అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి యాలాల(హైదరాబాద్) : జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కిందట కేసు నమోదుతో పాటు అత్యాచార కేసును నమోదు చేసినట్లు చెప్పారు. యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డితో కలిసి విశ్వనాథ్‌పూర్ గ్రామంలో బాధిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
సంఘటన అనంతరం జరిగిన పరిణామాలను బాధితురాలి తల్లిని అడిగి తెలుసుకున్నారు. సమాజానికి చీడగా మారిన ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మతిస్థితిమితం లేని బాలికపై నక్కల శేఖర్ అత్యాచారం చేసిన ఘటనతో గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని పలువురు గ్రామస్తులు పోలీసుల ఎదుట వాపోయారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఇంటి వద్ద మారణా యుధాలతో సంచరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ నిందితుడి కుటుంబసభ్యులు దౌర్జన్యానికి పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. నిందితుడికి కోర్టులో కఠినశిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. త్వరలో గ్రామంలో పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిందితుడు శేఖర్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట సర్పంచ్ సత్యమ్మ, వైస్ ఎంపీపీ పసుల రమేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment