మరోఎయిర్‌పోర్టు ఎందుకు?
యనమల వ్యాఖ్యలను ఖండించిన ఏటీఐ అధ్యక్షుడు వరదారెడ్డి
మరో అంతర్జాతీయ విమానాశ్రయం జరిగేపనికాదు
కార్గో టెర్మినల్‌ను కార్గో హబ్‌గా మార్చాలని డిమాండ్
గోపాలపట్నం : విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండ గా కాకినాడ-విశాఖ మధ్యలో మరో అంతర్జాతీయ విమానాశ్రయమేంటని విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి ప్రశ్నించారు. కాకినాడ-విశాఖ మధ్య మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ‘న్యూస్‌లైన్’తో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా చేయడానికి రూ. 315 కోట్ల నిధులు వెచ్చించగా, నేవీ 100 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. నేవీకి, పౌర విమానాయానశాఖకు సఖ్యత ఉన్నం దున మరో విమానాశ్రయం ప్రతిపాదన సరికాదన్నారు. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలంటే నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రూ.1,500 కోట్ల నుంచి, రూ. 5 వేల కోట్ల నిధులు అవసరమని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించిన విమానాశ్రయానికి శ్రీకాకుళం, బరంపురం, రాయగడ, కోరాపుట్ తదితర ప్రాంతాల వారు చేరుకోవాలంటే అదనంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు.
ఇపుడున్న విశాఖ విమానాశ్రయానికి నేవీ నుంచి 24 గంటల అనుమతులు వచ్చాయని, ఇంకా అభివృద్ధి చేయాలంటే అరైవల్, డిపాచర్ మార్గాలను పెంచాలని సూచించారు. అలాగే ఇక్కడి పాత టెర్మినల్ భవనాన్ని కార్గో అవసరాలకు వినియోగిస్తున్న తరుణంలో దీన్ని కార్గోహబ్‌గా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో తయారయ్యే ఔషధ ఉత్పత్తులు, మత్స్య సంపద ఇక్కడి నుంచే ఎగుమతులు జరపాలన్నారు. ప్రయాణికులను ఇబ్బం దులు పాల్జేసే ఆలోచనలకు దిగితే వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.