ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.
ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు.
ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్‌టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు
సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్‌ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్‌ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్‌డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి.
► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్‌లో 44,508 వద్ద జీవితకాల
గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment