డబ్బు సమీకరణలో మీ వాటా ఎంత?
‘ఓటుకు కోట్లు’ కేసులో
టీడీపీ నేత శ్రీనివాసులునాయుడికి ఏసీబీ సూటి ప్రశ్న
పొంతనలేని సమాధానాలిచ్చిన శ్రీనివాసులునాయుడు
మే 30, 31 తేదీల్లో రేవంత్ నుంచి వచ్చిన కాల్స్‌పై మౌనం
ఏడు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు విచారణకు విష్ణు చైతన్య డుమ్మా
హైదరాబాద్: ‘ఓటుకు కోటు’్ల కేసులో ఆర్థిక మూలాలను ఛేదించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే కుమారుడు శ్రీనివాసులునాయుడును దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారించారు. శ్రీనివాసులునాయుడుతోపాటు నోటీసులు అందుకున్న ఆయన పీఏ విష్ణు చైతన్య విచారణకు డుమ్మా కొట్టారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన విచారణలో ప్రధానంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలతోపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యంపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు కొన్ని మార్గాల నుంచి డబ్బు సమీకరణ జరిగినట్లు భావిస్తున్న ఏసీబీ... అందులో భాగంగా టీడీపీ నేత శ్రీనివాసులునాయుడును పిలిచింది. ఈ సందర్భంగా ఆయన్ను ‘డబ్బు సమీకరణలో మీ వాటా ఎంత?’ అని ఏసీబీ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం.
దీనికి ఆయన నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చినట్లు తెలిసింది. పలు సందర్భాల్లో పార్టీ కోసం చేసిన నిధుల సమీకరణను ప్రస్తావించగా.. వాటికి ఆయన సమాధానాలిచ్చినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఫోన్ నుంచి శ్రీనివాసులుకు కొన్ని కాల్స్ వెళ్లడాన్ని ఏసీబీ ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ.. ‘రేవంత్ నాకు మంచి మిత్రుడు’ అని చెప్పినట్లు సమాచారం. రేవంత్‌తో ఎన్నాళ్ల నుంచి స్నేహం కొనసాగుతోందని ప్రశ్నించగా మౌనం వహించినట్లు తెలిసింది. రేవంత్ స్నేహితుడైతే.. కేవలం మే 30, 31 తేదీల్లోనే ఎందుకు ఎక్కువగా కాల్స్ చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నలు కురిపించగా.. వాటికి కూడా శ్రీనివాసులు సమాధానం చెప్పనట్లు సమాచారం. తన పీఏ విష్ణు చైతన్య విచారణకు హాజరుకాకపోవడానికి గల కారణాలను శ్రీనివాసులు ఏసీబీకి వివరించినట్లు తెలిసింది. అయితే ఆ సమాధానాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగానే విష్ణుచైతన్య విచారణకు డుమ్మా కొట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.