
సాక్షి, చెన్నై: నీటిలో కొట్టుకెళుతున్న కుమార్తెను రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులు మరణించారు. వీరిని రక్షించేందుకు యువకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. తేని జిల్లా కంబానికి చెందిన అబుదాహీర్(49) స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. శనివారం భార్య అమీనా బేగం(40), కుమార్తె అనీషా(12)తో కలిసి చిన్నమనూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ముల్లై పెరియార్ చెక్ డ్యాంకు వెళ్లారు. అక్కడ నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఒడ్డుపైనే ఉన్నారు. అయితే, అనీషా హఠాత్తుగా నది వైపుగా చొచ్చుకు వెళ్లి జారి పడింది. దీంతో ఆమెను రక్షించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. నీటిలో కొట్టుకెళ్తున్న వీరిని గుర్తించిన యువకులు వారిని రక్షించే యత్నం చేశారు. అతి కష్టంపై అనీషాను రక్షించి ఒడ్డుపైకి తీసుకొచ్చారు.
అయితే, నీటి ఉధృతికి తల్లిదండ్రులు ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న చిన్నమ నూరు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం తప్పలేదు. ఎట్టకేలకు ఊత్తం పాళయం వద్ద అమీనాబేగం మృతదేహం బయటపడింది. చెక్ డ్యాం నీటి ఉధృతిని తగ్గించినానంతరం చేపట్టిన గాలింపుతో అబుదాహీర్ మృతదేహం సైతం బయటపడింది. రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనను రక్షించే యత్నంలో తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అనీషా కన్నీరు మున్నీరు అవుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment