ఐఐటీ కటాఫ్‌పై అయోమయం
జనరల్ విద్యార్థులకు 492, ఓబీసీకి 503 మార్కులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వింత విధానం
మన విద్యార్థులు నష్టపోయే అవకాశం
హైదరాబాద్ : ఎక్కడ ఏ భర్తీలు జరిగినా జనరల్ అభ్యర్థుల కంటే ఓబీసీకి కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటుంది. అది సహజం. కానీ ఐఐటీల్లో ప్రవేశాలకు ఖరగ్‌పూర్ ఐఐటీ సోమవారం రాత్రి ఇంటర్మీడియెట్‌లో టాప్-20 పర్సంటైల్‌కు ప్రకటించిన కటాఫ్ మార్కులు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి. జనరల్ విద్యార్థుల కన్నా ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు ఎక్కువ నిర్ణయించడమే దీనికి కారణం. అంతేకాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కటాఫ్ మార్కులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము విద్యార్థుల మార్కుల సీడీ మాత్రమే పంపించామని, అంతకుమించి తాము కటాఫ్ మార్కులకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వలేదని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంటోంది. కటాఫ్‌పై అటు సీబీఎస్ఈ గానీ, ఐఐటీ ఖరగ్‌పూర్ గానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల టాప్-20 పర్సంటైల్ కటాఫ్ విషయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర మార్కులను లేదా ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కులను కలిపి చూపించుకోవచ్చని స్పష్టం చేసింది. దాని ప్రకారం పరీక్షకు హాజరైన తెలుగు విద్యార్థులకు కేవలం ద్వితీయ సంవత్సర మార్కుల మేరకు 530కి గాను టాప్-20 పర్సంటైల్‌కు కటాఫ్‌ను జనరల్ అభ్యర్థులకు 492గా ఓబీసీలకు 503, ఎస్సీలకు 464, ఎస్టీలకు 463, వికలాంగులకు 463గా ప్రకటించింది.
ఇక రెండేళ్ల (ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి) మార్కులను తీసుకుంటే మొత్తం 1000 మార్కులకు జన రల్ అభ్యర్థులకు 920 మార్కులను కటాఫ్‌గా ప్రకటించింది. అదే ఓబీసీలకు 867 మార్కులు, ఎస్సీలకు 810, ఎస్టీలకు 807, వికలాంగులకు 807 మార్కులను కటాఫ్‌గా పేర్కొంది. రెండు సంవత్సరాల మార్కులను కలిపి చూస్తే బాగానే ఉన్నా... ద్వితీయ సంవత్సరం ఒక్కటే పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఓబీసీ అభ్యర్థులు నష్టపోయే స్థితి ఉంది. ఈ పద్ధతిలో జనరల్ అభ్యర్థికంటే ఓబీసీ అభ్యర్థి కటాఫ్‌లో 11 మార్కులు ఎక్కువుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
మొదటి దశ సీట్లు కేటాయింపు...
ఇదిలాఉండగా, మొదటి దశ సీట్ల కేటాయింపులను మంగళవారం ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. రెండో దశ సీట్ల కేటాయింపును జూలై 7న, మూడో దశ సీట్ల కేటాయింపును జూలై 12న ప్రకటించనుంది. అయితే సీట్ల కేటాయింపును ప్రకటించినా వెబ్సైట్లో వివరాలు ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత ఛాయిస్ ఇచ్చేందుకు అవకాశం లభించింది. వారు జూలై 4 వరకు ఫీజు చెల్లించవచ్చు.
తెలుగువిద్యార్థులకు నష్టం: మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఓబీసీ కటాఫ్ మార్కు ఎక్కువగా ఉండడంతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. తెలుగు వారు ఎక్కువగా ఐఐటీకి రాకుండా తగ్గించే కుట్ర చేశారు. సీబీఎస్ఈ కటాఫ్‌ను అన్ని రాష్ట్రాలకు ప్రామాణిక ంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపుడు ఎవరికి అన్యాయం జరగదు. ప్రతిభావంతులే ఐఐటీలకు వెళతారు.