
24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్, రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులుండేవి. ఒకానొక రాక్షస ఘడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది’ అని శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మధ్యలో ఓ ప్రేమ కథ, ఓ గ్రామంలోని ఇరు వర్గాల ఘర్షణలతో ఆసక్తి పెంచుతోంది.
తెలంగాణలో కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఒక్క పువ్వు కోసం కొట్టుకు చస్తున్నారంటే నీకెందుకయ్యా అంత ఆశ్చర్యం, ‘ఈ 50 ఏళ్ల స్వాతంత్ర్యం దేని కోసమో, ఎవరి కోసమో ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాలేదు’అని శుభలేక సుధాకర్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేశ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.