Cyber Crimes Facebook
-
నకిలీ ‘ఫేస్బుక్’తో పారాహుషార్!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న సమాజంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ప్రజలకు తగ్గట్టుగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేస్బుక్.. ట్విట్టర్... ఇలా వివిధ సామాజిక ఖాతాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా ప్రజలు, అభిమానులకు దగ్గరగా ఉంటున్న వీఐపీలు, సెలబ్రిటీల పేర్లను వాడేస్తున్నారు. వారి ఖాతాల్లోని ఫొటోలు, వారు వాడే భాషను అనుకరిస్తూ ఏకంగా వారి పేరుకు దగ్గరగానే నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఇలా వీరు ఆ నకిలీ ఖాతా ద్వారా వారి అభిమానులు, కార్యకర్తలకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అబ్బా నిజంగా అంతా పెద్దోళ్ల దగ్గరి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో మరేమీ ఆలోచించకుండానే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరమవుతోంది. ఆ తర్వాత వారితో వ్యక్తిగత చాటింగ్ చేస్తూ దగ్గరవుతున్నారు. అనంతరం ఫలానా స్నేహితుడి కుమార్తె వేరే రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, మీ అభిమాన గాయకినైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తుండటంతో మీ సహకారం కావాలంటూ... ఇలా వివిధ కారణాలతో వారిని నమ్మిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన వారు మరో ఆలోచన చేకుండా వారు చెప్పినట్టుగానే నగదును ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి సరైన సమాధానం లేకపోవడం, వారి పోకడలపై అనుమానం రావడంతో మోసపోయామని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, స్వీయ అప్రమత్తతోనే మోసం బారిన పడకుండా ఉంటామని పోలీసులు సూచిస్తున్నారు. తెలుగు ప్లేబ్యాక్ సింగర్ పేరుతో... అనంతపురం ప్రియాంకనగర్‌కు చెందిన చైతన్య అలియాస్ చైతూ ప్రముఖ తెలుగు ప్లేబ్యాక్ సింగర్ పేరు ఉపయోగించి నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించాడు. ఆమె ఫాలోవర్లను పెద్ద సంఖ్యలో తనవైపునకు తిప్పుకున్నాడు. ఇది నిజమని నమ్మినవారు మోసగాడి వలలో పడి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ గాయని అతడు 2020 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా సనపలో తన పేరు మీద ఓ ఈవెంట్‌ను కూడా చేశాడని, తన అభిమానుల నుంచి డబ్బులు కొల్లగొట్టాడని ఫిర్యాదు చేశారు. అలాగే నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో తన బంధువుల, అభిమానులను ట్రాప్ చేసి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా సహకారంతో నిందితుడు చైతన్యను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఎంపీ సంతోష్‌కుమార్ జోగినిపల్లి పేరుతో... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి హైదరాబాద్‌లో ఉంటున్న బాధితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఇది నిజమని భావించి యాక్సెప్ట్ చేసిన బాధితుడితో నిజంగా జో గినిపల్లి సంతోష్ అనుకునేలా చాటింగ్ చేశాడు. చివరకు బాధితుడి నమ్మాడని తెలిశాక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడి కుమార్తెకు డబ్బులు అవసరమంటూ రెండు గూగుల్ పే నంబర్ల పంపాడు. ఇది నిజమని బాధితుడు రూ. లక్షను సదరు నంబర్లకు బదిలీ చేశాడు. తీరా ఇది మోసమని తెలిసి ఈ నెల 25న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జాగ్రత్తలు ఇలా... వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దు. సరిగా తనిఖీ చేసుకున్నాకే వారి సైన్ అనుకరించి ముందుకెళ్లాలి. డబ్బులు అవరమని చాట్ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్ కాల్ చేసి నిజమా, కాదా అన్నది నిర్ధారించుకోవాలి. పిల్లలు, వృద్ధులకు వైద్య చికిత్సలకు డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయవద్దు. వీవీఐపీ, వీఐపీ, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా డబ్బులు అడగరు. – వై.శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ, సైబర్‌క్రైమ్ -
చాటింగ్ చీటింగ్: యువతులూ తక్కువేం కాదు!
అమీర్‌పేట్ మధురానగర్‌కు చెందిన ముమ్మడి కార్తికేయ చిన్న స్థాయి దర్శకుడు. ఇతడికి విశాఖపట్నంలోని శీలానగర్కు చెందిన వివాహిత ఫేస్బుక్లో పరిచయమైంది. చాటింగ్ చేసి ఆమెకు మాయమాటలు చెప్పాడు. సిటీకి రప్పించి నయవంచన చేశాడు. కార్తికేయను మేడిపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ జానకి, ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్ ఉదంతం గతేడాది వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకొని మోసం చేసిన యశ్వంత్... ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. నగర చరిత్రలోనే తొలి ఫేస్బుక్ మర్డర్‌గా ఇది రికార్డులకెక్కింది. కేవలం ఈ రెండే కాదు.. ఫేస్బుక్ ఆధారంగా జరుగుతున్న నేరాలు ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. అయితే వీటిలో 10 శాతం కూడా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కట్లేదు. నేరుగా పరిచయం లేకపోయినా ‘ముఖ పరిచయం’తో ముందడుగు వేస్తున్న వాళ్లు నిండా మునుగుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని నగరవాసులు, ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సిటీలో సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్స్‌పై ప్రత్యేక కథనం.. – సాక్షి, సిటీబ్యూరో అతడో సైబర్ శాడిస్ట్... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే అబ్దుల్ మాజిద్ ఫేస్బుక్లో అమ్మాయిల నకిలీ ఖాతాలు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్‌ను గుర్తించి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపించేవాడు. అవతలి వారు అమ్మాయినే కదా అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగా చాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు. స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకి తలదూర్చుతాడు. విద్యార్థినుల నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. చాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, తల్లిదండ్రులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతాడు. ఈ తరహాలో బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. మాజిద్‌ను 2015 సెప్టెంబర్ 11న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించిన్నట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. స్నేహం ముసుగులో మోసం.. ‘ఫేస్బుక్ మర్డర్’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్బుక్ రేప్’ ఘటన చోటుచేసుకుంది. టోలిచౌకిలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతడికి సమీప ప్రాంతంలో నివసించే ఓ యువతి ఫేస్బుక్లో పరిచయమైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహంగా ఉన్న అతడు... గతేడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకొని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఈ నయవంచకుడు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు. బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో వంచన.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. తన ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ సైతం అందులో పొందుపరుస్తాడు. దరఖాస్తు చేసుకున్న వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారితో చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్ చేసి ‘చాటింగ్’ వివరాలను కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. తాను అడిగినంత ఇవ్వాలంటూ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్ అధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. యువతులూ తక్కువేం కాదు.. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్దరు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్‌గట్టీ, రికాబ్ గంజ్‌లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్బుల్లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రాడూన్, ఊటీ, వైజాగ్‌లలో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు. పరిచయం లేని స్నేహం వద్దు... కేవలం దారుణమైన నేరాలే కాదు... ఫేస్బుక్ ద్వారా వేధింపులకు సంబంధించిన కేసులు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. యువతుల పేర్లతో ఖాతాలు తెరిచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్మెయిల్ చేయడం వంటివీ ఉంటున్నాయి. అపరిచిత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యువతులు యాక్సెప్ట్ చేయొద్దు. పరిచయం లేని వారితో స్నేహం, చాటింగ్స్ చేయొద్దు. పరిచయమున్న వారితోనూ వ్యక్తిగత, ఆంతరంగిక అంశాలు ప్రస్తావించొద్దు. – సైబర్ క్రైమ్ పోలీసులు