CUCET 2022: ఇంటర్ వెయిటేజీ రద్దు మంచిదే
దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల (సీయూల) ప్రవేశాల కోసం 2022–23 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ రద్దు చేయడం సరైన నిర్ణయం. ఇంటర్మీడియట్ మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలవుతున్నది. కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేసే విధంగా ప్రయోగాలకు ఎక్కువ మార్కులు వేస్తూ ఉండటాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గమనించి ఈ నిర్ణయం తీసుకోవటం అభినందనీయం.
సీయూ సెట్‌ని దేశవ్యాప్తంగా 13 భాషల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించడం కూడా అభినందించదగ్గదే. ఈ క్రమంలో రాష్ట్రాలలో ఉండే ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూ సెట్‌ను అనుసరించి ప్రవేశాలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించటం మంచి పరిణామం. సీయూ సెట్లో వచ్చిన మార్కులు, డిగ్రీ మార్కులను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రాలలో అమలులో ఉండే రిజర్వేషన్ ఆధారంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించడానికి యూజీసీ నిర్ణయించడం వల్ల... దొడ్డిదారిన సీట్లు పొందే వాళ్లకి చెక్ పెట్టినట్లు అవుతున్నది. (క్లిక్: కేంద్రీయ వర్సిటీల యూజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష)
ఇక మల్టిపుల్ ఛాయిస్‌లో ప్రశ్నలు, తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండటం అనేవి పరీక్షార్థులకు కొంచెం ఇబ్బందికరమే అయిన ప్పటికీ... జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష కనుక వడపోత జరగాలంటే ఇటువంటి మార్పులు తప్పవు. అయితే ప్రవేశాలకు సంబంధించిన మెరుగైన సంస్కరణలు చేపట్టే యూజీసీ తదనుగుణంగా విశ్వవిద్యాలయాలకు నిధులు మంజూరు చేయడం; ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలలో ప్రవేశాల సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు వేయడం సీయూ సెట్‌ని బలోపేతం చేస్తుంది. ఇంగ్లీష్‌తో పాటు, మన తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో, టెస్ట్ ఉండటం మాతృభాషలో చదువుకున్న వారికి ప్రయోజనకరం.
– డాక్టర్ నూకతోటి రవికుమార్, ఒంగోలు