Crude oil prices Fall
-
తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావం
ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్‌లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్ ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయవచ్చు)పెట్రోలియం ఎగుమతి చేసే అజర్బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్‌సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.ప్రస్తుతం ఒపెక్‌ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
Israel-Hamas war: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సోమవారం చమురు ధరలు 2% పైగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.33 అమెరికన్ డాలర్లు లేదా 2.5% తగ్గి బ్యారెల్ ధర 89.83 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.59 డాలర్లు లేదా 2.9% తగ్గి బ్యారెల్ 85.49 యూఎస్ డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్.. రోజుకి మూడు లక్షల బ్యారెల్ సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు చేస్తున్న ఫలిస్తే మాత్రం క్రూడ్ ధర మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రతినిధులు ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా..పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్, ఇరాక్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. దానివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. -
64,000 బుల్ 19,000 కొత్త రికార్డుల్..!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్‌టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్‌లో 44,508 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది. -
పెట్రోల్, డీజిల్‌పై మెరుగుపడిన మార్జిన్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు. గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు. కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 17.4, డీజిల్‌పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్‌పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్‌పై మార్జిన్ రూ. 0.50కి మెరుగుపడింది. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
వినియోగదారులకు మరో బురిడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, ఆ ప్రయోజనాన్ని మన ప్రభుత్వాలు వినియోగదారులకు చేరనివ్వడం లేదు. సొంత ఖజానాలో జమ చేసుకుంటున్నాయి. ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సింది పోయి కొన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకం పెంచగా, కొన్ని రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.13 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్ మొత్తం ధరలో పన్నుల వాటా 70 శాతానికి చేరింది. ఈ పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం పెంచినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి ప్రభావంపడదు. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పడిపోయింది. ఆ లాభాన్ని పొందుతున్న ఆయిల్ కంపెనీల నుంచి ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వసూలు చేయనుంది. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. సుంకాన్ని కేంద్రం పెంచకపోయి ఉంటే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు కొంతైనా తగ్గించేందుకు ఆస్కారం ఉండేది. దాంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరేది. రాష్ట్రాల నిర్వాకం పెట్రోల్, డీజిల్‌పై ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచేసింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.1.67, డీజిల్ ధర రూ.7.10 చొప్పున పెరిగింది. దీనివల్ల ఢిల్లీ సర్కారుకు రూ.700 కోట్ల అదనపు ఆదాయం రానుంది. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెంపు ద్వారా రూ.2,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హరియాణా సర్కారు సైతం పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూ.1.1 చొప్పున వ్యాట్‌ను పెంచింది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాట్‌ను పెంచాయి. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలి: రాహుల్ గాంధీ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై మరింత భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
దలాల్ స్ట్రీట్ లో చమురు సెగ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ నష్టాలతోనే ముగిసాయి. క్రూడ్ సంక్షోభంతో ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లను నష్టపోయింది. మిడ్ సెషన్ నుంచి మరింత నష్టాల్లోకి జారుకున్న దలాల్ స్ట్రీట్ ఒక దశలో 1250 పాయింట్లకు పైగా పతనమైంది. చివరల్లో కొంచెం పుంజుకున్నా ఆఖరి నిమిషంలో అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో సెన్సెక్స్ 1011 పాయింట్లు నష్టపోయి 30637 వద్ద, 280 పాయింట్లు పతనమైన నిఫ్టీ 8961 వద్ద ముగిసింది. ఫార్మ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిసాయి. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం) ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, జీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, గెయిల్, మారుతి సుజుకి నష్టపోయాయి. మరోవైపు డా.రెడ్డీస్, భారతి ఇన్ ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్, హీరో మోటో, బ్రిటానియా, సిప్లా, రిలయన్స్, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు క్షీణించి రికార్డు కనిష్టం 76.83 వద్ద ముగిసింది. (ఆల్ టైం కనిష్టానికి రూపాయి) చదవండి : రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా -
లాభనష్టాల సయ్యాట
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం ఇన్వెస్టర్లను ఆందోళన పరిచినా, హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్లు లాభపడటం, ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు కలసివచ్చాయి. లాక్డౌన్ కారణంగా డిమాండ్ బాగా పడిపోవడంతో ముడి చమురు ధరలు 21 ఏళ్ల కనిష్టానికి పతనం కావడం, ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రోజంతా 566 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 59 పాయింట్ల లాభంతో 31,648 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 124 పాయింట్ల మేర పెరిగినప్పటికీ, ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 5 పాయింట్ల నష్టంతో 9,262 పాయింట్ల వద్ద ముగిసింది. 566 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మూడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయి. ఒక దశలో 468 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 98 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 566 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 124 పాయింట్లు ఎగసినా, మరో దశలో 36 పాయింట్లు పతనమైంది. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప లాభాల్లోటముగిశాయి. ► గత క్యూ4లో నికర లాభం 15 శాతం మేర పెరగడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 4 శాతం లాభంతో రూ.941వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ప్రైవేట్ బ్యాంక్‌ల రేటింగ్‌ను ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ స్థిరత్వం నుంచి ప్రతికూలం నకు తగ్గించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 5–4 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► మరోవైపు యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జే అండ్ కే బ్యాంక్ చెరో 20 శాతం చొప్పున ఎగిశాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 10–18 శాతం రేంజ్లో పెరిగాయి. -
ఆగని విలయం!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ల రేట్లను దాదాపు సున్నా స్థాయికి తగ్గించినప్పటికీ, భారత్‌తో పాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ పతనబాటలోనే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. 2,713 పాయింట్లు క్షీణించి 31,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 758 పాయింట్లు పతనమై 9,197 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.96 శాతం, నిఫ్టీ 7.61 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మూడేళ్లు, సెన్సెక్స్ రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆరంభం నుంచి అదే వరుస.... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టంతో 33,103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 9,588 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,827 పాయింట్లు, నిఫ్టీ 790 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ నెల 12న సెన్సెక్స్ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం. సోమవారం రెండో అతి పెద్ద పతనం నమోదైంది. వారం వ్యవధిలో స్టాక్ సూచీలు ఇలా భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం విరామం అనంతరం స్టాక్ మార్కెట్లో నష్టాలు మళ్లీ కొనసాగాయి. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని రంగాల షేర్లు భారీగా పతనమైనప్పటికీ, యస్ బ్యాంక్ షేర్ మాత్రం 45% ఎగసి రూ.37కు చేరింది. యస్ బ్యాంక్‌లో వివిధ బ్యాంక్‌లు రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుండటం, నగదు విత్‌డ్రాయల్ పరిమితులను మరో 2 రోజుల్లో తొలగించనుండటం సానుకూల ప్రభావం చూపాయి. రూ.7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.62 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.121.63 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... కోవిడ్–19 వైరస్ కల్లోలం.... కోవిడ్–19 వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం తాజాగా 9 కొత్త దేశాలకు పాకింది. మరోవైపు ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 110కు, మరణాలు రెండుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 6,500 మందికి పైగా మరణించారు. గణాంకాలతో గజగజ.... చైనా తయారీ రంగ, రిటైల్ అమ్మకాల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. చైనా తయారీ రంగ సూచీ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. రిటైల్ అమ్మకాలు కూడా బారీగా తగ్గాయి. కోవిడ్–19 వైరస్ కల్లోలం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే భయాలను ఈ గణాంకాలు మరింతగా పెంచాయి. ప్రపంచ మార్కెట్ల పతనం..... ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోవడం, యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు మరింత పతనం.... ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వినియోగం తగ్గి, డిమాండ్ కూడా తగ్గగలదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు 10 శాతం మేర దిగివచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు @ 0 ఫెడ్ మరో అనూహ్య కోత వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. అదీ ఏకంగా 1 శాతం తగ్గించేసింది. వెరసి ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు సున్నా (0–0.25 శాతం) స్థాయికి చేరింది. రెండు వారాల్లోనే రేటును ఫెడ్ ఏకంగా 1.5 శాతం తగ్గించడం గమనార్హం. నిజానికి ఈ నెల 17, 18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కోవిడ్–19 సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి అత్యవసర ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు బాండ్లను కొనుగోలు చేయనుంది. తాజా రేటు కోత నేపథ్యాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్‌తో ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్–19 వైరస్ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థసైతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2008 తదుపరి... 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిన సబ్‌ప్రైమ్ సంక్షోభ సమయంలో వృద్ధికి ఊతం అందించడానికి అమెరికా ఫెడ్ ఫండ్ రేటును సున్నా స్థాయికి తగ్గించడం జరిగింది. తరువాత కొన్ని సానుకూల ఆర్థిక అంశాలతో ఈ రేటు 2.5 శాతం వరకూ పెరుగుతూ వచ్చింది. అటు తర్వాత గడచిన సంవత్సర కాలంలో వేగంగా తిరిగి సున్నా స్థాయికి చేరింది. తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్ రిక్వైర్మెంట్స్ నిబంధనలు సడలించింది. అధ్యక్షుని ప్రశంసలు... మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్ చర్యలను ఊహించలేదని..ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే. అనుసరించనున్న ఆర్బీఐ! మరోవైపు భారత్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) బాటలో నిలు స్తుందన్న సంకేతాలను ఇచ్చారు గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కరోనా ప్రభావం నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడటానికి ఆర్బీఐ వద్ద తగిన విధానపరమైన సాధనాలు ఉన్నాయి’’ అన్నారు. ఏప్రిల్ 3న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు కోత నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ప్రస్తుత చట్టం ప్రకారం, రేట్ కోత నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుంది. రేటు కోత నిర్ణయాన్ని తోసిపుచ్చలేను. పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటామని దాస్ పేర్కొ న్నారు. కోవిడ్ ఆందోళనలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. రూపాయి, క్రూడ్ క్రాష్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతన ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 50 పైసలు పడిపోయి 74.25 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న కోవిడ్–19 భయాలు, ప్రపంచాభివృద్ధిపై దీని ప్రభావం, రేటు కోతతో వృద్ధికి ఊతం ఇవ్వాలని భావించిన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నిర్ణయం... వెరసి మాంద్యం భయాలు భారత్ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ భారీ నష్టాలూ ఇక్కడ గమనార్హం. శుక్రవారం రూపాయి ముగింపు 73.75. ట్రేడింగ్ మొత్తంమీద 74.09 గరిష్ట–74.35 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే ఈ నెల 12, 13తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్, బంగారం ‘బేర్’ మరోవైపు ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లూ కరోనా కాటుకు బలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం 10.35కు 8.35 శాతం నష్టంలో (2.68 డాలర్లు) 29.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 28.52 డాలర్లనూ చూసింది. బ్రెంట్ బ్యారల్ ధర ఇదే సమయానికి 11.73 శాతం నష్టంతో 29.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 29.55 డాలర్లనూ చూసింది. ఇక పసిడి విషయానికి వస్తే, ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్ల నష్టంతో 1,512 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ యల్లో మెటల్ ధర 1,451 డాలర్లనూ చూడ్డం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దేశీయంగా రూ.40,000 లోపునకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తరాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500కుపైగా నష్టంతో రూ.39,775 వద్ద ట్రేడవుతోంది. ఎస్బీఐ కార్డ్స్‌కు కరోనా సెగ ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్‌పై కోవిడ్–19 వైరస్ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది. 13 శాతం నష్టంతో లిస్టింగ్..... ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ బీఎస్ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్‌కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 41.6 లక్షలు, ఎన్ఎస్ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.57,199 కోట్లకు చేరింది. ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 22 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం.. పేలవంగా లిస్టింగ్ 10% నష్టంతో రూ. 683 వద్ద ముగింపు ఐపీఓలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్ బీఎస్ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరిన్ని విశేషాలు.... సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 17.5 శాతం క్షీణించి రూ.663 వద్ద ముగిసింది సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. టాటా స్టీల్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 11 శాతం, యాక్సిస్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 10% మేర నష్టపోయాయి. ► యస్ బ్యాంక్ తరహానే త్వరలోనే సంక్షోభంలోకి జారిపోగలదన్న భయాలు చెలరేగడంతో ఆర్బీఎల్ బ్యాంక్ 21% నష్టపోయి రూ.163 వద్ద ముగిసింది. ► వివిధ రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో మల్టీప్లెక్స్‌లను నిర్వహించే పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 19 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్ బ్యాంక్, పీవీఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఇక్రా, పిరామల్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఈ జాబితా కొన్ని. ► 600కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్, ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, సువెన్ ఫార్మా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, డీహెచ్ఎఫ్ఎల్, వెల్స్పన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సెన్సెక్స్ 2,700 పాయింట్ల నష్టంలో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్ల వాటాయే దాదాపు నాలుగో వంతుగా ఉంది. ఈ రెండు షేర్లు కలిసి 660 పాయింట్ల మేర సెన్సెక్స్‌కు పడగొట్టాయి. సెన్సెక్స్‌ను....రిలయన్స్ ఇండస్ట్రీస్ 276 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 271 పాయింట్లు, ఇన్ఫోసిస్ 211 పాయింట్ల మేర నష్టపరిచాయి. ఫెడ్ తగ్గించినా... నష్టకష్టాలే! అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం ఫండ్స్ రేట్‌ను దాదాపు సున్నా స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫండ్స్ రేటు 0–0.25 శాతం రేంజ్లో ఉంది. ఈ రేట్ల ఆధారంగానే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. అంతే కాకుండా 70,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఒక్క వారంలో ఫండ్స్ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించడం ఇది రెండోసారి. 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభం నెలకొన్నప్పుడు కూడా ఇలానే ఫెడ్ రేట్లను తగ్గించింది. సాధారణ పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను తగ్గిస్తే, అదీ సున్నా స్థాయికి వస్తే, ప్రపంచ మార్కెట్లు లాభాలతో ఊగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది. ఆర్థిక సంక్షోభం అంచనాలను మించి ఉంటుందని, ఫెడ్ రేట్లను తగ్గించడం దీనికి సంకేతమన్న భావనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. పార్క్ హోటల్స్ ఐపీఓ @ రూ.1,000 కోట్లు... పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, జైపూర్, జోధ్‌పూర్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ద పార్క్ బ్రాండ్ హోటళ్లను నిర్వహిస్తోంది. ఐపీఓలు వాయిదా...: కోవిడ్–19 వైరస్ ధాటికి స్టాక్ మార్కెట్ విలవిలలాడుతుండటంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఈ నెల 4నే మొదలైనా, ఐపీఓను ఈ నెల 16 వరకూ పొడిగించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. కాగా బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ తన ఐపీఓను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ నెలాఖరులో ఐపీఓకు వచ్చి రూ.400 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. జీడీపీకి కరోనా కాటు! వృద్ధి 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండొచ్చన్న దానిపై రేటింగ్ ఏజెన్సీ కేర్ 150 మంది సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వైరస్ ఎక్కువ కాలం పాటు ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జీడీపీ అరశాతం వరకు తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడితే, 22 శాతం మంది అయితే ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేశారు. రేట్ల కోతతో కీడే ఎక్కువ వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు రేట్లను తగ్గించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. కోవిడ్ వైరస్ ఆర్థికంగా చూపించే ప్రభావం అంచనాల కంటే అధికంగానే ఉండగలదన్న సంకేతాలను కేంద్ర బ్యాంక్‌ల రేట్ల తగ్గింపు సూచిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ పతనం కొనసాగే అవకాశాలే అధికం దేశీయంగా కోవిడ్–19 వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇది ఎక్కడ దాకా చేరుతుందో అంతూ, దరీ తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ పతనం కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్. -
ఆయిల్ ఢమాల్ : రుపీ గెయిన్
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత బలహీనపడ్డాయి. దీంతో దేశీయ కరెన్సీ ధర రూపాయి పుంజుకుంది. మంగళవారం డాలరు మారకంలో 37పైసలు ఎగిసింది. అనంతరం మరింత పుంజుకుని 62 పైసలు లాభంతో 70.88 స్థాయికి ఎగిసింది. మరోవైపు ప్రధానకరెన్సీలతో డాలర్ బలహీనం దేశీయ కరెన్సీకి సానుకూలంగాఉందని ట్రేడర్లు చెబుతున్నారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 58.85 డాలర్లకు పడిపోయింది. 1.22 శాతం పతనంతో ఆయిల్‌ధర 14నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. ఒపెక్ దేశాల విధాన పర నిర్ణయాలు, గ్లోబల్ మార్కెట్లలో డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు క్రూడ్ ఆయిల్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనా మిడ్ సెషన్ తరువాత ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పరిమిత నష్టాలతో కొనసాగుతున్నాయి. -
ఆరు వారాల్లో భారీగా పెట్రోలు ధర
సాక్షి, ముంబై: అంతర్జాతీయం మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా క్షీణిస్తూ ఉండటంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(నవంబరు,30) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో గత ఆరువారాల్లో పెట్రోలు ధర 10 రూపాయలు దిగిరాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 8 తగ్గింది. న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 37 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు తగ ధరరూ.72.87 కి చేరింది. డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.67.72గా ఉంది. ముంబై: పెట్రోల్ ధర 37 పైసలు, డీజిల్ ధర 44 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్ లీటర్ ధర రూ. 78.43గా ఉంది. డీజిల్ లీటర్ ధర రూ.70.89 కి చేరింది. చెన్నై: పెట్రోలు ధర లీటరు ధర. 75.62, డీజిల్ ధర 71.52 పలుకుతోంది. కోల్‌కతా: పెట్రోలు ధర రూ.74.88గానూ, రూ. 69.57గా ఉంది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ.77.25 డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.73.68 గా ఉంది. విజయవాడ: పెట్రోల్ ధర రూ.76.61 ఉండగా.. డీజిల్ ధర రూ.72.67 వద్ద కొనసాగుతోంది. కాగా అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్‌కు 60 డాలర్లు దిగువకు చేరింది. గత 45 రోజులుగా నేల చూపులు చూస్తున్న బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏడాది కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే ఈ రోజు స్వల్పంగా పుంజుకుని పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజుల నుంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న అనంతరం వరుసగా 13 రోజుల నుంచి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్యారల్‌కు 80 డాలర్ల గరిష్ట స్థాయికి చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం 2.42 డాలర్లు తగ్గి, 76.37 డాలర్లుగా నమోదైంది. దీంతో ఇక దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశాలున్నాయని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రస్తుతం మారుతున్న ధరలు, గ్లోబల్ ట్రెండ్ మాదిరిగా వచ్చే రోజుల్లో తగ్గబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే, వాటి ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు చేరేలా కేంద్రం రోజువారీ ధరల సమీక్ష చేపట్టింది. ఈ రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి ఇంధన ధరలు పెరగడమే కానీ, తగ్గుదల మాత్రం చాలా అరుదుగా సంభవించింది. అందుకు కారణం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నందున్న, దేశీయంగా కూడా వినియోగదారులు గుడ్‌న్యూస్‌ను వినబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక కాకపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఇటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. దీంతో కేంద్రం సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలోనే ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనబోతుంది. నేడు పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.77.97గా, కోల్‌కతాలో రూ.80.61గా, ముంబైలో రూ.85.78గా, చెన్నైలో రూ.80.95గా, హైదరాబాద్‌లో రూ.82.60గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.68.90గా, కోల్‌కతాలో రూ.71.45గా, ముంబైలో రూ.73.36గా, చెన్నైలో రూ.72,74గా, హైదరాబాద్‌లో రూ.74.89గా రికార్డైంది. -
సుస్థిర పన్నులు... మౌలిక వృద్ధి
⇒ అధిక వృద్ధి కోసం ప్రధాని మోదీకి ఆర్థికవేత్తల విజ్ఞప్తి ⇒ క్రూడ్ పతనం ఇతరత్రా ప్రపంచ పరిణామాలు భారత్‌కు వరం ⇒ బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేందుకు సలహాలివ్వాలని మోదీ పిలుపు.. న్యూఢిల్లీ: ముడిచమురు ధరల పతనం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు... భారత్‌కు వరంగా మారనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సానుకూల పవనాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని చెప్పారు. భారత్‌ను అధిక వృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా.. ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించేవిధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచనలివ్వాలని ఆర్థికవేత్తలను మోదీ కోరారు. శుక్రవారమిక్కడ నీతి ఆయోగ్(ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైంది) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థిరమైన పన్నుల వ్యవస్థ, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు వృద్ధిని పరుగులు పెట్టించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆర్థికవేత్తలు సూచించారు. వచ్చే ఆరేళ్లపాటు క్రూడ్ ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగనున్నాయని.. అదేవిధంగా చైనా తదితర దేశాల కీలక దేశాల్లో మందగమనాన్ని భారత్ అవకాశంగా మలచుకోవాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదాయాల సమీకరణ, వ్యయాల్లో హేతుబద్ధీకరణలకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన ఆర్థికవేత్తలను ఆహ్వానించారు. కాగా, నీతీ ఆయోగ్ మొదటి పాలక మండలి సమావేశం ప్రధాని నేతృత్వంలో ఆదివారం(రేపు) జరగనుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. విధానాల రూపకల్పనలో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు... అనుభవం, నైపుణ్యం గల ప్రముఖ వ్యక్తుల భాగస్వామ్యాన్ని కూడా జతచేయడం ద్వారా ఒక అత్యుత్తమ వ్యవస్థను రూపొందించే లక్ష్యంతోనే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు మోదీ చెప్పారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య సుహృద్భావ పోటీ వాతావరణం ఉండాలని... కేంద్రంతో సమన్వయం, సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కిచెప్పారు. కాగా, భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకులతో మాట్లాడారు. పెట్టుబడులు, వృద్ధిని పెంచే విధంగా బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా చర్చించినట్లు చెప్పారు. ఎవరెవరు పాల్గొన్నారంటే... ప్రధానితో అభిప్రాయాలను పంచుకున్న ప్రముఖుల్లో విజయ్ కేల్కర్, నితిన్ దేశాయ్, బిమల్ జలాన్, రాజీవ్ లాల్, ఆర్ వైద్యనాథన్, సుబీర్ గోకర్ణ్, పార్థసారథి షోమ్, పి.బాలకృష్ణన్, అశోక్ గులాటి, ముకేశ్ బుటాని, జీఎన్ బాజ్‌పేయి తదితర ఆర్థిక వేత్తలు ఉన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాతో పాటు సంస్థ పూర్తికాల సభ్యులు బిబేక్ డెబ్రాయ్, వీకే సారస్వత్‌లు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 28న మోదీ సర్కారు తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయం, పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక వ్యవస్థలోని పలు ఇతర రంగాలపై కూడా ఆర్థిక వేత్తలు తగు సూచనలిచ్చారు.