ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కులేదు
► స్మార్ట్ సిటీలో వరంగల్‌ను చేర్పించాం
► డీపీఆర్‌లో లోపాలతో ఎంపిక కాలేదు
► అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే మాపై నిందలు
► బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు
హన్మకొండ : డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీఆర్పీ) తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. సోమవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని నెక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ఎంపిక చేయలేదని, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖానించే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలన్నారు. స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడానికి తయారు చేయాల్సిన నివేదికను ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు సక్రమం గా తయారు చేయకపోవడంతోనే రావాల్సిన పాయింట్లు రాక స్మార్ట్ సిటీలో ఎంపిక కాలేదన్నారు. ఇదీ తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ మం త్రులు, నాయకులు బీజేపీపై నిందలు వేస్తుం దని ధ్వజమెత్తారు. జిల్లాలో బీజేపీ నుంచి ప్రజాప్రతినిధి లేకున్నా జిల్లా నాయకులం ఢిల్లీకి వెళ్లి వరంగల్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో పెట్టించామన్నారు. దీంతో పాటు హెరిటేజీ సిటీ, అమృత్ పథకాలు, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు మంజూరు చేయించామన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటిని తమ గొప్పగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని దుయ్యబట్టారు. ఆహార భద్రతా పథకం, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేయిస్తే తామే నిర్మిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు వరంగల్ ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఆస్తి, నల్లా, విద్యుత్ పన్నులు మాఫీ చేసి, వరంగల్‌లో మాత్రం మాఫీ చేయలేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు వన్నాల శ్రీరాములు, కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, ఓంటేరు జయపాల్, రావు అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.