126 ఆర్టీసీ సర్వీసులు రద్దు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: భారీ వర్షాలకు వాగులు, చెరువుల గట్లు తెగుతుండడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం 126 బస్సు సర్వీసులను రద్దు చేశారు. నెక్ పరిధిలోని తొమ్మిది డిపోలలో అధికంగా శ్రీకాకుళం, పలాస డిపోల పరిధిలో ఈ సర్వీసులను రద్దుచేశారు. స్థానిక ఆర్ఎం కార్యాలయం ఆవరణలో ఆర్ఎం అప్పన్న ఆధ్వర్యంలో సీటీఎం సుధాకర్, డీప్యూటీ సీటీఎంలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, పీఓ మల్లికార్జునరాజుతో శుక్రవారం సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం అప్పన్న‘ న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నదులు, నీటి ప్రవాహాల పరిసర ప్రాంతాలకు వెళ్లే రూట్లను రద్దు చేసినట్లు తెలిపారు.
విజయగనరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు పార్వతీపురం డిపో నుంచి వెళ్లే 12 సర్వీసులు, విజయనగరం నుంచి 10, సాలూరు డిపో నుంచి 9 బస్సుల సర్వీసులను గురు, శుక్రవారాల్లో రద్దు చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రద్దు చేసిన వాటిలో శ్రీకాకుళం-1 డిపోనుంచి నుంచి 16, శ్రీకాళకుశం-2 నుంచి 16, పలాసా-20, పాలకొండ-10, టెక్కలి-9 బస్సులను రద్దు చేశామని తెలిపారు. దీంతో రోజుకు రూ. 10 లక్షలు చొప్పున ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు.