చాటింగ్ చీటింగ్: యువతులూ తక్కువేం కాదు! | chating cheating in social media | Sakshi
Sakshi News home page

చాటింగ్ చీటింగ్: యువతులూ తక్కువేం కాదు!

Published Mon, Feb 20 2017 3:02 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

చాటింగ్  చీటింగ్: యువతులూ తక్కువేం కాదు! - Sakshi

చాటింగ్ చీటింగ్: యువతులూ తక్కువేం కాదు!

అమీర్‌పేట్‌ మధురానగర్‌కు చెందిన ముమ్మడి కార్తికేయ చిన్న స్థాయి  దర్శకుడు. ఇతడికి విశాఖపట్నంలోని శీలానగర్‌కు చెందిన వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. చాటింగ్‌ చేసి ఆమెకు మాయమాటలు చెప్పాడు. సిటీకి రప్పించి నయవంచన చేశాడు. కార్తికేయను మేడిపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ జానకి, ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ యశ్వంత్‌ కుమార్‌ ఉదంతం గతేడాది వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకొని మోసం చేసిన యశ్వంత్‌... ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. నగర చరిత్రలోనే తొలి ఫేస్‌బుక్‌      మర్డర్‌గా ఇది రికార్డులకెక్కింది.

కేవలం ఈ రెండే కాదు.. ఫేస్‌బుక్‌ ఆధారంగా జరుగుతున్న నేరాలు ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. అయితే వీటిలో 10 శాతం కూడా పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కట్లేదు. నేరుగా పరిచయం లేకపోయినా ‘ముఖ  పరిచయం’తో ముందడుగు వేస్తున్న వాళ్లు నిండా మునుగుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న  ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని నగరవాసులు, ముఖ్యంగా యువతులు  అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సిటీలో సంచలనం సృష్టించిన సైబర్‌ క్రైమ్స్‌పై ప్రత్యేక కథనం..   – సాక్షి, సిటీబ్యూరో  

అతడో సైబర్‌ శాడిస్ట్‌...
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లో నివసించే అబ్దుల్‌ మాజిద్‌ ఫేస్‌బుక్‌లో అమ్మాయిల నకిలీ ఖాతాలు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్‌ను గుర్తించి ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ పంపించేవాడు. అవతలి వారు అమ్మాయినే కదా అనే ఉద్దేశంతో రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగా చాటింగ్‌ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు. స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకి తలదూర్చుతాడు. విద్యార్థినుల నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. చాటింగ్‌ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని, తల్లిదండ్రులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతాడు. ఈ తరహాలో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. మాజిద్‌ను 2015 సెప్టెంబర్‌ 11న సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించిన్నట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు.

స్నేహం ముసుగులో మోసం..
‘ఫేస్‌బుక్‌ మర్డర్‌’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్‌బుక్‌ రేప్‌’ ఘటన చోటుచేసుకుంది. టోలిచౌకిలోని ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇతడికి సమీప ప్రాంతంలో నివసించే ఓ యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహంగా ఉన్న అతడు... గతేడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకొని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఈ నయవంచకుడు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు. బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు.

ఉద్యోగాల పేరుతో వంచన..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్‌బుక్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. తన ఈ–మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌ సైతం అందులో పొందుపరుస్తాడు. దరఖాస్తు చేసుకున్న వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్‌ నెంబర్, ఈ–మెయిల్‌ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారితో చాటింగ్‌ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్‌ చేసి ‘చాటింగ్‌’ వివరాలను కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. తాను అడిగినంత ఇవ్వాలంటూ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్‌ అధీనంలోని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

యువతులూ తక్కువేం కాదు..
ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి  యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్దరు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్‌గట్టీ, రికాబ్‌ గంజ్‌లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్‌బుల్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్‌ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రాడూన్, ఊటీ, వైజాగ్‌లలో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు.

పరిచయం లేని స్నేహం వద్దు...
కేవలం దారుణమైన నేరాలే కాదు... ఫేస్‌బుక్‌ ద్వారా వేధింపులకు సంబంధించిన కేసులు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. యువతుల పేర్లతో ఖాతాలు తెరిచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటివీ ఉంటున్నాయి. అపరిచిత వ్యక్తులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తే యువతులు యాక్సెప్ట్‌ చేయొద్దు. పరిచయం లేని వారితో స్నేహం, చాటింగ్స్‌ చేయొద్దు. పరిచయమున్న వారితోనూ వ్యక్తిగత, ఆంతరంగిక అంశాలు ప్రస్తావించొద్దు.   – సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement