'వర్దా' అంటే ఎర్ర గులాబీ
'వర్దా' అంటే ఎర్ర గులాబీ
Published Mon, Dec 12 2016 5:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
న్యూఢిల్లీ: తమిళనాడులో బీభత్సం సష్టిస్తోన్న తుపానుకు 'వర్దా' అని పేరు పెట్టారు. పాకిస్తాన్ సూచించిన ఈ పేరుకు అరబిక్, ఉర్దూ భాషల్లో ఎర్ర గులాబీ అని అర్థం. హిందూ మహాసముద్రంలో అంతర్భాగమైన బంగాళాఖాతంలో పుట్టిన నాలుగవ భీకర తుపాను వర్దా. ఇంతకుముందు రొహాను, క్యాంత్, నాడ తుపానులు వచ్చి పోయాయి. ఈ తుపానులకు పేర్లు ఎవరు ఖరారు చేస్తారు, వాటిని ఎవరూ సూచిస్తారన్నది ఇక్కడ ప్రశ్న.
అట్లాంటిక్, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో తుపానులకు పేర్లు పెట్టే ఆచారం 1953 నుంచే అమల్లో ఉండగా, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో వచ్చే తుపానులకు పేర్లు పెట్టే ఆచారం 2004 నుంచి వచ్చింది. తుపానులకు పేర్లు పెట్టినట్లయితే ఆ తుపాను పేరిట ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవచ్చని, ఆ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని చరిత్రలో సులభంగా నమోదు చేయవచ్చనే ఉద్దేశంతో ఆ సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తుపానులకు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఏ తుపాను సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నామో సులభంగా విశ్లేషించడం ద్వారా ముందస్తు చర్యలకు వీలు పడుతుందని సదస్సులో పాల్గొన్న దేశాలు అభిప్రాయపడ్డాయి.
ఈ సదస్సులో పాల్గొన్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మొత్తం 64 తుపాను పేర్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతానికి ఆ జాబితా నుంచి ఎంపిక చేసిన పేర్లనే పెడుతున్నారు. గతంలో వచ్చిన నాడా తుపానుకు పేరును సూచించినది ఓమన్ దేశం కాగా ఇప్పుడు వర్దా అన్నది పాకిస్తాన్ సూచించిన పేరు. తుపాను వచ్చినప్పుడల్లా ఈ జాబితాలోని పేర్లను ఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం ఎంపిక చేస్తుంది.
సామాన్య ప్రజలు కూడా ఐఎండీ కార్యాలయంలోని మెటరాలోజీ డైరెక్టర్ జనరల్‌కు తుపాను పేర్లను సూచించవచ్చు. కాని వాటి ఎంపికకు కచ్చితమైన ప్రక్రియ ఉంటుంది. సూచించే పేర్లు ప్రత్యేకంగా ఓ దేశాన్నిగానీ, ప్రాంతాన్నిగానీ, సంస్కతినిగానీ సూచించే విధంగా ఉండరాదు. అవమానకరంగా, అభ్యంతరకరంగా ఉండకూడదు. వీలైనంత చిన్నదిగా ఉండడమే కాకుండా సులభంగా గుర్తుండే విధంగా కూడా ఉండాలి. అట్లాంటిక్, తూర్పు పసిఫిక్ దేశాలు తుపాను పేర్లను కొన్నేళ్ల తర్వాత రిపీట్ చేస్తారు. హిందూ మహాసముద్ర తుపానుల పేర్లు ఒక్కసారితోనే చరిత్రలో కలసిపోతాయి.
Advertisement
Advertisement