వాస్తవికతను అద్దంపట్టే కథలంటే ఇష్టం
వాస్తవికతను అద్దంపట్టే కథలంటే ఇష్టం - ‘దళం’ జీవన్‌రెడ్డి
Published Mon, Aug 12 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
‘‘అడవుల నుంచి మొదలైన చరిత్ర మళ్లీ ఆటవిక దిశగానే ప్రయాణిస్తోంది. తుపాకుల్ని పక్కన పెట్టి జనారణ్యంలోకి అడుగుపెట్టినా... ఆత్మనీ, అస్థిత్వాన్నీ కాపాడేది ఇక్కడా తుపాకులే. ఎటు చూసినా అరణ్యమే... స్థితీగతీ అగమ్యమే’’... ‘దళం’ కథ ఇదే. తొలి సినిమాతోనే ఇంత శక్తిమంతమైన కథను తీసుకొని దర్శకుడు జీవన్‌రెడ్డి పెద్ద సాహసమే చేశారు. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌పాయ్ ప్రధాన పాత్రధారులుగా మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జీవన్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘‘కొందరు మాజీ నక్సలైట్ల కథే ఈ చిత్రం.
రాజకీయ కుతంత్రాల మధ్య నలిగి... ఉక్కిరిబిక్కిరైన ఆ ఉద్యమకారులు... చివరకు తీసుకున్న నిర్ణయమేంటి? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. అందుకని ఇది పూర్తిగా సీరియస్ వేలో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇందులో కామెడీ ఉంటుంది. ఓ చిన్న ప్రేమకథ కూడా ఉంటుంది. ‘అందాలరాక్షసి’ ఫేం నవీన్‌చంద్ర ఇందులో మాజీ నక్సలైట్‌గా నటించాడు. ఆ పాత్రకు తను ప్రాణం పోశాడనాలి. అలాగే ధన్‌రాజ్ కూడా మాజీ నక్సల్‌గా కనిపిస్తాడు. అంతులేని ఉద్వేగం ఉన్న కథాంశమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’’ అని చెప్పారు జీవన్‌రెడ్డి.
ఇంకా చెబుతూ- ‘‘చిన్నప్పట్నుంచీ పుస్తకాల పురుగుని. సాహిత్యం విపరీతంగా చదివాను. శ్రీశ్రీ సాహిత్యం నాకు ప్రాణం. ఓ విధంగా నా తొలి సినిమాకు ఇలాంటి నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణం అదే అయ్యుండచ్చు’’ అని చెప్పారు. ఇక నుంచి కూడా మీ నుంచి ఇలాంటి కథలే వస్తాయా? అనడిగితే- ‘‘అన్ని రకాల కథల్నీ హ్యాండిల్ చేయాలని ఉంది. అయితే నాకు వాస్తవికతను అద్దం పట్టే కథలంటే ఇష్టం. ఏం చేసినా అభిరుచిని మాత్రం చంపుకొని సినిమాలు చేయను. నా సినిమాకు వచ్చే ప్రేక్షకులకు రెండు మంచి మాటలు చెప్పాలనేది నా అభిమతం’’ అన్నారు.
Advertisement
Advertisement