'నా మాజీ భర్త చాలా ప్రమాదకరమైన వ్యక్తి'
ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన సీఫ్ ఎల్దిన్ ముస్తఫా చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతని మాజీ భార్య మరినా పరష్క్వో వెల్లడించింది. తన ప్రేమ కోసం సీఫ్ ఎల్దిన్ విమానాన్ని హైజాక్ చేసినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అతను డ్రగ్స్ తీసుకునేవాడని, కుటుంబానికి నరకం చూపించాడని, తనను, పిల్లలను కొట్టేవాడని చెప్పింది. తనతో మాట్లాడాలని ముస్తఫా ఎప్పుడూ అడగలేదని మరినా వెల్లడించింది.
సైప్రస్ పోలీసులు ముస్తఫాను అరెస్ట్ చేశాక, అతని గొంతును గుర్తించాల్సిందిగా తనను అడిగారని చెప్పింది. ముస్తపా గతంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మద్దతుదారుడని, సిరియాలో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడని మరినా వెల్లడించింది. ముస్తఫా బూటకపు పేలుడు పదార్థాలతో ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసి సైప్రస్‌కు తరలించిన సంగతి తెలిసిందే. బందీలు విడుదల అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో ఈ హైజాక్ డ్రామా సుఖాంతమైంది.