ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్‌లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.
బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్‌లో క్రూడాయిల్ ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయవచ్చు)
పెట్రోలియం ఎగుమతి చేసే అజర్‌బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్‌సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.
ప్రస్తుతం ఒపెక్‌ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.
అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment