Cyprus
-
ఆప్తమిత్రులకు గోల్డెన్ పాస్‌పోర్టా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ సహా 66 భారతీయులు సైప్రస్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ మంజూరు చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అమృత్‌కాల్‌లో ఆప్తమిత్రులైన ఆ సోదరులిద్దరూ దేశం విడిచి ఎందుకు వెళ్లారు? గోల్డెన్ పాస్‌పోర్టు అంటే ప్రజాధనాన్ని దోచుకుని, డొల్ల కంపెనీలు పెట్టుకుని, విదేశాల్లో జల్సా చేసేందుకు బంగారంలాంటి అవకాశం’అని బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ దీటుగా స్పందించింది. సైప్రస్ ఇన్వెస్టిమెంట్ ప్రోగ్రామ్ లేదా గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకాన్ని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేసింది. పన్ను ఎగవేతదారులకు లాభించేలా సైప్రస్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ విధానంపై నియంత్రణలు తీసుకువచ్చామని పేర్కొంది. -
Deltacron: మరో కొత్త వేరియంట్ డెల్టాక్రాన్!
కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే.. మరొకవైపు కొత్త వేరియంట్ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు. ఇందులో డెల్టా వేరియంట్ లక్షణాలు, ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ప్రస్తుతానికి డెల్టాక్రాన్‌గా పేరుపెట్టారు. ఇంకా శాస్త్రీయంగా పేరుపెట్టాల్సి ఉంది. అయితే కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పాలమని మరికొందరు అంటున్నారు. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలు, సాధారణ జనం నుంచి కొన్ని నమూనాలు సేకరించిన తర్వాత దీనిని కనుగొన్నారు. కాగా, దీని మ్యూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని ఈ వేరియంట్‌ను కనుగొన్న సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్ కోస్టిక్రిస్ తెలిపారు. -
రన్నరప్ తరుణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సైప్రస్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. నికోసియాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల తరుణ్ రెడ్డి 20–22, 21–9, 11–21తో నాలుగో సీడ్ దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో అన్‌సీడెడ్ తరుణ్ రెడ్డి 21–17, 21–10తో ఎనిమిదో సీడ్ ఒస్వాల్డ్ ఫంగ్ (ఇంగ్లండ్)పై, సెమీఫైనల్లో 21–14, 21–15తో రెండో సీడ్ జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై సంచలన విజయాలు సాధించాడు. -
'నా మాజీ భర్త చాలా ప్రమాదకరమైన వ్యక్తి'
ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన సీఫ్ ఎల్దిన్ ముస్తఫా చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతని మాజీ భార్య మరినా పరష్క్వో వెల్లడించింది. తన ప్రేమ కోసం సీఫ్ ఎల్దిన్ విమానాన్ని హైజాక్ చేసినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అతను డ్రగ్స్ తీసుకునేవాడని, కుటుంబానికి నరకం చూపించాడని, తనను, పిల్లలను కొట్టేవాడని చెప్పింది. తనతో మాట్లాడాలని ముస్తఫా ఎప్పుడూ అడగలేదని మరినా వెల్లడించింది. సైప్రస్ పోలీసులు ముస్తఫాను అరెస్ట్ చేశాక, అతని గొంతును గుర్తించాల్సిందిగా తనను అడిగారని చెప్పింది. ముస్తపా గతంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మద్దతుదారుడని, సిరియాలో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడని మరినా వెల్లడించింది. ముస్తఫా బూటకపు పేలుడు పదార్థాలతో ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసి సైప్రస్‌కు తరలించిన సంగతి తెలిసిందే. బందీలు విడుదల అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో ఈ హైజాక్ డ్రామా సుఖాంతమైంది. -
నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆయనను కలువను!!
'ఈ అనవసరమైన పబ్లిసిటీతో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయనను చూసేది లేదు'.. ఈజిప్టు హైజాకర్ భార్య తేల్చిచెప్పిన విషయమిది. ఆమె భర్త సీఫ్ ఎల్దిన్ ముస్తఫా బూటకపు పేలుడు పదార్థాలతో ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. తాను ఆత్మాహుతి జాకెట్ ధరించానని బెదిరించి.. కైరో వెళ్లాల్సిన విమానాన్ని సైప్రస్ దీవిలోని లార్నాకాకు తరలించాడు. తనను వదిలేసిన భార్యా పిల్లల్ని చూడటానికి ఆ ప్రబుద్ధుడు ఇంతటి ఘనకార్యానికి ఒడిగట్టగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న అతన్ని కలిసేది లేదని, అతడు చేసిన పని తనను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె స్పష్టం చేసింది. విమానాన్ని హైజాక్ చేసి ప్రయాణికులను కొన్ని గంటలపాటు వణికించిన సీఫ్ ఎల్దిన్ గురించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతడు జైలు నుంచి పరారైన ఖైదీ అని, అతని పాస్‌పోర్టును అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిసింది. 2011లో అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌పై ప్రజా తిరుగుబాటు సందర్భంగా జైలు నుంచి అతడు పరారయ్యాడు. సీఫ్ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఐదో బిడ్డ కూడా పుట్టినప్పటికీ చిన్నవయస్సులోనే ఆమె కారు ప్రమాదంలో చనిపోయింది. '24 ఏళ్లుగా నా భార్యా పిల్లలను చూడలేదు. ఈజిప్టు ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు' అంటూ సీఫ్ తన హైజాక్ దుండగాన్ని సమర్థించుకున్నాడు. అతడు అరెస్టయిన తర్వాత రెండు వేళ్లతో విజయసంకేతాన్ని చూపించడం గమనార్హం. ఈజిప్టు అధికారులు మాత్రం అతడో మూర్ఖుడు, అతడి మానసిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. బుధవారం లార్నాకా కోర్టు ముందు హాజరైన సీఫ్ నోరు విప్పలేదు. 58 ఏళ్ల అతనిపై హైజాకింగ్, ప్రజలను కిడ్నాప్ చేసినట్టు అభియోగాలు నమోదుచేసే అవకాశముంది.