మనిషి ప్రాణానికి రూ.26, ఆవు ప్రాణానికి రూ.70
న్యూఢిల్లీ: సాంస్కృతికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్న భారత దేశంలో మనిషి ప్రాణాలు ఎక్కువ విలువైనవా? ఆవు ప్రాణాలు ఎక్కువ విలువైనవా? అని ఎవరైనాఅడిగితే గతంలోనైతే ఏమాత్రం ఆలోచించకుండా మనిషి ప్రాణాలే ఎక్కువ విలువైనవని చెప్పేవారు. గోమాంసం పేరిట మనుషులను గొడ్డులాబాది ప్రాణాలను తీస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లో మనిషి ప్రాణం కన్నా ఆవు ప్రాణమే కచ్చితంగా విలువైనదని చెప్పవచ్చు! అందుకే రాజస్థాన్లోని వసుంధర రాజే ప్రభుత్వం కూడా పేదలకిచ్చే విలువకన్నా ఆవులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు.
దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు వసుంధర రాజె ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ప్రతి వ్యక్తిపై రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ప్రతి ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను ఖర్చు పెడుతున్నది. అదే దూడలపై 35 రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. ఇది కేవలం వాటి దాణా కోసం వెచ్చిస్తున్న సొమ్ము మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ప్రజల నుంచే రాబట్టేందుకు 33 రకాల ప్రజల లావాదేవీలపై పది శాతం ఆవు సెస్సును విధిస్తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై కూడా ఎన్నడూ శ్రద్ధ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గోసంరక్షణ శాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జైపూర్లోని హింగోనియా గోసంరక్షణ శాలలో వేలాది ఆవులు మరణించడమే అందుకు కారణం కావచ్చు. అధునాతన హంగులతో రాష్ట్రంలో పలు గోసంరక్షణ శాలలను నిర్మించాలని, వేళకు వాటికి దాణా అందుతుందో, లేదో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఎంతోకాలంపాటు గోవుల ఆలనా, పాలనా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెలలో గోసంరక్షణ కోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ సమావేశమై ఆవుల మేత కోసం ఒక్కో ఆవుపై రోజుకు 32 రూపాయలను, ప్రతి దూడపై 16 రూపాయలను ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మూడు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించి, అమలు చేసింది కూడా. మళ్లీ ఏప్రిల్ మాసంలో ఈ కమిటీ రాజస్థాన్లోని 13 జిల్లాల మున్సిపల్ అధికారులతో సమావేశమై ఒక్కో అవుపై ఖర్చుపెట్టే మొత్తాన్ని 70 రూపాయలకు, దూడపై పెట్టే ఖర్చుపెట్టే మొత్తాన్ని 35 రూపాయలకు పెంచాలని తీర్మానించింది. పెరిగిన ఈ అదనపు భారాన్ని ప్రజల నుంచి ఏ రూపంలో వసూలు చేయాలని ఇప్పుడు మున్సిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి.
రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాకు చెందిన రషీద్ దారిద్య్ర రేఖకు దిగువున జీవిస్తున్నాడు. ఆయన రోజు రిక్షా తొక్కడం ద్వారా రోజుకు 60 నుంచి 70 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో తన ఖర్చులుపోనూ ఉంటున్న గుడెశెకు అద్దె చెల్లించాలి. భార్యా, ఇద్దరు పిల్లలను పోషించాలి. రాజస్థాన్లో దాదాపు 30 శాతం మంది రషీద్ లాంటి వారు ఉన్నారు. వారి బతుకులు అలా తెల్లారిపోవాల్సిందేనా!.