బురేవి తుపాను ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోగా లక్షకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దక్షిణ తమిళనాడును భయపెట్టిన బురేవి తుపాన్ తీరానికి చేరకుండానే దిశమార్చుకుంది. క్రమంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపు కదలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతపవనాలు ప్రభావంతో రాష్ట్రంలో రెండు నెలలుగా ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. గత నెల నివర్, ఇప్పుడు బురేవి తుపాన్లు భారీ వర్షాలతో రాష్ట్రాన్ని వెంటాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారిన ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ జిల్లాలు, డెల్టా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. శనివారం మధ్యాహ్నానికి అందిన సమాచారం ప్రకారం అల్పపీడన ద్రోణి రామనాథపురం–పాంబన్ సముద్రతీరంలో గత 40 గంటలకు పైగా ఒకేచోట కేంద్రీకృతమై ఉంది. మన్నార్‌వలైకుడా సముద్రతీరంలో శుక్రవారం రాత్రి వరకు స్థిరంగా ఉండిన తుపాన్ బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారింది.
శనివారం సాయంత్రం దిండుగల్–మనప్పారై– వేటసత్తూరు మధ్యన పశ్చిమం వైపుగా అరేబియా సముద్రం వైపు కదలడంతో తుపాన్ ముప్పు తప్పింది. అయితే ఈ కారణంగా నీలగిరి, తేనీ, దిండుగల్లు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురిసాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, సేలం జిల్లాల్లోని ఒకటి రెండుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ కారణంగా కడలూరు, అరియలూరు, కారైక్కాల్, మైలాడుదురై, రామనాథపురం, తంజావూరు, తిరువళ్లూరు, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రామనాథపురం, మదురై, విరుదునగర్ ఈ మూడు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలకు అవకాశం ఉంది. చెన్నైలో సైతం ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు.
కన్నీటి కడలి..
బురేవి తుపాన్ రాష్ట్రాన్ని తాకకున్నా కడలూరు జిల్లాను కన్నీటి కడలిగా మార్చివేసింది. 300 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని దీవిని తలపిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకుని విలవిలలాడుతున్న 48 మందిని అధికారులు రక్షించారు. మూడు రోజుల పాటు ఎడతెరపిలేకుండా ముంచెత్తిన వర్షాలతో రోడ్లు తెగిపోగా, జనజీవనం స్తంభించిపోయింది. చిదంబరం, దాని పరిసరాల్లో కుండపోత వర్షాలతో 200 ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. చిదంబరం ఆలయంలో నడుము లోతు నీళ్లు చేరిపోగా చెరువులా మారిపోయింది. 778 ఇల్లు దెబ్బతిన్నాయి. 30 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. 50కి పైగా పశు సంపద బలైంది. డెల్టా జిల్లాల్లో కుండపోత వర్షాలు 10 లక్షల ఎకరాల పంట నష్టం కలిగించాయి.
చెరకు, అరటి, పత్తి, మొక్కజొన్న నేలకొరిగాయి. తిరునల్వైలి, తెన్‌కాశి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. చెన్నై దాహార్తిని తీర్చే అన్ని జలాశయాలు 90 శాతం నీటితో కళకళలాడుతుండగా ఏడాది పాటు తాగునీటి సమస్య ఏర్పడదని అధికారులు చెబుతున్నారు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో 676 చెరువులు వరద నీటితో 100 శాతం నిండిపోయాయి. చెన్నై శివారు నారాయణపురంలో వరద నీటి తాకిడికి రెండు వేల ఇల్లు మునిగిపోవడంతో వారంతా బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. గత 24 గంటల్లో చెన్నైలో 12 సెంటీమీటర్ల వర్షం పడడంతో 75 ప్రాంతాలు నీటమునిగాయి. చదవండి: (భయపెడుతున్న బురేవి)
నలుగురు గల్లంతు–రక్షింపు..
కున్రత్తూరు సమీపం నందంబాక్కంకు చెందిన అన్సారి (20), అతడి సోదరి తమీమా (18), స్నేహితులు ఆనంద్ (25), రాజ్ (25) శుక్రవారం ఉదయం సరుకుల కొనుగోలుకు వెళ్లి అదేరోజు రాత్రి రెండు మోటార్‌సైకిళ్లలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకుని చెంబరబాక్కం ఉపరితల నీటిని వదలినందున వాహనాలు వెళ్లకూడదని చెప్పారు. వారి మాటలు పెడచెవిన పెట్టి లోతట్టు వంతెనపైకి చేరుకోగానే వాహనాలు సహా నలుగురూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే ప్రవాహం మధ్యలో ఉన్న ఇసుకదిన్నెపైకి ఎక్కగా, అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
అధికారులతో సీఎం సమీక్ష..
నివర్, బురేవి తుపాన్ వల్ల రాష్ట్రంలోని పరిస్థితులను అ«ధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం తమిళనాడుకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నై సచివాలయంలో అధికారులతో శనివారం సమావేశమయ్యారు. కేంద్ర బృందం రెండు బృందాలుగా ఏర్పడి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఆదివారం పర్యటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment