అన్నిటికీ భయమే... ఏం చేయను?!
జీవన గమనం
నేను బీఈడీ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో పెరిగాను. మానసికంగా చాలా కుంగిపోయాను. దానివల్ల యాంగ్జయిటీ కూడా వచ్చేసింది. ప్రతిక్షణం భవిష్యత్ గురించి భయమే. చదువు మీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నాను. రేపు ఏమవుతుందో, నా జీవితం ఎలా ఉంటుందో అనే చింత. ఈ భయం పోయేదెలా?
- నవ్యశ్రీ, ఊరు రాయలేదు
చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగానన్నారు. కానీ ఎటువంటి కష్టాలో రాయలేదు. కష్టాలు మూడు రకాలు. ఆరోగ్యం, మానసికం, ఆర్థికం. కొన్ని నియంత్రణల ద్వారా శారీరక కష్టాలను కొంతవరకు అధిగమించొచ్చు. సరైన పద్ధతులు తెలిస్తే, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా అంత కష్టం కాదు. కానీ మానసిక సమస్యలు మాత్రం చాలా వరకూ మనం కల్పించుకున్నవే. ఇదంతా చెబుతున్నది కేవలం మీ కష్టాల్ని మీరు విశ్లేషించుకోవడానికి!
మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా చదివి మంచి ఉద్యోగానికి ప్రయత్నించండి. రేపు ఏమవుతుందోనన్న భయం ఉందన్నారు. ఇంతకన్నా ఇంకేమవుతుంది? కష్టాలు మనిషిని రాటుదేల్చాలి. అంతే తప్ప మరింత ఆందోళనకు గురి చెయ్యకూడదు. యాంగ్జయిటీ చీకట్లో నల్లపిల్లి లాంటి భ్రాంతి. ఉనికి లేకుండా భయపెడుతుంది. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో విజయం సాధించిన తొంభై శాతం వ్యక్తులు కష్టాల్లోంచి వచ్చినవారే. ఆ స్ఫూర్తితో ముందుకు సాగండి.
ఈ మధ్య చాలామంది పిల్లల గురించి మాట్లాడుతూ మా పిల్లలు హైపర్ యాక్టివ్ అంటున్నారు. నేను చాలా సందర్భాల్లో పిల్లల విషయంలో హైపర్ యాక్టివ్ అన్న మాట విన్నాను. అసలు ఈ మాటకు అర్థం ఏమిటి? పిల్లలు అలా ఉండాలా ఉండకూడదా?
- సుమతి, రాజమండ్రి
విపరీతమైన అల్లరి, ఒక చోట కుదురుగా ఉండకపోవటం, చేతిలో వస్తువులు గిరాటు వేయటం, టీవీ చానల్స్ తరచూ మారుస్తూ దేనితోనూ సంతృప్తి చెందకపోవడం మొదలైన విశేషణాలను హైపర్ అంటారు.
అయితే హైపర్ యాక్టివ్‌గా ఉండటం కన్నా, లేకపోవటం (ఆటిజం) భయపడాల్సిన పరిస్థితి. అలాంటి పిల్లలు మన్ను తిన్న పాముల్లాగా ఎంతో నెమ్మదిగా ఉంటారు. అంతకంటే హైపర్‌గా ఉండటం ఎంతో మేలు. ఆలోచించకుండా సమాధానం చెప్పటం, పరిణామం ఆలోచించకుండా పని చెయ్యటం కూడా హైపరే. సరదాగా ఒక ఉదాహరణ చెబుతాను. కేవలం సరదాగానే సుమా!
కోహ్లీ 94, ఇషాంత్‌శర్మ 94 పరుగుల్లో ఉన్నారు. అదే ఆఖరి వికెట్టు. ఇద్దరిలో ఎవరు అవుటయినా ఇండియా ఓడిపోతుంది. రెండు బంతుల్లో ఏడు పరుగులు తీయాలి. అంతకన్నా ఎక్కువ పరుగులే తీసి గెలిచింది మన జట్టు. అంతిమ స్కోర్లు: కోహ్లీ- 100, శర్మ - 100. ఇదెలా సాధ్యమయింది?
దీనికి నాలుగు రకాల సమాధానాలు న్నాయి. మీ పిల్లల్ని ఆలోచించమనండి. వాళ్లు క్షణం కూడా ఆలోచించకుండా ‘నో బాల్’ అని అరిచారనుకోండి. ‘హైపర్’కి అదే గుర్తు. చిన్నతనంలో పిల్లల్లో హైపర్-యాక్టివిటీ మంచి లక్షణం. కొంత వయసు వచ్చాక (అంటే దాదాపు పన్నెండేళ్లు దాటాక) నిబద్ధత, నమ్రత, నెమ్మది అలవాటవ్వాలి. అలా అలవాటవ్వని పిల్లల హైపర్ - యాక్టివిటీని తగ్గించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో వీటి గురించి చర్చ జరిగింది. అవి తెలుసుకుంటే సరిపోతుంది.
నేను అన్ని విషయాల్లోనూ తెలివిగానే ఉంటాను. కానీ నాకు భయం చాలా ఎక్కువ. పదిమందిలో మాట్లాడలేను. ఒక్కడినే ఏ పనినీ చక్కబెట్టుకోలేను. ఏం చెయ్యాలన్నా ఏదో గుబులుగా ఉంటుంది. ఎందుకో నాక్కూడా తెలియదు. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి?
- ఓ సోదరుడు
అన్నిటికీ భయపడేవాడు అసమర్థుడు. దేనికీ భయపడనివాడు మూర్ఖుడు. దేనికి భయపడాలో తెలుసుకున్నవాడు జ్ఞాని. సహేతుక భయానికి జాగ్రత్త పడేవాడు మేధావి. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను వచ్చిందంటే అది నిన్ను భయపెట్టడానికి కాదు. తుఫానులో పడవ ఎలా నడపాలో నీకు నేర్పడానికి. కొంతమందికి అన్నిటికీ భయమే. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడ లేరు. అంటే వాళ్లలో ఏ గిల్టో, అభద్రతా భావమో ఉందన్నమాట. అదే నీ కళ్లలోకి ఎవరూ చూసి మాట్లాడటం లేదంటే నిన్ను ప్రేమించడం లేదనో లేక నువ్వు ఎవరికీ ప్రేమను ఇవ్వలేకపోతున్నావనో అర్థం. రెండు సందర్భాల్లోనూ నీదే తప్పు.