Dalam
-
నా మనసు దూదిపింజెలా తేలిపోయింది
నవీన్‌చంద్ర, పియాబాజ్‌పాయ్ నాయకా నాయికలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశానని పియా చెబుతూ -‘‘ఇందులో శ్రుతి పాత్ర కోసం కట్టూబొట్టూ మార్చా. చుడీదార్సూ, లంగా, ఓణీ, నుదుట విభూతితో సంప్రదాయంగా కనిపిస్తాను. ఆ లుక్‌కి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను. కానీ థియేటర్లో వారి స్పందన చూసిన తర్వాత నా మనసు దూది పింజెలా తేలిపోయింది. ‘దళం’ ఓ మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘రంగం’ తర్వాత అలాంటి పాత్రలు చాలా వచ్చాయని, చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండాలనే తపన లేదు కాబట్టి, వాటిని తిరస్కరించానని పియా తెలిపారు. డిఫరెంట్ కేరక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నానని, హిందీలో అలాంటి ఓ పాత్ర దొరకడంతో ఒప్పుకున్నానని ఆమె చెప్పారు. ఇంకా తెలుగు, తమిళ భాషల్లో చేయబోయే సినిమాల గురించి త్వరలో ప్రకటిస్తానన్నారు. -
వాస్తవికతను అద్దంపట్టే కథలంటే ఇష్టం
‘‘అడవుల నుంచి మొదలైన చరిత్ర మళ్లీ ఆటవిక దిశగానే ప్రయాణిస్తోంది. తుపాకుల్ని పక్కన పెట్టి జనారణ్యంలోకి అడుగుపెట్టినా... ఆత్మనీ, అస్థిత్వాన్నీ కాపాడేది ఇక్కడా తుపాకులే. ఎటు చూసినా అరణ్యమే... స్థితీగతీ అగమ్యమే’’... ‘దళం’ కథ ఇదే. తొలి సినిమాతోనే ఇంత శక్తిమంతమైన కథను తీసుకొని దర్శకుడు జీవన్‌రెడ్డి పెద్ద సాహసమే చేశారు. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌పాయ్ ప్రధాన పాత్రధారులుగా మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జీవన్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘‘కొందరు మాజీ నక్సలైట్ల కథే ఈ చిత్రం. రాజకీయ కుతంత్రాల మధ్య నలిగి... ఉక్కిరిబిక్కిరైన ఆ ఉద్యమకారులు... చివరకు తీసుకున్న నిర్ణయమేంటి? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. అందుకని ఇది పూర్తిగా సీరియస్ వేలో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇందులో కామెడీ ఉంటుంది. ఓ చిన్న ప్రేమకథ కూడా ఉంటుంది. ‘అందాలరాక్షసి’ ఫేం నవీన్‌చంద్ర ఇందులో మాజీ నక్సలైట్‌గా నటించాడు. ఆ పాత్రకు తను ప్రాణం పోశాడనాలి. అలాగే ధన్‌రాజ్ కూడా మాజీ నక్సల్‌గా కనిపిస్తాడు. అంతులేని ఉద్వేగం ఉన్న కథాంశమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’’ అని చెప్పారు జీవన్‌రెడ్డి. ఇంకా చెబుతూ- ‘‘చిన్నప్పట్నుంచీ పుస్తకాల పురుగుని. సాహిత్యం విపరీతంగా చదివాను. శ్రీశ్రీ సాహిత్యం నాకు ప్రాణం. ఓ విధంగా నా తొలి సినిమాకు ఇలాంటి నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణం అదే అయ్యుండచ్చు’’ అని చెప్పారు. ఇక నుంచి కూడా మీ నుంచి ఇలాంటి కథలే వస్తాయా? అనడిగితే- ‘‘అన్ని రకాల కథల్నీ హ్యాండిల్ చేయాలని ఉంది. అయితే నాకు వాస్తవికతను అద్దం పట్టే కథలంటే ఇష్టం. ఏం చేసినా అభిరుచిని మాత్రం చంపుకొని సినిమాలు చేయను. నా సినిమాకు వచ్చే ప్రేక్షకులకు రెండు మంచి మాటలు చెప్పాలనేది నా అభిమతం’’ అన్నారు. -
ఆలోచింపజేసే ‘దళం’
నక్సలిజం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘దళం’. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌బాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవన్‌రెడ్డి దర్శకుడు. మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 15న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇష్టంతో తీసిన సినిమా ఇది. పేక్షకులను ఆనందింపజేయడమే కాక, ఆలోచింపజేసే విధంగా దర్శకుడు జీవన్ ఈ చిత్రాన్ని మిలిచాడు. వర్మ స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడు జీవన్. ఆ మార్కు సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘అందాల రాక్షసి’ తర్వాత నవీన్‌చంద్రకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. టైటిల్‌కి, పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ‘‘యువతరం మెచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఫ్రేమూ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాను ప్రేమించే వ్యక్తి నిర్మాత సుమంత్. ఖర్చుకు వెనకాకుండా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఉత్తమ సాంకేతిక విలువలు పాటించాం. ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ పాత్రలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి’’ అని తెలిపారు. టైటిల్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన సినిమా ఇదని నవీన్‌చంద్ర చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.శ్రీకృష్ణ, లైన్ నిర్మాత: ప్రవీణ్‌రెడ్డి.