దిశ మార్చుకున్న 'వార్దా'
విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర పెను తుపాను వార్దా ఆదివారం దిశ మార్చుకుంది. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వార్దా అధిక ప్రభావం చెన్నైపై ఉండనుంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఆదివారం ఉదయం వరకూ కోస్తాంధ్ర వైపు దూసుకువచ్చిన తుపాను.. ఒక్కసారిగా చెన్నై దిశగా పయనించడం ఆరంభించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.
ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 490, చెన్నైకి తూర్పున 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం కారణంగా పుదుచ్చేరి, తమిళనాడు ఉత్తర సముద్రతీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.