నితీష్‌కుమార్‌కు కోర్టు షాక్
జేడీ(యూ) నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టు షాకిచ్చింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికపై స్టే విధించింది. దాంతో నితీష్ మద్దతుదారులు కంగుతిని, ఆ నిర్ణయాన్ని సవాలుచేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తన స్టేను ఉపసంహరించుకోవాలంటూ మాజీ మంత్రి, నితీష్ సన్నిహితుడు పీకే షాహి పిటిషన్ దాఖలు చేశారు.
నితీష్ ఎన్నిక సరికాదంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి సన్నిహితుడిగా పేరొందిన రాజేశ్వర్ రాజ్ అనే ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలుచేయడంతో.. కోర్టు నితీష్ ఎన్నికపై స్టే ఇచ్చింది. దీనిపై ఈనెల 17న విచారణ జరుపుతామని చెప్పింది. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో నితీష్‌ను కొత్త నాయకుడిగా ప్రకటించడాన్ని రాజ్ కోర్టులో సవాలుచేశారు. శరద్ యాదవ్ నిర్ణయం అప్రజాస్వామికమని మాంఝీ కూడా మండిపడ్డారు. కాగా.. మాంఝీని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు పార్టీ చీఫ్ విప్ శ్రవణ్ కుమార్ సోమవారమే చెప్పారు.