‘సంకరజాతి’ ఎవరో?
ఆయన మాటలు మృధువుగా ఉంటారుు. చేతలు మాత్రం మెత్తని కత్తులను తలపిస్తాయి. శాంతికాముకుడిలా కన్పిస్తారు. నిశితంగా గమనిస్తే స్వపక్షంలోనూ, విపక్షంలోనూ ఎవరిని ఎదగనీయని సంకుచితత్వం ఆయనది. తనకు పేరు రాకుంటే అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటారు. అందరూ ఒకటేనంటారు. ఓటేయనివారిని మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారు. ఇదీ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నైజం. పైకి త్యాగధనుడిగా కన్పించే ఆయన పదవుల కోసం పాకులాడుతారనడానికి సుదీర్ఘకాలం ఉన్న కాంగ్రెస్‌ను వీడి ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీలో చేరి... కాంగ్రెస్‌కు ఓటేసినవారంతా ‘సంకరజాతి’ వారేనని వ్యాఖ్యానించడమే నిదర్శనం. అవకాశవాదిగా మారిన బుద్ధప్రసాద్‌ను ఓడిస్తామంటూ కాంగ్రెస్‌వాదులు పడికిలి బిగించి మరీ శపథం చేస్తున్నారు.
సాక్షి, మచిలీపట్నం: రాజకీయ అవసరార్ధం ఇటీవల టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు పార్టీ కేడర్ సహాయ నిరాకరణతో ఎదురీత తప్పడంలేదు. తన తండ్రి మండలి వెంకటకృష్ణారావుకు రాజకీయ వారసుడిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బుద్ధప్రసాద్ రాష్ట్రంలో సౌమ్యుడిగా పేరు పొందినా సొంత నియోజకవర్గంలో మాత్రం అనేక విమర్శలను మూటగట్టుకున్నారు.
పేరు కోసం పాకులాట...
అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకుంటున్న బుద్ధప్రసాద్ పేరు కోసమే పాకులాడతారని, తనకు ఓటేయ్యని వారు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటారన్న విమర్శలున్నాయి. నాగాయలంక మండలంలోని ఏటిమొగ-ఎదురుమొండి వారధి, ఉల్లిపాలెం-భవానీపురం వారధి బుద్ధప్రసాద్ తీరు వల్లే ఆగిపోయాయని ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు మండిపడుతుంటారు.
* కృష్ణానదిపై ఏటిమొగ-ఎదురుమొండి వద్ద రూ.45కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో వారధిని నిర్మించేందుకు 2008లో ప్రతిపాదించారు. 2009 ఎన్నికల్లో బుద్ధప్రసాద్ ఓడిపోవడానికి ఎదురుమొండి దీవుల ప్రజలే ప్రధాన కారణంగా భావించిన ఆయన ఇక్కడ వారధి నిర్మాణాన్ని అడ్డుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్యణయ్య ఈ విషయాన్ని తన మిత్రుల వద్ద పలుమార్లు ప్రస్తావించి ఆవేదన చెందినట్టు తెలిసింది.
* ఉల్లిపాలెం-భవానీపురం వారధి విషయంలోనూ బుద్ధప్రసాద్ ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇక్కడ వారధిని నిర్మించేందుకు 2009లో రూ.25కోట్లు డెల్టా ఆధునీకరణ నిధులు కేటాయించారు. 2009 ఫిబ్రవరిలో వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు బుద్ధప్రసాద్ ప్రయత్నించారు. ఈ లోగానే ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏ రోజూ బుద్ధప్రసాద్ ఈ వారధి నిర్మాణానికి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత ఆయన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా పనిచేసినప్పటికీ ఈ వారధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో ఆ వారధుల నిర్మాణం చేపడితే స్థానిక ఎమ్మెల్యే బ్రాహ్మణయ్యకే పేరొస్తుందని భావించిన బుద్ధప్రసాద్ దాని నిర్మాణాన్ని అడ్డుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు.
వాడుకుని వదిలేయడం ఆయన నైజం..
దివంగత మంత్రి మండలి వెంకట కృష్ణారావు దగ్గర నుంచి ఆయన తనయుడు బుద్ధప్రసాద్ వరకు వారి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ దోహదపడిందన్నది తెల్సిందే. కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన ఆ తండ్రీ, కొడుకులు మంత్రులుగానూ పనిచేశారు. అయినా బుద్ధప్రసాద్ ప్రస్తుతం పదవి కోసం కాంగ్రెస్‌కు చేయిచ్చి సైకిలెక్కేయడంతో తీవ్ర విమర్శలు వె ల్లువెతున్నాయి. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను, ఆదుకున్న పార్టీని నట్టేట ముంచి బుద్ధప్రసాద్ సైకిలెక్కడంతో ఛీత్కరించుకుంటున్న అనునయులు ఆయన్ను అనుసరించడంలేదు. తాను ఉండగా పార్టీలో ఇతర నాయకులెవ్వరినీ ఎదగనీయని బుద్ధప్రసాద్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలోనూ ఆయన ఇదే నైజంతో వ్యవహరిస్తారని గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
సంకరజాతి వ్యాఖ్యలపై విమర్శలు..
మూడురోజుల క్రితం బుద్ధప్రసాద్ కోడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంకర జాతికి పుట్టినట్టే’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయనకు వేసిన ఓటర్లంతా సంకరజాతికి పుట్టిన వారేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సారి టీడీపీలోకి వెళ్లాడు, వచ్చేసారి ఏ పార్టీ మారతాడో తెలియదు. ఆయనకు ఓట్లు వేయడం ఎందుకు.తిట్లు తినడం ఎందుకు అని కొంతమంది బాహాటంగానే అంటున్నారు. బుద్ధప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఓటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో తెలుగు తమ్ముళ్లు సైతం కలవరపడుతున్నారు.
బుద్ధప్రసాద్‌పై ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహం..
కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఏ ఒక్క నాయకుడినీ ఎదగనీయని బుద్ధప్రసాద్ టీడీపీలోనూ నాయకులను అణగ దొక్కే పనిలో పడినట్టు కొంతమంది టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం నాగాయలంకలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య ఫొటో లేకపోవడం, తాజా మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ బ్యానర్ లేకపోవడం పట్ల అంబటి వ ర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో అప్పటికప్పుడు బ్రాహ్మణయ్య ఫొటోను ఏర్పాటు చేశారు. టీడీపీ కోసం శ్రమించిన బ్రాహ్యణయ్యకే ప్రాధాన్యం లేకపోతే సామాన్య కార్యకర్తలను బుద్ధప్రసాద్ ఇంకేం పట్టించుకుంటారంటూ విమర్శలు రేగుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.