Cross Border terrorism
-
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
ప్రస్తుతం ‘సార్క్’ భేటీ కష్టం!
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదానికి పాక్ అందిస్తోన్న సాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సార్క్ సమావేశాల నిర్వహణ కోసం ప్రయత్నాలు కష్ట సాధ్యమని భారత్ తేల్చిచెప్పింది. ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని ఓలి మధ్య చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి తెలిపారు. దక్షిణాసియా ప్రాంతంలో సీమాంతర ఉగ్రవాదం విధ్వంసక శక్తిగా ఉన్న ప్రస్తుత తరుణంలో.. సార్క్ సమావేశాల నిర్వహణ ప్రయత్నాలు కష్టమని ప్రధాని మోదీ స్పష్టం చేశారని గోఖలే చెప్పారు. ఉడీ ఘటనతో ఇస్లామాబాద్‌లో 2016లో జరగాల్సిన సమావేశాలు రద్దవడంతో మళ్లీ సార్క్ సమావేశాల నిర్వహణకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
భారత సైన్యానికి పాక్ రుణపడి ఉండాలి: సమీ
భారత సైన్యానికి పాకిస్థాన్ ఎంతగానో రుణపడి ఉండాలని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ అన్నాడు. బజరంగీ భాయీజాన్ సినిమాలో అతిథిపాత్రలో కూడా నటించిన సమీ.. దీనిపై మరింత వివరణ ఇచ్చాడు. ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి శత్రువుపైనే తాను ట్వీట్లు చేశానన్నాడు. రెండు దేశాలతో పాటు మిగిలిన ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని చెప్పాడు. అలాంటి ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత సైన్యానికి పాకిస్థాన్ కృతజ్ఞతలు చెప్పాలన్నాడు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ చాలా సంవత్సరాలుగా చెబుతోందని, పొరుగుదేశం వాళ్లకు సాయం చేస్తున్నా.. కనీసం దాన్ని ఒప్పుకొనే పరిస్థితిలో కూడా వాళ్లు లేరని అన్నాడు. తాను ఎప్పుడూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన ట్వీట్లను వాళ్లు తమకు కావల్సిన రీతిలో వక్రీకరించుకున్నారని అద్నాన్ సమీ అన్నాడు. అందుకే వాళ్లు పాకిస్థానీలను.. ఉగ్రవాదులను ఒకేలా చూస్తున్నారని మళ్లీ ట్వీట్ చేశానని చెప్పాడు. తాను ఒక్క దేవుడికి తప్ప ఎవరికీ భయపడేది లేదని.. ఒకవేళ తన తలరాతలో మళ్లీ పాకిస్థాన్ వెళ్లాలని రాసి ఉంటే.. అలాగే వెళ్తానని, తిరిగి వెళ్లడానికి కూడా తాను భయపడేది లేదని తెలిపాడు. నిజానికి ఉడీ ఉగ్రదాడి తర్వాత.. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో దానిపై కాస్త హుందాగా స్పందిస్తున్న కళాకారుడి పేరు చెప్పుకోవాలంటే.. అద్నాన్ సమీ పేరు ముందొస్తుంది. స్వతహాగా పాకిస్థాన్‌కు చెందిన సమీ.. ఆ తర్వాత భారత పౌరసత్వం తీసుకున్నారు. ఉడీ ఉగ్రదాడిలో 19 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా మన సైన్యానికి అభినందనలు తెలిపి, ప్రధానిని కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపడుతున్న చర్యలను మెచ్చుకున్నారు. -
'టెక్నాలజీతో అమాయకుల ఊసురు తీస్తున్నారు'
సరిహద్దు తీవ్రవాదం దేశానికి ముందున్న అతి పెద్ద సవాల్ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో నేషనల్ డిజిటల్ క్రైం రిసోర్స్ సెంటర్‌తోపాటు ఎంసీటీసీ భవనాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సమాజంలో సమస్యలకు మావోయిజం పరిష్కారం కాదని అన్నారు. దేశంలో మార్పు రావాలంటే సమాజంతోపాటు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులకు సిబ్బందికి మరింత శిక్షణ అవసరమని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్య నాయుడు తెలిపారు. తీవ్రవాదులకు దీటుగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని పోలీసు శాఖకు హితవు పలికారు. తీవ్రవాదులు టెక్నాలజీతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.