తరుముకొస్తున్న మరో తుఫాను.. పేరేంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది. మాయాబందర్ (అండమాన్ దీవులు)కి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర దిశగా మయన్మార్ తీరం వైపు పయనించనుందని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది.
సైక్లోన్ 'అసాని'
కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా మారితే 'అసాని' అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరును శ్రీలంక పెట్టింది. శ్రీలంకలోని అధికారిక భాషలలో ఒకటైన సింహళంలో 'అసాని' అంటే 'కోపం' అనే అర్థం వస్తుంది. అయితే 'అసాని' తుఫాను ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా.. అధిక తీవ్రత కలిగిన తుఫానుగా మారబోదని చెప్పారు.
ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టే వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరింటిలో భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు 13 సభ్య దేశాలు పేర్లు ప్రతిపాదించడానికి ఐఎండీ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుంది.
13 దేశాలు.. 169 పేర్లు
ఇండియాతో సహా బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.. ఇప్పటికే పేర్లను ప్రతిపాదించాయి. ఒక్కో దేశం 13 పేర్లు చొప్పున ప్రతిపాదించగా.. మొత్తం 169 పేర్లతో 2020లో జాబితాను రూపొందించారు. దేశాల పేర్లను అక్షర క్రమంలో ఉంచారు. వీటి ఆధారంగా ఆయా దేశాలు పెట్టిన పేర్లను వరుసగా తీసుకుంటారు. ఉదాహరణకు గతేడాది అక్టోబర్లో ఏర్పడిన తుఫానుకు ‘షహీన్’ అని పేరు పెట్టారు. ఖతార్ ఈ పేరు పెట్టింది. డిసెంబర్లో వచ్చిన తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్’ పేరు పెట్టారు. అక్షర క్రమంలో సౌదీ తర్వాత ఉన్న శ్రీలంక వంతు ఇప్పుడు వచ్చింది. కాబట్టి శ్రీలంక సూచించిన 'అసాని' పేరును తాజాగా వాడుతున్నారు.
IMD issues new list of Names of Tropical Cyclones over north Indian Ocean. The current list has a total of 169 names including 13 names each from 13 WMO/ESCAP member countries. Detailed Press Release available at https://t.co/dArV0Ug8nh and https://t.co/wRl94BzRXr pic.twitter.com/ge0oVz4riD
— India Meteorological Department (@Indiametdept) April 28, 2020
పేర్లు ఎందుకు పెడతారు?
ఒకే సమయంలో తుఫానులు ఏర్పడినపుడు గందరగోళాన్ని నివారించడానికి తుఫానులకు పేర్లు పెడుతున్నారు. ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవడానికి.. ఏయే తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందనే వివరాలు నమోదు చేయడానికి ఈ విధానం తోడ్పతుంది. ఏ తుఫాను సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నామో విశ్లేషించడం ద్వారా ముందస్తు చర్యలకు వీలు పడుతుంది. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!)
'అసాని'తో అప్రమత్తం!
'అసాని' తుఫాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా అండమాన్ నికోబార్ దీవుల్లో మార్చి 22 వరకు పర్యాటక కార్యకలాపాలు నిలిపివేశారు. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఐఎండీ సూచించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశముంది. (క్లిక్: బ్లాక్ చెయిన్పై ఆసక్తి చూపిస్తున్న కింగ్ నాగార్జున?)