కరువుపై అప్రమత్తం..!
సాక్షి, హైదరాబాద్: ఎలినినో కారణంగా ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను కరువు కమ్మే అవకాశాలుండడం వ్యవసాయ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కరువు హెచ్చరికలతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మూడు విడతల ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసి, రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించాలని నిర్ణయించింది. రైతులలో చైతన్యం ద్వారా కరువు పరిస్థితుల్లో నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ఈసారి వర్షపాతం గణనీయంగా పడిపోయి కరువు పరిస్థితులు తలెత్తనున్నాయని జాతీయ వాతావరణశాఖ అంచనా. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. గత ఖరీఫ్‌లో 30 శాతం లోటు నమోదు కాగా, ఈసారి 67 శాతం వరకు ఉంటుందని అంచనా.
మూడు విడతల ప్రత్యామ్నాయం...
వర్షాభావ పరిస్థితులు నెలకొంటే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై వ్యవసాయశాఖ కసరత్తు చేసింది. వ్యవసాయశాస్త్రవేత్తలో కలిసి మూడు విడతల ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. జూలై 15 వరకు వర్షాలు లేకుంటే ఒక ప్రణాళిక, జూలై 31 వరకు రాకుంటే రెండో ప్రణాళిక, ఆగస్టు 15 నాటికి కురియకుంటే మూడో ప్రణాళిక అమలు చేస్తారు. ఆగస్టు 15 నాటికి వర్షాలు కురవకుంటే వరి పంటను పూర్తిగా మినహాయిస్తారు.
వర్షాభావాన్ని ఎదుర్కొంటాం: క్రిడా
వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొంటామని, అలాంటి సాంకేతిక పరి జ్ఞానం తమ వద్ద ఉందని కేంద్ర మెట్ట వ్యవసా యపరిశోధన సంస్థ(క్రిడా) సంచాలకులు సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. క్రిడా కార్యాలయంలో సోమవారం తెలంగాణ జిల్లాల వ్యవసాయశాఖ సంచాలకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ కో-ఆర్డినేటర్లు సహా ఇతర అధికారులతో ఖరీఫ్, రబీ సన్నద్ధతపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో ఏర్పడనున్న వాతావరణ అంచనాలను వివరించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ రూపొందించుకున్న ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.