Cyclone Mandous
-
గుడ్‌న్యూస్: పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో మాండూస్ తుపాను ప్రభావంతో పొగాకు పంట నష్టపోయిన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన రైతులకు పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని పంట రుణం ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ మంత్రి పియూష్ గోయెల్ ఆమోదించారని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు చెప్పారు. గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి సభ్యులు 28,112 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.28.11 కోట్లు పంపిణీ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. పొగాకు పంట నష్టపోయినట్లు రైతులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజమండ్రిలోని సెంట్రల్ టూబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీటీఆర్ఐ)కి చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు తుపాను ప్రభావిత పొగాకు పొలాలను సందర్శించి, తక్షణ నష్ట నివారణకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. సుమారు రూ.25 కోట్ల మేర పొగాకు రైతులు మాండూస్ తుఫాను వల్ల నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం బ్యారన్‌కు ఇచ్చిన రూ.5 లక్షలు రుణంకు అదనంగా మరో రూ.50 వేలు రుణం ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి సిఫారసు చేశామని చెప్పారు. అంతేకాకుండా పొగాకు పంట నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో పొగాకు వేలం జరుగుతోందని, అత్యధికంగా కిలోకు రూ.271 ధర లభిస్తోందని, సగటున కిలోకు రూ.239.16 లభించిందని తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి మాసం చివర కానీ, మార్చి మొదటి వారంలో కానీ ఆక్షన్ ప్రారంభమవుతోందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు
కొత్తపట్నం/చీరాల టౌన్: బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోగా.. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆదివారం సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న ఏడుగురు మత్స్యకారుల బృందం ఓడరేవు గ్రామం నుంచి గరికన కృష్ణ, మల్లె బంగారయ్య, మెరుగు శివ, కుక్కల మహేష్, మరద పౌలు, దాసరి పంపోజీ, మెరుగు ప్రసాద్ (డ్రైవర్) సముద్రంలో నెల్లూరు జిల్లా వైపు బయలుదేరారు. 4 రోజుల పాటు వేట కొనసాగించారు. ఆ సమయంలో మాండూస్ తుపాను హెచ్చరికలు వెలువడటంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వీరి మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోగా.. కాసేపటికే ఆ బోటులోని ఒక ఇంజన్ చెడిపోయింది. అలల ఉధృతికి బోటు ముందుకు సాగలేదు. దీంతో వారు నడిసంద్రంలోనే బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా ముందుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం మొబైల్ సిగ్నల్స్ పనిచేయడంతో టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తాము ఆపదలో ఉన్నామని అధికారులకు సమాచారమిచ్చారు. యంత్రాంగం అప్రమత్తం సమాచారం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మెరైన్, మత్స్యశాఖ, స్పెషల్ బ్రాంచ్, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులతో ఫోన్లో సంప్రదించగా.. రాకాసి అలలు ఉధృతంగా వస్తున్నాయని బోటు తిరగబడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపట్నం సమీపంలోని గుండమాల రేవుకు వెళ్తామని అధికారులకు చెప్పగా.. చీరాల మత్స్యశాఖ జేడీ పి.సురేష్, ఇతర అధికారులు కొత్తపట్నం బీచ్‌కు చేరుకున్నారు. అనంతరం మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడి.. వారిని గుండమాలకు వెళ్లొద్దని, కొత్తపట్నం బీచ్‌కు రావాలని, తాము ఇక్కడే ఉన్నామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వారంతా శనివారం రాత్రి 9 గంటలకు కొత్తపట్నం సమీపానికి వచ్చారు. అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో ముందుకు రాలేమని చెప్పి బీచ్‌కు 500 మీటర్ల దూరంలో లంగర్ వేసుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం కొత్తపట్నం బీచ్‌కు చేరుకుని వేరే బోటును తీసుకెళ్లి వారిని తీసుకొచ్చారు. -
ఏపీ: మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల
సాక్షి, విజయవాడ: మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. కాగా మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.