నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆయనను కలువను!!
'ఈ అనవసరమైన పబ్లిసిటీతో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయనను చూసేది లేదు'.. ఈజిప్టు హైజాకర్ భార్య తేల్చిచెప్పిన విషయమిది. ఆమె భర్త సీఫ్ ఎల్దిన్ ముస్తఫా బూటకపు పేలుడు పదార్థాలతో ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. తాను ఆత్మాహుతి జాకెట్ ధరించానని బెదిరించి.. కైరో వెళ్లాల్సిన విమానాన్ని సైప్రస్ దీవిలోని లార్నాకాకు తరలించాడు. తనను వదిలేసిన భార్యా పిల్లల్ని చూడటానికి ఆ ప్రబుద్ధుడు ఇంతటి ఘనకార్యానికి ఒడిగట్టగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న అతన్ని కలిసేది లేదని, అతడు చేసిన పని తనను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె స్పష్టం చేసింది.
విమానాన్ని హైజాక్ చేసి ప్రయాణికులను కొన్ని గంటలపాటు వణికించిన సీఫ్ ఎల్దిన్ గురించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతడు జైలు నుంచి పరారైన ఖైదీ అని, అతని పాస్‌పోర్టును అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిసింది. 2011లో అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌పై ప్రజా తిరుగుబాటు సందర్భంగా జైలు నుంచి అతడు పరారయ్యాడు. సీఫ్ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఐదో బిడ్డ కూడా పుట్టినప్పటికీ చిన్నవయస్సులోనే ఆమె కారు ప్రమాదంలో చనిపోయింది.
'24 ఏళ్లుగా నా భార్యా పిల్లలను చూడలేదు. ఈజిప్టు ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు' అంటూ సీఫ్ తన హైజాక్ దుండగాన్ని సమర్థించుకున్నాడు. అతడు అరెస్టయిన తర్వాత రెండు వేళ్లతో విజయసంకేతాన్ని చూపించడం గమనార్హం. ఈజిప్టు అధికారులు మాత్రం అతడో మూర్ఖుడు, అతడి మానసిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. బుధవారం లార్నాకా కోర్టు ముందు హాజరైన సీఫ్ నోరు విప్పలేదు. 58 ఏళ్ల అతనిపై హైజాకింగ్, ప్రజలను కిడ్నాప్ చేసినట్టు అభియోగాలు నమోదుచేసే అవకాశముంది.