Cyclone Burevi
-
బురేవి తుపాన్ విలయం.. 26 మంది మృతి
బురేవి తుపాను ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోగా లక్షకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దక్షిణ తమిళనాడును భయపెట్టిన బురేవి తుపాన్ తీరానికి చేరకుండానే దిశమార్చుకుంది. క్రమంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపు కదలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, చెన్నై: ఈశాన్య రుతపవనాలు ప్రభావంతో రాష్ట్రంలో రెండు నెలలుగా ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. గత నెల నివర్, ఇప్పుడు బురేవి తుపాన్లు భారీ వర్షాలతో రాష్ట్రాన్ని వెంటాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారిన ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ జిల్లాలు, డెల్టా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. శనివారం మధ్యాహ్నానికి అందిన సమాచారం ప్రకారం అల్పపీడన ద్రోణి రామనాథపురం–పాంబన్ సముద్రతీరంలో గత 40 గంటలకు పైగా ఒకేచోట కేంద్రీకృతమై ఉంది. మన్నార్‌వలైకుడా సముద్రతీరంలో శుక్రవారం రాత్రి వరకు స్థిరంగా ఉండిన తుపాన్ బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారింది. శనివారం సాయంత్రం దిండుగల్–మనప్పారై– వేటసత్తూరు మధ్యన పశ్చిమం వైపుగా అరేబియా సముద్రం వైపు కదలడంతో తుపాన్ ముప్పు తప్పింది. అయితే ఈ కారణంగా నీలగిరి, తేనీ, దిండుగల్లు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురిసాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, సేలం జిల్లాల్లోని ఒకటి రెండుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ కారణంగా కడలూరు, అరియలూరు, కారైక్కాల్, మైలాడుదురై, రామనాథపురం, తంజావూరు, తిరువళ్లూరు, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రామనాథపురం, మదురై, విరుదునగర్ ఈ మూడు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలకు అవకాశం ఉంది. చెన్నైలో సైతం ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. కన్నీటి కడలి.. బురేవి తుపాన్ రాష్ట్రాన్ని తాకకున్నా కడలూరు జిల్లాను కన్నీటి కడలిగా మార్చివేసింది. 300 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని దీవిని తలపిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకుని విలవిలలాడుతున్న 48 మందిని అధికారులు రక్షించారు. మూడు రోజుల పాటు ఎడతెరపిలేకుండా ముంచెత్తిన వర్షాలతో రోడ్లు తెగిపోగా, జనజీవనం స్తంభించిపోయింది. చిదంబరం, దాని పరిసరాల్లో కుండపోత వర్షాలతో 200 ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. చిదంబరం ఆలయంలో నడుము లోతు నీళ్లు చేరిపోగా చెరువులా మారిపోయింది. 778 ఇల్లు దెబ్బతిన్నాయి. 30 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. 50కి పైగా పశు సంపద బలైంది. డెల్టా జిల్లాల్లో కుండపోత వర్షాలు 10 లక్షల ఎకరాల పంట నష్టం కలిగించాయి. చెరకు, అరటి, పత్తి, మొక్కజొన్న నేలకొరిగాయి. తిరునల్వైలి, తెన్కాశి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. చెన్నై దాహార్తిని తీర్చే అన్ని జలాశయాలు 90 శాతం నీటితో కళకళలాడుతుండగా ఏడాది పాటు తాగునీటి సమస్య ఏర్పడదని అధికారులు చెబుతున్నారు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో 676 చెరువులు వరద నీటితో 100 శాతం నిండిపోయాయి. చెన్నై శివారు నారాయణపురంలో వరద నీటి తాకిడికి రెండు వేల ఇల్లు మునిగిపోవడంతో వారంతా బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. గత 24 గంటల్లో చెన్నైలో 12 సెంటీమీటర్ల వర్షం పడడంతో 75 ప్రాంతాలు నీటమునిగాయి. చదవండి: (భయపెడుతున్న బురేవి) నలుగురు గల్లంతు–రక్షింపు.. కున్రత్తూరు సమీపం నందంబాక్కంకు చెందిన అన్సారి (20), అతడి సోదరి తమీమా (18), స్నేహితులు ఆనంద్ (25), రాజ్ (25) శుక్రవారం ఉదయం సరుకుల కొనుగోలుకు వెళ్లి అదేరోజు రాత్రి రెండు మోటార్‌సైకిళ్లలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకుని చెంబరబాక్కం ఉపరితల నీటిని వదలినందున వాహనాలు వెళ్లకూడదని చెప్పారు. వారి మాటలు పెడచెవిన పెట్టి లోతట్టు వంతెనపైకి చేరుకోగానే వాహనాలు సహా నలుగురూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే ప్రవాహం మధ్యలో ఉన్న ఇసుకదిన్నెపైకి ఎక్కగా, అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులతో సీఎం సమీక్ష.. నివర్, బురేవి తుపాన్ వల్ల రాష్ట్రంలోని పరిస్థితులను అ«ధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం తమిళనాడుకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నై సచివాలయంలో అధికారులతో శనివారం సమావేశమయ్యారు. కేంద్ర బృందం రెండు బృందాలుగా ఏర్పడి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఆదివారం పర్యటించనుంది. -
భయపెడుతున్న బురేవి
సాక్షి, చెన్నై: నివర్కు కొనసాగింపుగా పుట్టుకొచ్చిన బురేవి తుపాన్ రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. ఈ తుపాన్ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో భారీ వర్షాలు, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, విల్లుపురం, తిరువణ్ణా మలై, అరియలూరు, పెరంబలూరు, వేలూరు, తిరువళ్లూరు, రాణిపేట, కారైకాల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతం ఈశాన్యంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత బురేవి తుపానుగా రూపాంతరం చెంది శ్రీలంక వైపునకు ప్రయాణించడం ప్రారంభించింది. గురువారం మధ్యాహ్నం శ్రీలంకను దాటి పాంబన్ ప్రాంతంలో కేంద్రీకృతమై కన్యాకుమారి మీదుగా తీరం దాటుతుందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనావేసింది. గురువారం రాత్రే తుపాన్ బలపడడం ప్రారంభంకావడంతో రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున రామనాథపురం సముద్ర తీరానికి సమీపంలో బురేవి తుపాను కేంద్రీకృతమైంది. ఈ కారణంగా కన్యాకుమారి జిల్లాకు ఈశాన్యం ప్రాంతంలో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తూత్తుకుడి, రామనాథపురం, శివగంగై, నాగపట్నం, కారైక్కాల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, సముద్రతీర ప్రాంతాలు భారీ వర్షాలను చవిచూశాయి. రామనాథపురం, తూత్తుకుడి జిల్లాల వద్ద సముద్ర తీరానికి సమీపం మన్నార్వలైగూడా ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. బురేవి ప్రభావం వల్ల రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరులో 34 సెంటీ మీటర్ల వర్షం పడడంతో చిదంబరం ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. తూత్తుకుడి, మదురై, కొచ్చికి చెన్నై నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలు భారీ వర్షాల కారణంగా రద్దయ్యాయి. చదవండి: (బురేవి తుపాన్: ఆ మూడు చోట్ల కల్లోలమే..) చెన్నై నగరం కాదు చెరువు.. బురేవి తుపాను చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. చెన్నై వరద నీటితో చెరువులా మారిపోయింది. చెన్నై శివారు ప్రాంతాలైన తాంబరం సహా అనేక ప్రాంతాల్లోని నివాసగృహాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నివర్ తుపాను కారణంగా ప్రవహించిన నీటి నుంచి బయటపడకముందే బురేవి వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చెన్నై శివార్లలోని ముడిచ్చూర్ పరిసరాల్లోని 20 నివాస ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలోని అడయారు, రాయపేట, మైలాపూర్, ఎగ్మూర్, పురసైవాక్కం, గిండి, సైదాపేట ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. అశోక్‌నగర్‌లో ద్విచక్ర వాహనాలు మునిగిపోయేంతగా వరద నీరు ప్రవహించింది. చెన్నై, శివారు ప్రాంతాలు వరద నీటితో తేలియాడడంతో విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. రెండు వారాలుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా చెన్నై, శివారు ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లలో వరదనీటి ప్రవాహం వల్ల సిటీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు విద్యుత్ రైళ్లపై ఆధారపడ్డారు. మందవెలి బస్సు డిపో నీట మునగడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. బురేవి తుపాను కారణంగా చెన్నైలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి.. బురేవి తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తొమ్మిది మందిని బలి తీసుకున్నాయి. లక్ష ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. మైలాడుదురై జిల్లాకు చెందిన శరత్ కుమార్ (31) శుక్రవారం తెల్లవారుజామున రోడ్లో నడుస్తూ తెగిన విద్యుత్ తీగను తొక్కడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆరుంగాల్ గ్రామానికి చెందిన శివభాగ్యం (60) సైతం విద్యుదాఘాతంతో మరణించారు. తంజావూరు జిల్లా వడకాల్ చక్కర గ్రామానికి చెందిన శారదాంబాల్ (70) ఇంటి ప్రహరీ గోడ కూలడంతో శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. కుంభకోణం సమీపం ఎలుమిచ్చకాయ్ గ్రామానికి చెందిన కుప్పుస్వామి (70), ఆయన భార్య యశోద (65)పై ఇల్లు కూలడంతో ప్రాణాలు వదిలారు. కడలూరుకు జిల్లాకు చెందిన సంజన (10) గోడ కూలి మృతిచెందింది. పెరియకాట్టు పాళయం గ్రామానికి చెందిన ధనమైయిల్ (55) సైతం ఇంటి గోడ కూలడంతో మృతిచెందింది. చెన్నై తండయారుపేటకు చెందిన కార్మికుడు సురేష్ (38) విధులకు రోడ్డులో నడిచి వెళుతుండగా తెగిన విద్యుత్ తీగపై కాలు వేసి కరెంటు షాక్‌కు గురై కన్నుమూశాడు. చెన్నై అడయారు చెరువులో వరద నీటిలో కొట్టుకొస్తున్న గుర్తుతెలియని పురుషుని శవాన్ని కనుగొన్నారు. చెరువులో వరద ప్రవాహం వేగంగా ఉండడంతో శవాన్ని ఒడ్డుకు చేర్చే ధైర్యం చేయలేకపోయారు. కడలూరు జిల్లాలోని చిదంబరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నటరాజస్వామి ఆలయం ప్రాకారం మొత్తం నీట మునిగింది. 1977కు తర్వాత అంటే 43 ఏళ్ల తర్వాత ఆల యంలో నడుము లోతు నీళ్లు చేరాయి. నేడు కేంద్ర బృందం రాక.. రాష్ట్రంలో నివర్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నష్టాలను అంచనావేసేందుకు కేంద్ర బృందం శనివారం తమిళనాడుకు చేరుకుంటోంది. తొలి రోజున కడలూరు, విల్లుపురం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. -
మన్నార్ గల్ఫ్‌పై 'బురేవి' తీవ్ర ప్రభావం
సాక్షి, చెన్నై : బురేవి తుపాన్ తమిళనాడు రామనాథపురం జిల్లా తీరానికి దగ్గరగా ఉన్న మన్నార్ గల్ఫ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఆరు గంటలలో 90 కి.మీ వేగంతో నైరుతి దిశగా పయనిస్తూ ప్రస్తుతం మన్నార్ గల్ఫ్ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది రామనాథపురానికి నైరుతి దిశలో 40 కి.మీ, పంబన్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 70 కి.మీ, కన్యా కుమారికి ఈశాన్యంగా 160 కి.మీ. దూరంలో ఉంది. దీంతో గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే పాంబన్, మండపం, ధనుష్కోటి తీరాల్లో తుపాన్ దాటికి తీవ్ర నష్టం ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతంలో మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. (బురేవి తుపాన్: ఆ మూడు చోట్ల కల్లోలమే..) -
బురేవి తుపాన్: ఆ మూడు చోట్ల కల్లోలమే..
సాక్షి, చెన్నై: బురేవి తుపాన్ రూపంలో రాష్ట్రంలోని సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు పది అడుగుల మేరకు ఎగసిపడడంతో కలవరం తప్పలేదు. పాంబన్, మండపం, ధనుష్కోటి తీరాల్లో తుపాన్ దాటికి తీవ్ర నష్టం ఎదురయ్యే పరిస్థితి. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయాన్నే ఈ తుపాన్ తీరం దాటినానంతరం కూడా రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. సెంబరంబాక్కం గేట్లను మళ్లీ తెరిచారు. అడయార్ నదీ తీరవాసుల్ని అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో నెలకొన్న బురేవి తుపాన్ బుధవారం శ్రీలంకలోని త్రికోణమలై వద్ద తీరాన్ని తాకింది. అక్కడ తన ప్రళయ ప్రతాపాన్ని చూపించిన బురేవి గురువారం మన్నార్‌వలిగుడా మీదుగా తమిళనాడు సరిహద్దుల వైపుగా కదిలింది. తొలుత పాంబన్కు 110 కి.మీ దూరంలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటల పాటు ఈ తుపాన్ కేంద్రీ కృతమై ఉండడంతో నాగపట్నం, తిరువారూర్, తంజావూరు డెల్టా జిల్లాల్లో, దిండుగల్, నీలగిరి, తేని కొండ ప్రాంతాలతో నిండిన జిల్లాల్లో, కడలూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీగానే వర్షం పడింది. చెన్నైలో తెరపించి తెరపించి అక్కడక్కడ వర్షం పడుతూ వచ్చింది. ఈ బురేవి తుపాన్ దాటికి చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అనేక తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే పరిస్థితి నెలకొంది. చదవండి: (రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం) ఐదు జిల్లాల్లో.. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లోనే ఈ తుపాన్ ప్రభా వం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్తలతో పెనునష్టాన్ని తప్పించే చర్యలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. శివగంగై, మదురై, విరుదునగర్‌లలోనూ అనేక చోట్ల వర్షాలు పడుతూ వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఈ తుపాన్ నైరుతి దిశలో పయనించడం మొదలెట్టింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపుగా బురేవి దూసుకురావడంతో వర్షం తీవ్రత క్రమంగా పెరిగింది. ఆ మూడు చోట్ల కల్లోలమే.. శ్రీలంకను దాటి మళ్లీ తమిళ భూభాగాన్ని తాకేందుకు బురేవి కదలడంతో అధిక ప్రభావం రామేశ్వరం, మండపం, పాంబన్ సముద్ర తీరాల్లో నెలకొంది. గంటకు 90 నుంచి వంద కి.మీ వేగంతో గాలులు వీయడం, సముద్రంలో అలల తాకడి వెరసి ప్రజల్లో ఆందోళన తప్పలేదు. ముందుగానే తీరవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినా, ఎలాంటి విపత్తు ఎదురవుతుందో అనే ఆందోళన వీడలేదు. ఇందుకు తగ్గట్టుగానే సముద్ర తీరంలోని చెక్‌పోస్టులు, రోడ్లు దెబ్బ తిన్నాయి. పాంబన్ తీరంలో చిక్కుకున్న కొందరు జాలర్లను రక్షించారు. తీరం వైపు సమీపించే కొద్ది సముద్ర తీర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు మొదలయ్యాయి. రెండు రోజులు వర్షం.. బురేవి పాంబన్ – కన్యాకమారి మధ్యలో గురువారం అర్ధరాత్రి వేళ తీరాన్ని తాకనుంది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు శుక్రవారం ఉదయం వరకు సమయం పట్టనుంది. దీంతో రామనాథపురం, కన్యాకుమారి తీరాల్లో అతి భారీ వర్షం పడింది. ఈ తుపాన్ తీరం దాటినా రెండు రోజులు రాష్ట్రంపై దీని ప్రభావం ఉంటుంది. తిరుచ్చి, తిరువారూర్, తంజావూరు, అరియలూరు, కడలూరు, విల్లుపురంఈరోడ్, ధర్మపురి, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా ల్లో ఈ ప్రభావంతో వర్షాలు మోస్తరుగా పడనున్నాయి. పుదుచ్చేరిలోనూ వర్షం పడుతుండడంతో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉబరి నీటి విడుదల.... కాంచీపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సెంబరంబాక్కంలోకి నీటి రాక మరో మారు పెరిగింది. గురువారం 22 అడుగుల్ని మళ్లీ నీటి మట్టం దాటడంతో గేట్లను ఎత్తి వేసి ఉబరి నీటిని విడుదలచేస్తున్నారు. చెన్నై శివార్ల నుంచి , సెంబరంబాక్కం నుంచి అడయార్‌లోకి నీటి రాక పెరడం ఆతీరం వెంబడి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పూండి రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో గురువారం మరో రెండు గేట్లను తెరిచి 4500 గణపుటడుగుల నీటిని విడుదల చేశారు. అమిత్ షా ఆరా.. బురేవిని ఎదుర్కొనే విధంగా చేపట్టిన ముందు జాగ్రత్తల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. వారం వ్యవధిలో తమిళనాడు రెండు తుపాన్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరించే పనిలో పడింది. ముందు జాగ్రత్తలు ఆగమేఘాలపై జరిగాయి. దీంతో సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడిన అమిత్‌షా ముందు జాగ్రత్తలపై ఆరా తీశారు. విపత్తులు ఎదురైన అందుకు తగ్గట్టు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
తీరం దాటినా.. తుపాన్‌గానే..
సాక్షి, విశాఖపట్నం: తీరం దాటుతుంది.. మళ్లీ సముద్రంలోకి ప్రవేశించి.. తుపాన్‌గా కొనసాగుతుంది.. ఆ తర్వాత మరోసారి తీరం దాటి బలహీనపడుతుంది. ఇదీ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న బురేవీ తుపాన్ స్వరూపం. తీవ్ర వాయుగుండం బలపడి బుధవారం ఉదయం 8.30 గంటలకు తుపాన్‌గా మారిన బురేవీ.. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలైకు తూర్పుదిశగా 170 కిమీ, తమిళనాడులోని పాంబన్కు తూర్పు ఆగ్నేయ దిశగా 390 కిమీ, కన్యాకుమారికి తూర్పు ఈశాన్య దిశగా 560 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ.. శ్రీలంకకు సమీపంలో ట్రింకోమలైకి దగ్గర్లో శుక్రవారం సాయంత్రం గానీ, రాత్రికి గానీ తీరం దాటే అవకాశం ఉంది. అనంతరం.. ఇది పశ్చిమ దిశగా పయనించి.. మరోసారి సముద్రంలోకి తుపాన్‌గా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నైరుతి దిశగా పయనిస్తూ తమిళనాడులోని పాంబన్– కన్యాకుమారి మధ్య 3వ తేదీ రాత్రి గానీ, 4వ తేదీ ఉదయం గానీ బురేవీ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందనీ, అత్యధికంగా మేఘాల్ని తోడుకుపోవడంతో... దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల బురేవీ ప్రభావం స్వల్పంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. 3, 4 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం
సాక్షి, చెన్నై: నివర్ తరువాత రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం పట్టుకుంది. బుధవారం సాయంత్రం లేదా రాత్రి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తీరందాటే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో తుపాన్ సహాయక చర్యలను సమీక్షించారు. దక్షిణ బంగాళాఖాతంలో గత నెల 28 నుంచి కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారి 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. మంగళవారం సాయంత్రానికి వాయుగుండం 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతూ నేడు సాయంత్రం లేదా రాత్రి త్రికోణకొండల సమీపంలో తీరందాటగలదని అంచనావేశారు. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్‌కాశీ జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యలపై సీఎం ఎడపాడి సమీక్ష నిర్వహించారు. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్) బురేవిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని, భయపడాల్సిన పని లేదని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మీడియాకు మంగళవారం తెలిపారు. అరక్కోణం నుంచి 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నాగర్‌కోవిల్‌కు పంపామన్నారు. కుమరి నుంచి 161 మరపడవల్లో ఇటీవల సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన రెండువేల మంది మత్స్యకారులు తీరం చేరకపోవడంతో ఆందోళన నెలకొంది. బురేవి హెచ్చరికల సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు చేపట్టారు. -
అలర్ట్; ముంచుకొస్తున్న మరో ముప్పు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు కన్యాకుమారి (ఇండియా)కి ఆగ్నేయ దిశగా సుమారు 1,120 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ తుపాన్‌కు ‘బురేవి’ తుపాన్‌గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సుమారు డిసెంబర్ రెండో తేది సాయంత్రం శ్రీలంక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణించి ఆ తర్వాత డిసెంబర్ మూడు ఉదయానికి కోమారిన్ ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. (అన్ని విధాలా ఆదుకుంటాం: సీఎం జగన్)