క్యూబా గడ్డపై అమెరికా అధినేత
హవానాలో దేశాధ్యక్షుడు రావుల్ కాస్త్రోతో ఒబామా భేటీ
♦ సత్సంబంధాల కోసం చర్చలు
హవానా: చిరకాల ప్రత్యర్థుల మధ్య మరింత సయోధ్యకు రంగం సిద్ధమైంది. 5 దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలికే దిశగా క్యూబా, అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. క్యూబా అధ్యక్షుడు రావుల్ కాస్త్రోతో చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం క్యూబా రాజధాని హవానా చేరుకున్నారు. అనంతరం హవానాలోని ప్రధాన ప్రభుత్వ భవనం ‘ప్యాలెస్ ఆఫ్ రివల్యూషన్’లో రావుల్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు, ప్యాలెస్ వద్ద ఒబామాకు మిలటరీ బ్యాండ్‌తో ఘన స్వాగతం లభించింది. ఈ చరిత్రాత్మక పర్యటనలో ఒబామాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారు.
హవానా చేరుకోగానే స్థానిక భాషలో ఆత్మీయంగా ‘ఏంటి సంగతి.. క్యూబా!’ అని ఒబామా ట్వీట్ చేశారు. ‘ఇది చరిత్రాత్మక పర్యటన’ అని హవానాలో ఇటీవలే పునఃప్రారంభమైన అమెరికా ఎంబసీ అధికారులతో అన్నారు. తర్వాత, క్యూబా పౌరులు అమితంగా ఆరాధించే ఆ దేశ స్వాతంత్య్రోద్యమ నాయకుడు జోస్ మార్టిన్‌కు నివాళులర్పించారు. 1928లో కెల్విన్ కూలిజ్ పర్యటన తర్వాత క్యూబాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1959 నాటి క్యూబా విప్లవం తర్వాత ఆ కమ్యూనిస్ట్ గడ్డపై అడుగుపెట్టిన తొలి యూఎస్ అధ్యక్షుడూ ఒబామానే. అమెరికా, క్యూబాల మధ్య సత్సంబంధాలకు 2014లోనే బీజాలు పడ్డాయి.
సాధారణ సంబంధాలు నెలకొనేలా కృషి చేస్తామని 2014 డిసెంబర్లో ఒబామా, రావుల్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. 2015 ఏప్రిల్‌లో వారి చరిత్రాత్మక భేటీ జరిగింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాల జాబితా నుంచి 2015 మేలో క్యూబాను అమెరికా తొలగించింది. కానీ, ఆర్థిక, వాణిజ్య నిషేధాన్ని ఇంకా పూర్తిగా తొలగించలేదు. క్యూబాపై నిషేధం తొలగింపునకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి కాగా క్యూబాతో సత్సంబంధాల పునరుద్ధరణకు రిపబ్లికన్లు సుముఖంగా లేరు. దీంతో ఒబామా తాజా పర్యటన జరుగుతోంది. మరోవైపు, కీలక వ్యవస్థలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ గుప్పిట్లో ఉన్న క్యూబాలో ఆ దేశ ప్రభుత్వానికి రుచించని విధంగా, చర్చల్లో మానవ హక్కుల అమలుకు అమెరికా ఒత్తిడి తేవొచ్చు.
ఒబామా పర్యటనకు కొద్ది గంటల ముందే, నిషేధిత మానవహక్కుల సంఘానికి చెందిన పలువురిని క్యూబా అరెస్ట్ చేసింది. కాగా, ఒబామా పర్యటనతో క్యూబా రాజకీయ విధానాల్లో గొప్ప మార్పులేం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, క్యూబాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనడానికి మరింత సమయం పట్టొచ్చని అంటున్నారు. క్యూబా పౌరుల నుంచి అమెరికా అధ్యక్షుడికి గొప్ప స్వాగతం లభించకూడదని రావుల్ భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఒబామాకు స్వాగతం పలికేందుకు రావుల్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లకపోవడాన్ని వారు గుర్తు చేశారు. ఒబామా పర్యటన సందర్భంగా హవానాలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో ఒబామా హక్కుల కార్యకర్తలను కలుసుకుంటారు.
పగ.. ప్రేమ
1959: క్యూబా విప్లవం. దేశాధ్యక్షుడు, నియంత, అమెరికా మద్దతున్న ఫుల్జెన్షియొ బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన ఫిడెల్ కాస్త్రో నేతృత్వంలోని గెరిల్లా దళం. కాస్త్రో నేతృత్వంలోని నూతన ప్రభుత్వాన్ని గుర్తించిన అమెరికా. యూఎస్‌లో పర్యటించిన కాస్త్రో . ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో భేటీ.
1960: క్యూబాలోని అమెరికాకు చెందని చమురు శుద్ధి కార్మాగారాలు సహా అన్ని ప్రైవేటు కంపెనీలను జాతీయికరించిన కాస్త్రో ప్రభుత్వం. ఆ తరువాత అన్ని అమెరికా కంపెనీల స్వాధీనం. అక్టోబర్‌లో క్యూబా ఎగుమతులపై నిషేధం విధించి, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్న అమెరికా.
1961: క్యూబా సోషలిస్ట్ దేశమన్న కాస్త్రో. ఏప్రిల్‌లో కాస్త్రో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా మద్దతుతో సాగిన ‘బే ఆఫ్ పిగ్స్’ చర్య విఫలం.
1962: క్యూబాతో వాణిజ్యం నిషేధం, ఇతర ఆంక్షల విధింపు. అక్టోబర్‌లో క్యూబాలోని రష్యా అణు క్షిపణులను తొలగించాలంటూ అమెరికా దిగ్బంధం. అణు యుద్ధం అంచున ప్రపంచం.
1977: క్యూబాతో సత్సంబంధాల పునరుద్ధరణకు నాటి యూఎస్ అధ్యక్షుడు కార్టర్ ప్రయత్నాలు. రీగన్ యూఎస్ అధ్యక్షుడవడంతో ఆగిన కృషి.
1991: చిరకాల మిత్రదేశం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో సంక్షోభంలో క్యూబా ఆర్థిక వ్యవస్థ.
2006: ఆనారోగ్యం బారిన ఫిడెల్ కాస్త్రో. సోదరుడు రావుల్ కాస్త్రోకు అధ్యక్ష బాధ్యతల అప్పగింత.
2014: దౌత్యసంబంధాల పునరుద్ధరణకు ఇరుదేశాల అంగీకారం.
2015: ఏప్రిల్‌లో ఒబామా, రావుల్ కాస్త్రోల చరిత్రాత్మక భేటీ.
2016: క్యూబా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా.