cr foundation
-
సీఆర్ ఫౌండేషన్‌కు ఎస్బీఐ వాహనం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలను ఆదుకోవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు. అవసరమైనవారికి వివిధ రూపాల్లో ఎస్బీఐ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా సాయం అందిస్తోందని తెలిపారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు మారుతీ ఈకో ఏడు సీట్ల వ్యాన్‌ను శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యక్తిగా సామాజికసేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో 75 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు స్వామినాథన్ జానకిరామన్ తెలిపారు. బ్యాంక్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు, సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలతో బలహీనవర్గాలను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఫణీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
అత్యాచార నిందితుడి అరెస్టు
సాక్షి యాలాల(హైదరాబాద్) : జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కిందట కేసు నమోదుతో పాటు అత్యాచార కేసును నమోదు చేసినట్లు చెప్పారు. యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డితో కలిసి విశ్వనాథ్‌పూర్ గ్రామంలో బాధిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన అనంతరం జరిగిన పరిణామాలను బాధితురాలి తల్లిని అడిగి తెలుసుకున్నారు. సమాజానికి చీడగా మారిన ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మతిస్థితిమితం లేని బాలికపై నక్కల శేఖర్ అత్యాచారం చేసిన ఘటనతో గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని పలువురు గ్రామస్తులు పోలీసుల ఎదుట వాపోయారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఇంటి వద్ద మారణా యుధాలతో సంచరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ నిందితుడి కుటుంబసభ్యులు దౌర్జన్యానికి పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. నిందితుడికి కోర్టులో కఠినశిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. త్వరలో గ్రామంలో పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిందితుడు శేఖర్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట సర్పంచ్ సత్యమ్మ, వైస్ ఎంపీపీ పసుల రమేశ్ ఉన్నారు. -
ఏబీకే ప్రసాద్‌కు సతీవియోగం
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలకు ఆమె మృతి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకు చెందిన సుధారాణిని, కృష్ణా జిల్లా ఉప్పులూరుకు చెందిన ఏబీకే ప్రసాద్ 1955లో వివా హం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు హేమలత, స్వర్ణలత, విశ్వభారతి, రాధి క ఉన్నారు. ఏబీకే ప్రసాద్ భార్య సుధారాణితో కలసి కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. నివాళులర్పించిన ప్రముఖులు కిమ్స్ ఆస్పత్రి నుంచి మంగళవారం ఉదయం సుధారాణి భౌతికకాయాన్ని సీఆర్ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వర్దెల్లి మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, వార్త ఎడిటర్ సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ, ఇతర పాత్రికేయ ప్రముఖులు నివాళులర్పించారు. ఏబీకే ప్రసాద్‌ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధారాణి చితికి నిప్పంటించిన సోదరుడు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. సుధారాణి చితికి ఆమె సోదరుడు చలసాని వేణుదుర్గాప్రసాద్ నిప్పంటించారు. సుధారాణి మృతితో చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వృద్ధాశ్రమంలోని పలువురు ప్రముఖులు సుధారాణికి నివాళులర్పించారు. ఆప్తురాలిని కోల్పోయామని కన్నీళ్లపర్యంతమయ్యారు. -
'ప్రగతి' ఇంటి పేరు అభ్యుదయం ఆయన ఊరు
*విద్యార్థి నేతగా, ఉద్యమకారుడిగా సేవలు, ప్రగతి హనుమంతరావుగా గుర్తింపు నిరంతర శ్రామికుడు 'ప్రగతి ప్రింటర్స్ హనుమంతరావుగా' రాష్ట్ర ప్రజలకు చిరపరిచితుడైన పరుచూరి హనుమంతరావు సోమవారం రెడ్‌హిల్స్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కేవలం రూ.6వేలతో ఆయన స్థాపించిన ప్రగతి ప్రింటర్స్ సంస్థ నేడు రూ. 200 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. తన ఉద్ధాన పతనాలు, ఒడిదొడుకులపై ఇటీవల ఆయన 'సాక్షి'తో ముచ్చటించారు. కృష్ణాజిల్లాలోని చల్లపల్లి సమీపంలోని చిట్టూర్పుకు చెందిన ఆయన సాధించిన విజయాలపై 'జ్ఞాపకాలు'...ఆయన మాటల్లోనే. ఎన్నో ఢక్కామొక్కీలు ఆ రోజుల్లో మాఊళ్లో బడి లేదు. దగ్గర్లోని అంగలూరు నుంచి ఓ పంతులు వచ్చి ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవారు. ఆయన దగ్గర కొంతకాలం చదువుకున్న తరువాత 3వ ఫారమ్‌కు చల్లపల్లి హైస్కూల్లో చేరాను. మచిలీపట్నంలో ఎస్సెస్సెల్సీ పూర్తయ్యాక హిందూ కాలేజ్‌లో ఇంటర్లో చేరాను. ఒకవైపు చదువుకుంటూనే అఖిల భారత విద్యార్ధి సమాఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాన్ని. మొదటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)పక్షాన బాంబేలో అప్పటి కమ్యూనిస్టు నేత ఎస్.ఎ.డాంగే నేతృత్వంలో తెలుగులో బుర్రకథలను ప్రదర్శించాము. అప్పటి ప్రఖ్యాత రచయిత కె.ఎ.అబ్బాస్ రచించిన ‘హమ్ ఏక్ హై’ హిందీ నాటం మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1956లో 'విశాలాంధ్ర' నుంచి బయటకు ఆ తరువాత విశాలాంధ్ర పత్రికలో చేరాను. వార్తలు రాయడంతో పాటు, ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. తాతినేని చలపతిరావు, మిక్కిలినేని రాధాకృష్ణ, బిఎన్ రెడ్డి, సావిత్రి (నటి), ఎస్.జానకి (గాయని) వంటి వాళ్లంతా ప్రజా నాట్యమండలి నుంచి వచ్చిన వాళ్లే. అప్పటికే పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. తాపీ ధర్మారావు కుమారుడు చాణక్య నా స్నేహితుడు. అతను నాగార్జున ఫిలిమ్స్ స్థాపించి ధర్మారావు రాసిన 'ఎత్తుకు పై ఎత్తు' సినిమా తీశారు. చాణక్య ఆహ్వానం మేరకు సినిమా రంగంలోకి వచ్చాను. అప్పటికే రామకృష్ణ హైదరాబాద్‌లో సారథీ స్టూడియో ఏర్పాటు చేశారు. నాగార్జున ఫిలిమ్స్‌ను కూడా తమతో కలిసి పని చేయాలని కోరడంతో 1957 ఆగస్టు 1న 'నాగార్జున ఫిలిమ్స్'గా తెలుగు సినిమా మొట్టమొదట హైదరాబాద్‌కు వచ్చేసింది. 1958లో 'మా ఇంటి మహాలక్ష్మి' 'ఆత్మబంధువు' వంటి సినిమాలు తీశాము. ఆ సమయంలో నెగెటివ్ ఫిల్మ్ కొరత ఎక్కువగా ఉండడంతో సినిమా రంగంలో ఎంతో కాలం ఉండలేకపోయాను. కదిలిన ఆంధ్ర... వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటంతో తెలంగాణ సమాజం యావత్తు యుద్ధభూమిగా మారింది. ఆ పోరాటానికి మద్ధతుగా ఆంధ్ర జిల్లాలన్నీ కదిలాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేశాము. ఆ రోజుల్లో బ్రిటీష్ మలబారు పోలీసులకు నేతృత్వం వహించిన పళయనప్ప ఆంధ్ర ప్రాంతంపై ఉక్కు పాదం మోపాడు. పోలీసులు నన్ను కూడా అరెస్టు చేశారు.‘ ఆర్ యూ కమ్యూనిస్ట్’ అని అడిగారు. కాదంటే వదిలేసే వాళ్లే. కానీ ‘ఎస్’ అన్నాను గర్వంగా. ఇంకేముంది. తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో వేశారు. 6 నెలల తరువాత కడలూరు జైలుకు మార్చారు. 3 ఏళ్లు అక్కడే ఉన్నాను. ఏకే గోపాలన్, కడియాల గోపాలరావు, మద్దుకూరి చంద్రశేఖర్, విశాలాంధ్ర ఎడిటర్ రాజగోపాల రావు, మోటూరి హనుమంతరావు వంటి పెద్దలంతా ఆ జైల్లోనే పరిచయమయ్యారు. 'ప్రగతి' మార్గంలో... వాసిరెడ్డి సీతాదేవి, నేను కలిసి చెరో రూ.6 వేల పెట్టుబడితో 1962 సెప్టెంబర్ 1వ తేదీన ‘ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్’ ప్రారంభించాము. లక్డికాఫూల్లో రెండు గదులు అద్దెకు తీసుకొని ప్రెస్ ఏర్పాటు చేశాము. నాణ్యత, నమ్మకం రెండింటిని నమ్ముకున్నాము. అప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఒకరిద్దరు ప్రింటర్స్ కంటే ఎక్కువే తీసుకున్నా అదే స్థాయిలో క్వాలిటీ అందించాము. ఆ తరువాత కొద్ది రోజులకు వాసిరెడ్డి సీతాదేవి తన భాగస్వామ్యాన్ని విరమించుకున్నారు. ఏడాదిన్నర కాలంలోనే 70 వేల పుస్తకాల ముద్రణకు ఆర్డర్ వచ్చింది. వ్యాపారం పుంజుకోవడంతో 1978లో లక్డికాఫూల్ నుంచి రెడ్‌హిల్స్‌కు మార్చాము. సంస్థ బహుముఖంగా విస్తరించింది. అత్యాధునిక ప్రింటర్లు, టెక్నాలజీ వాడడంతో దేశవిదేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ప్రింటింగ్ రంగంలో అనేక అవార్డులు లభించాయి. నాకు ఎంతో తృప్తిగా ఉంది అంటూ..ప్రగతి యాత్రను ముగించారు. ప్రజానాట్య మండలిలో.. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో మద్రాసులో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నిర్వహణ బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. తరిమెల నాగిరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి పెద్దలంతా అప్పుడే పరిచయమయ్యారు. -
'ప్రగతి' హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని విస్పర్ వ్యాలీలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో మరణించిన విషయం తెలిసిందే. -
'ప్రగతి' హనుమంతరావు కన్నుమూత
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సోమవారం మరణించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం, స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న హనుమంతరావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణాజిల్లా చిట్టూర్పులో 1921లో జన్మించిన పరుచూరి హనుమంతరావు బందరు హిందూ హైస్కూల్లో మెట్రిక్ వరకు చదివారు. మద్రాసు పచ్చయ్యప్ప కాలేజి నుంచి బి.ఏ. పూర్తిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని రాజమండ్రి, కడలూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. బొంబాయి పీపుల్స్ ధియేటర్లో బలరాజ్ సహానీ వంటి ప్రముఖులతో కలిసి నాటక ప్రదర్శనలిచ్చారు. 1962లో హైదరాబాద్‌లో ప్రగతి ప్రెస్ స్థాపించి మంచి ప్రమాణాలు పాటించారు.