Ardha Shathabdham Movie Review, Rating In Telugu | Sai Kumar | Karthik Ratnam | Naveen Chandra - Sakshi
Sakshi News home page

Ardha Shathabdham: ‘అర్థ శతాబ్దం’మూవీ రివ్యూ

Published Fri, Jun 11 2021 11:20 AM | Last Updated on Sat, Jun 12 2021 12:08 PM

Ardha Shathabdham Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : అర్థ శతాబ్దం
నటీనటులు : కార్తీక్ ర‌త్నం, కృష్ణ ప్రియ‌, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ఆమని తదితరులు
నిర్మాణ సంస్థ : రిషితా శ్రీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ, 24 ఫ్రేమ్స్‌ సెల్యూలాయిడ్‌
నిర్మాతలు:  చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
దర్శకత్వం : రవీంద్ర పుల్లె
సంగీతం : నోఫెల్ రాజా
సినిమాటోగ్రఫీ : అస్కర్‌, వెంకట్‌, ఈజే వేణు
ఎడిటింగ్ : జె.ప్రతాప్‌ కుమార్‌
విడుదల తేది : జూన్‌ 11, 2021(ఆహా)

సీరియస్‌ కథాంశాలతో తెరకెక్కె చిత్రాలు ఇటీవల టాలీవుడ్‌లో ఎక్కువయ్యాయి. నూతన దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘అర్థ శతాబ్దం​’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌  సినిమాపై ఆసక్తి పెంచింది. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ  కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఓటీటీ బాటపట్టింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(జూన్‌ 11)ప్రముఖ ఓటీటీ ఆహా విడుదలైన ‘అర్థ శతాబ్దం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 

కథ
సిరిసిల‍్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్‌ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌ రామన్న(సాయికుమార్‌) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెతో పంచుకోలేకపోతాడు. అతని వయసుతో పాటు పుష్పపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో  గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి?  దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ.

నటీనటులు
‘కేరాఫ్‌ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్‌ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్‌ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సటైట్‌ రామన్నగా సాయికుమార్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే  ఎస్సై రంజిత్‌గా  నవీన్‌ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 


విశ్లేషణ
విప్ల‌వం, కులాల మధ్య గొడవలు, వర్గ పోరు, శ్రమదోపిడి లాంటి నేపథ్యంతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి ప్రేమ, కమర్షియల్‌ హంగులు జోడించి విజయం అందుకున్న చిత్రాలు చాలానే ఉనాయి. అయితే ఇలాంటి కథలను డీల్‌ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొంచెం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది. ఏ విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా స‌న్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని త‌ట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్‌ అవుతుంది. ఈ విషయంలో అర్ధశతాబ్దం దర్శకుడు రవీంద్ర పుల్లె కాస్త తడబడ్డాడు. కుల వ్య‌వ‌స్థ‌, వ‌ర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బ‌ల‌మైన విష‌యాల్నే ఎంచుకొని, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మనిషి పుట్టుక మొదలు.. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు చాలా విషయాలకు తెరపై చూపించాలనుకొని, దేనికి పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది.

ఫస్టాఫ్‌ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. పుష్పపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కృష్ణ పడే ఆరాటం, రోటీన్‌ సన్నివేశాలతో నెమ్మదిగా సా..గుతోంది. ఇక సెకండాఫ్‌లో అయినా  క‌థ సీరియ‌స్ ట‌ర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవ‌రు ఎవ‌రిని చంపుతున్నారో ఎవ‌రికీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఇంత జరుగుతున్నా.. మంత్రి(శుభలేఖ సుధాకర్‌), డీఎస్పీ(అజయ్‌) ఇద్దరు టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకోవడం అంత కన్విసింగ్‌గా అనిపించదు. సినిమా మూలాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముంగించారు. సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, నవీన్‌ చంద్ర అజయ్‌, ఆమని, పవిత్ర వంటి అగ్ర నటులు ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయాడు.

ఇక సహజత్వం కోసం అసభ్య పదజాలాన్ని యదేచ్ఛగా వాడేశారు. ర‌క్త‌పాతం, హింస మ‌రీ ఎక్కువైంది. క్లైమాక్స్ లో..‘గ‌తించిన క్ష‌ణాల‌న్నీ, గ్రంధాలుగా లిఖించ‌బ‌డిన‌రోజున‌…క‌ల‌వ‌ని అడుగుల‌న్నీ క‌ల‌యిక‌గా క‌ల‌బ‌డే రోజు.. గెలువని ప్రేమలు అన్ని స్మృతులుగా పిలవబడే రోజున.. రాయ‌ని అక్ష‌రాల‌ని రాజ్యాంగంగా రాయ‌బ‌డిన రోజున‌.. మనిషిలో జనించిన ప్రేమ, మనిషిని జయించిన కులాన్ని చిల్చిన రోజున పుడతాను పువ్వునై మరలా ఈ పుడమిలోనే’అనే  భారీ ఎమోషనల్‌ డైలాగ్‌ సగం అర్థమై, అర్థం కానట్లుగానే ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం బాగుంది. ‘ఏ కన్నులు చూడని’పాట సినిమాకి హైలెట్‌ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్‌, వెంకట్‌, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్‌ కుమార్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
కార్తీక్ ర‌త్నం, కృష్ణ ప్రియ‌ నటన
దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌
నేపథ్య సంగీతం, పాటలు

మైనస్‌ పాయింట్స్‌
ఫస్టాప్‌
అగ్రనటీనటులను సరిగా ఉపయోగించుకోలేకపోవడం
మోతాదు మించిన ర‌క్త‌పాతం, హింస
బలమైన సన్నీవేశాలు లేకపోవడం
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement