సుస్థిర పన్నులు... మౌలిక వృద్ధి | For 'saleable' India, work on infra, tax regime: economists tell | Sakshi
Sakshi News home page

సుస్థిర పన్నులు... మౌలిక వృద్ధి

Published Sat, Feb 7 2015 2:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

సుస్థిర పన్నులు... మౌలిక వృద్ధి - Sakshi

సుస్థిర పన్నులు... మౌలిక వృద్ధి

అధిక వృద్ధి కోసం ప్రధాని మోదీకి ఆర్థికవేత్తల విజ్ఞప్తి
క్రూడ్ పతనం ఇతరత్రా ప్రపంచ పరిణామాలు భారత్‌కు వరం
బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిచ్చేందుకు సలహాలివ్వాలని మోదీ పిలుపు
..
న్యూఢిల్లీ: ముడిచమురు ధరల పతనం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు... భారత్‌కు వరంగా మారనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సానుకూల పవనాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని చెప్పారు. భారత్‌ను అధిక వృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా.. ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించేవిధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచనలివ్వాలని ఆర్థికవేత్తలను మోదీ కోరారు. శుక్రవారమిక్కడ నీతి ఆయోగ్(ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైంది) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

స్థిరమైన పన్నుల వ్యవస్థ, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు వృద్ధిని పరుగులు పెట్టించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆర్థికవేత్తలు సూచించారు. వచ్చే ఆరేళ్లపాటు క్రూడ్ ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగనున్నాయని.. అదేవిధంగా చైనా తదితర దేశాల కీలక దేశాల్లో మందగమనాన్ని భారత్ అవకాశంగా మలచుకోవాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆదాయాల సమీకరణ, వ్యయాల్లో హేతుబద్ధీకరణలకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన ఆర్థికవేత్తలను ఆహ్వానించారు. కాగా, నీతీ ఆయోగ్ మొదటి పాలక మండలి సమావేశం ప్రధాని నేతృత్వంలో ఆదివారం(రేపు) జరగనుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు.
 
విధానాల రూపకల్పనలో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు... అనుభవం, నైపుణ్యం గల ప్రముఖ వ్యక్తుల భాగస్వామ్యాన్ని కూడా జతచేయడం ద్వారా ఒక అత్యుత్తమ వ్యవస్థను రూపొందించే లక్ష్యంతోనే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు మోదీ చెప్పారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య సుహృద్భావ పోటీ వాతావరణం ఉండాలని... కేంద్రంతో సమన్వయం, సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కిచెప్పారు. కాగా, భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకులతో మాట్లాడారు. పెట్టుబడులు, వృద్ధిని పెంచే విధంగా బడ్జెట్‌లో తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా చర్చించినట్లు చెప్పారు.
 
ఎవరెవరు పాల్గొన్నారంటే...
ప్రధానితో అభిప్రాయాలను పంచుకున్న ప్రముఖుల్లో విజయ్ కేల్కర్, నితిన్ దేశాయ్, బిమల్ జలాన్, రాజీవ్ లాల్, ఆర్ వైద్యనాథన్, సుబీర్ గోకర్ణ్, పార్థసారథి షోమ్, పి.బాలకృష్ణన్, అశోక్ గులాటి, ముకేశ్ బుటాని, జీఎన్ బాజ్‌పేయి తదితర ఆర్థిక వేత్తలు ఉన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాతో పాటు సంస్థ పూర్తికాల సభ్యులు బిబేక్ డెబ్రాయ్, వీకే సారస్వత్‌లు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 28న మోదీ సర్కారు తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయం, పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక వ్యవస్థలోని పలు ఇతర రంగాలపై కూడా ఆర్థిక వేత్తలు తగు సూచనలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement