Credit Guarantee Scheme
-
లఘు, చిన్న పరిశ్రమలకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ) ద్వారా ఇచ్చే క్రెడిట్ గ్యారెంటీలను వచ్చే రెండేళ్లలో మరో రూ. 5 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదనపు కార్యదర్శి, డెవెలప్మెంట్ కమిషనర్ (లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) రజ్నీష్ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, 22 సంవత్సరాల్లో క్రెడిట్ గ్యారెంటీలు రూ.2.6 లక్షల కోట్లు. అయితే గడచిన రెండేళ్లలో ఈ విలువ రూ. 4 లక్షల కోట్లకు పెరిగింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యమని ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. లఘు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంస్థాగత రుణలను భారీగా అందించడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌ను సంబంధిత మంత్రిత్వశాఖ అలాగే సిడ్బీ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. -
త్వరలో ‘క్రెడిట్ గ్యారంటీ స్కీం’
సాక్షి, హైదరాబాద్: నాబార్డ్ ఆధ్వర్యంలో రాబోయే 4, 5 నెలల్లో వ్యవ సాయరంగంలో ‘క్రెడిట్ గ్యారంటీ స్కీం’ను ప్రారం భించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ గోవిందరాజులు చింతల తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయంలో ఇలాంటి స్కీం లేదని, తొలిసారి నాబార్డ్ ప్రవేశ పెట్టబోతోందని వెల్లడించారు. దీనిద్వారా 85% గ్యారంటీ ఇస్తా మని, దీంతో బ్యాంకులు అనుమానాలు లేకుండా సొసై టీలు, తదితరాలకు సులభంగా రుణాలిచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ‘వ్యవసాయ రంగ వ్యవస్థలోనే బృహత్తర మార్పులకు అవసర మైన చర్యలు చేపడుతున్నాం. రైతులకు రెండింతల ఆదాయం వచ్చేలా సాగు ఖర్చులు తగ్గే దిశగా చర్యల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వ్యవసాయాన్ని మార్కెట్ కేంద్రీకృతంగా చేసేం దుకు గోడౌన్ల సంఖ్య గణనీయంగా పెంచి స్టోరేజీ నిల్వల సామర్థ్యం పెంపుదల వంటి చర్యలు తీసుకుంటాం’అని ఆయన చెప్పారు. నాబార్డ్ చైర్మన్‌గా నియమి తులయ్యాక తొలిసారిగా తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా జీఆర్ చింతలకు అధికారులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డ్ చేపడుతున్న కార్యక్రమాలు, తదితర అంశాలను వివరించారు. వ్యవసాయానికి కొత్త రూపు.. భారత్‌లో ‘కలెక్టివ్ ఫార్మింగ్’కు శ్రీకారం చుట్టి.. దీని ద్వారా దేశ వ్యవస్థలో వ్యవసాయానికి కొత్తరూపు నిస్తామని జీఆర్ చింతల చెప్పారు. నాబార్డ్ ఆధ్వర్యంలో క్రెడిట్ రేటింగ్ అండ్ స్కోరింగ్ మ్యాట్రిక్స్‌ను రూపొందించి, దీంట్లో 60 శాతం దాటిన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు లభించేలా రేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తామని తెలిపారు. ‘క్రెడిట్ గ్యారెంటీ విధానాన్ని బలోపేతం చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి చిన్నాచితకా కలిపి మొత్తం 98 శాతంగా ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, చిన్నవ్యాపారులకు రుణాలు అందేలా మార్పులు చేపడతాం. కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 31 వరకు రూ.80 వేల కోట్ల వరకు రుణాలిచ్చాం. రూ.25 వేల కోట్లు స్పెషల్ ఈక్విటీ ఫండ్ కింద ఇచ్చాం. ఈ ఏడాది నాబార్డ్ బిజినెస్ రూ.5.32 లక్షల కోట్ల నుంచి రూ.ఆరున్నర లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోగలదు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఇంతటి ఘనతను నాబార్డ్ సాధించింది. ఇందులో 40 నుంచి 42 శాతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచే బిజినెస్ ఉంటోంది. వాటిలో రూ.44 వేల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి’అని జీఆర్ చింతల వివరించారు. సహకార, గ్రామీణ బ్యాంక్‌ల బలోపేతం.. దేశంలోని కోటి 8 లక్షల గ్రూప్‌లను ఈ–శక్తి ప్లాట్ ఫాం మీదకు తెచ్చి, వారి క్రెడిట్ ఇంటెన్సిటీని 350 శాతం పెంచేందుకు నాబార్డ్ కొత్త కార్యక్రమాలను చేపడుతోందని జీఆర్ చింతల తెలిపారు. నాబార్డ్ బహుముఖ ప్రయత్నాల్లో భాగంగా సహకార, గ్రామీణ బ్యాంక్‌ల బలోపేతంతో పాటు సహకార రంగంలో పారదర్శకత పెంచేందుకు, రైతులు, కూలీలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ‘సంస్థాగతంగా ఆయా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గత 30 ఏళ్లలో జరగనిది కేవలం 90 రోజుల్లోనే సహకార సంఘాలకు 3 శాతం వడ్డీకే రుణాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాం. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళల ఆదాయం పెంచడంతో పాటు ఆయిల్‌సీడ్ ప్రొడక్షన్ చేపట్టాలని ప్రధాని మోదీకి సూచించగా దాని ప్రాతిపదికన వర్కింగ్ గ్రూప్స్ మొదలయ్యాయి. దీని ద్వారా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. గ్రామీణ బ్యాంక్‌ల కంప్యూటీకరణ, ఈ వ్యవస్థలో చివరి లింక్ అయిన ప్రైమరీ సొసైటీల వరకు కంప్యూటీకరణ పూర్తికి చర్యలు తీసుకుంటుంన్నాం. ఇందుకోసం సహకార అభివృద్ధి నిధి కింద ప్రతీ రాష్ట్రానికి రూ.5 కోట్లు ఇస్తున్నాం. తెలంగాణలో ఇప్పటికే ఇది పూర్తి అయినా ఆ మొత్తాన్ని ఇస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాబార్డ్ రుణాలిచ్చింది. రెండో ప్రాజెక్టుకు మరో రుణం ఇవ్వబోతున్నాం’అని చెప్పారు. తెలంగాణలో రూ.900 కోట్లతో చెక్ డ్యామ్‌లను నిర్మిస్తున్నామని, రుణమాఫీ అనేది రాజకీయ నిర్ణయమని, ఈ మాఫీలకు సంబంధించిన డబ్బులు పూర్తిగా బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే సరిపోతుందని ఒక ప్రశ్నకు జీఆర్ చింతల జవాబిచ్చారు. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలకు ఊరటనిచ్చేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరిన్ని సంస్థలు పాక్షిక రుణ హామీ పథకం (పీసీజీఎస్) పరిధిలోకి వచ్చేలా నిబంధనలు సడలించడంతో పాటు కాల వ్యవధిని జూన్ 30 దాకా పొడిగించింది. దీని కాలపరిమితి వాస్తవానికి మార్చి 31తో తీరిపోయింది. సవరించిన పీసీజీఎస్ ప్రకారం ఏఏ కన్నా తక్కువ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ, హెచ్ఎఫ్సీ బాండ్లను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం వాటిల్లితే.. అందులో సుమారు 20 శాతం దాకా భర్తీ అయ్యేలా ప్రభుత్వం పూచీకత్తునిస్తుంది. మరోవైపు, కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించే దిశగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు ప్రకటించిన రూ. 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల డిఫాల్ట్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఎన్బీఎఫ్సీలు నిధులు దొరక్క సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు రూ. 10,000 కోట్లతో కొత్త పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితో 2,00,000 యూనిట్లకు రుణ ఆధారిత సబ్సిడీని అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. 2024–25 దాకా అయిదేళ్లు ఈ స్కీము అమలవుతుంది. ఆదాయంలో ప్రభుత్వానికి వాటాలిచ్చే ప్రాతిపదికన వాణిజ్య కార్యకలాపాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారన్న అంశం ఆధారంగా కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నాలుగు శాతం వాటా కనీస స్థాయిగా ఉంటుంది. -
దరఖాస్తు చేస్తే చాలు బ్యాంకు రుణం..
రాష్ట్ర స్థాయిలో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కంపెనీల ప్రతిపాదనకు ప్రభుత్వ హామీ 2015-16లో ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాల కోసం పారిశ్రామికవేత్తలు ఇక బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుకై రుణం కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేస్తే చాలు.. రుణం మంజూరయ్యేలా రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ రూపుదిద్దుకుంటోంది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టిందని తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ శుక్రవారం తెలిపారు. పరిశ్రమను స్థాపించేందుకై బ్యాంకులకు వచ్చే ప్రతి దరఖాస్తుకు (ఉత్తమ ప్రతిపాదన) ప్రభుత్వం నుంచి హామీ ఉంటుందన్నారు. ‘బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వానిదే బాధ్యత. నిధులు పక్కదారి పట్టకుండా చూస్తాం. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. కంపెనీ రుణం తీర్చలేకపోతే ఈ ఫండ్ నుంచి బ్యాంకుకు చెల్లిస్తాం’ అని అన్నారు. నిధుల మంజూరుకు బ్యాంకులకు నిర్ణీత గడువు విధిస్తామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ఎంఎస్ఎంఈలకు నిధులు అన్న అంశంపై అసోచాం, ఫ్యాప్సీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. ఖాయిలా పడకుండా.. ఖాయిలా దిశగా వెళ్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ ఫండ్ ఒకదానిని 2015-16 బడ్జెట్లో అమలు చేయనున్నట్టు జయేష్ రంజన్ తెలిపారు. ‘ఫండ్కై కంపెనీల నుంచి ప్రీమియం వసూలు చేస్తాం. ప్రభుత్వం కూడా అవసరమైనన్ని నిధులు సమకూరుస్తుంది. బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాకు కంపెనీకి గడువు ఇస్తాం. అవక తవకలకు పాల్పడితే కంపెనీని సీజ్ చేస్తాం’ అని వెల్లడించారు. ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు భారీ పరిశ్రమల తోడ్పాటు తప్పనిసరి అన్నారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. రుణ దరఖాస్తులు ఎలా సిద్ధం చేయాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఫండింగ్ ఒక్కటే చాలదని, సమయానుకూలంగా వ్యాపారాన్ని మల్చుకోవాల్సిందేనని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా అన్నారు. 50 శాతం స్టార్టప్‌లు ఏడాది తిరక్కముందే కనుమరుగు అవుతున్నాయి. 27 శాతం స్టార్టప్‌లు మూడేళ్లు కూడా నిలదొక్కుకోవడం లేదని రిసర్జెంట్ ఇండియా సీనియర్ మేనేజర్ వి.శంకరనారాయణన్ తెలిపారు. -
పరిశ్రమ స్థాపిస్తే రూ.కోటి వరకు హామీలేని రుణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య చైర్మన్ బీవీ రామారావు తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : నిరుద్యోగులు పరిశ్రమను స్థాపిస్తే రూ.ఐదు లక్షల నుంచి రూ.కోటి వరకు క్రెడిట్ గ్యారెంటీ స్కీం ద్వారా హామీ లేని రుణం పొందవచ్చని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య చైర్మన్ బీవీ రామారావు చెప్పారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలను స్థాపించే ఆలోచనలు చేయాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రూ. 4 లక్షల కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, రోడ్డు, రైల్వే, ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తే, విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి గ్యాస్ బేసిన్ నిక్షేపాలు మన రాష్ట్రంలో ఉన్న 9 గ్యాస్ పవర్ ప్లాంట్లకు తొలుతగా ఇచ్చిన అనంతరమే ఇతర రాష్ట్రాలకు గ్యాస్ నిక్షేపాలను కేటాయించాలన్నారు. వనరులను బట్టి లాభసాటి ప్రాజెక్టులను ఎంచుకోవాలన్నారు. ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ డెరైక్టర్ కొడాలి రమేష్‌బాబు పాల్గొన్నారు.