాల్లోకి వెళ్లి, విజయం సాధించలేక వెనక్కి వచ్చారు. కొంతమంది అందులోనే ఆస్తులు పోగొట్టు కున్నారు. కొంతమంది ఖాళీ చేతులతో వెళ్లి కోట్లు సంపాదించారు. ఇది కేవలం రాజకీయాలకే కాదు, ఏ రంగానికైనా వర్తి స్తుంది. చదువు పాడు చేసుకుని, భారత దేశం తరఫున క్రికెట్ ఆడి కోట్లు సంపా దిద్దామనుకున్న కుర్రవాళ్లు... రంజీ కూడా ఆడలేక రెంటికీ చెడ్డ రేవళ్లవడం గమనించి ఉంటారు. అలా అని అసలు ప్రయత్నమే చేయకపోతే అది మరీ దారుణం. ముందు రాజకీయ నాయకుడికి కావలసిన నాయ కత్వ లక్షణాల్ని అలవర్చుకోండి. పది మందిలో మాట్లాడ గలగడం, పరిచయ మైన వ్యక్తుల పేర్లతో సహా అన్ని విష యాలు/వివరాలు గుర్తు పెట్టుకోవడం మొదలైనవన్నీ అభివృద్ధి చేసుకోండి. ఏ పార్టీలో చేరాలి, ఏ విధంగా ఎదగాలి అన్నది క్రమక్రమంగా మీకే తెలుస్తుంది. మీకు ప్రస్తుతం ఇరవయ్యేళ్లే అన్నారు కాబట్టి, చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు రాజకీయాల్లో స్థిరపడి, ఒక స్థానం సంపాదించే స్థాయికి వచ్చే సరికి మరో దశాబ్దకాలం పట్టవచ్చు. అప్పటికి రాజకీయ నాయకుల వెనుక ఎన్ని విద్యార్హతలున్నాయి అని ప్రజలు గమనించే స్థితి వస్తుంది. పూర్వంలాగా నిరక్షరాస్యులైన రాజకీయ నాయకులని అంతగా ఆదరించకపోవచ్చు. కాబట్టి చదువుకుంటూనే మీకు ఇష్టమైన రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిం చండి. అప్పుడు ఒకవేళ అక్కడ నెగ్గక పోయినా మీకు పోయేదేమీ ఉండదు.
నాకు ముప్ఫయ్యేళ్లు. మావారికి అరవై. తన భార్య చనిపోతే పదేళ్ల క్రితం నన్ను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించు కోవడం వల్ల నాకు పిల్లలు కూడా లేరు. ఆపరేషన్ సంగతి దాచిపెట్టి పెళ్లాడారు. నేను ఇన్నేళ్లలో సంతోషంగా గడిపిన సందర్భాలను వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. అయితే ఈ మధ్య నా జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. నా కష్టాల్ని అర్థం చేసుకున్నాడు. కన్నీళ్లు తుడుస్తు న్నాడు. నా సంతోషం ముఖ్యమనుకునే తనకి దగ్గరవ్వాలని ఉంది. కానీ నాకంటే ఆరు నెలలు చిన్నవాడు. తనకి దగ్గరవ్వొచ్చా? లేక సంప్రదా యాలకు, తాళికి విలువిచ్చి ఏ సంతోషం లేని ఈ జీవితంతో సర్దుకుపోవాలా?
- ఓ సోదరి, చిత్తూరు
మీ ప్రశ్న కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ‘అతనికి దగ్గర కావాలని ఉంది’ అని రాశారు. అంటే కేవలం శారీరకంగా అతనికి దగ్గరవ్వాలనా లేక మీవారికి విడాకులిచ్చి అతణ్ని చేసుకోవాలనా? మొదటిదే అయితే అందులో రిస్క్ ఉంది. సాధారణంగా ఇలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవవు. మీరు అతణ్ని ఎక్కువ కాలం హోల్డ్ చేయలేరు. అతనికి వివాహం జరిగిందో లేదో మీరు రాయలేదు. అతడికి వివాహం జరిగినా, మీమీద ఆసక్తి తగ్గి పోయి క్రమక్రమంగా దూరమైనా మరింత మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. అదీగాక మీ భర్తకి ఈ విషయాలు తెలిసే రిస్కు ఎలానూ ఉన్నది కదా! ఒకవేళ మీరు మీ భర్తకి విడాకులిచ్చి అతణ్ని వివాహం చేసుకోవాలనుకుంటే... అతను మీకన్నా చిన్నవాడన్నది అసలు సమస్యే కాదు. మంచి లాయరును సంప్రదించి అనుకున్నది చేయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. భర్తతో సుఖం లేని స్త్రీకి దగ్గర కావడానికి చాలామంది మగవాళ్లు సిద్ధంగా ఉంటారు. మీ స్నేహితుడు అటువంటివాడు అవునో కాదో తెలుసుకోవడం చాలా అవసరం. చివరిగా ఒక మాట. నిరాసక్తమైన జీవితం ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. అయితే ఆ సుఖప్రదంలో రిస్క్ ఎలిమెంట్ ఉండ కూడదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.