నవ్వుల పువ్వుల దారిలో...
ఫ్యాషన్ బ్లాగర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది దిల్లీకి చెందిన డాలీసింగ్. రైటర్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయపథంలో దూసుకుపోతోంది. ‘మనలో ఉన్న శక్తి ఏమిటో మనం చేసే పనే చెబుతుంది’ అంటున్న 29 సంవత్సరాల డాలీసింగ్కు పనే బలం. ఆ బలమే తన విజయ రహస్యం...
డాలీసింగ్ మాట్లాడితే చుట్టుపక్కల నవ్వుల పువ్వులు పూయాల్సిందే! ఆమె ఏం మాట్లాడినా సూటిగా ఉంటుంది. అదే సమయంలో ఫన్నీగా ఉంటుంది. ‘స్పిల్ ది సాస్’ అనే ఫ్యాషన్ బ్లాగ్‌తో ప్రయాణం మొదలు పెట్టింది. లైఫ్‌స్టైల్ పోర్టల్ ‘ఐ–దివ’ కోసం జూనియర్ రైటర్, స్టైలిస్ట్‌గా పనిచేసింది.
‘రాజు కీ మమ్మీ’ ఫన్నీ వీడియోలతో కంటెంట్ క్రియేషన్‌లోకి అడుగుపెట్టింది. ఈ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. రోజువారి జీవితం నుంచే తన ఫన్నీ వీడియోలకు కావాల్సిన స్టఫ్‌ను ఎంపిక చేసుకునేది.
‘బయట ఏదైన ఆసక్తికరమైన దృశ్యం కంటపడితే నోట్ చేసుకునేదాన్ని. ఆ తరువాత డెవలప్ చేసేదాన్ని. మనలోని శక్తి ఏమిటో మన రచనల్లో తెలిసిపోతుంది. రచన చేయడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త క్యారెక్టర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తాను. ఐ–దివలో పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం అంటూ ఉండేది కాదు. ఒక టాపిక్ అనుకొని కెమెరా ముందుకు వచ్చి తోచినట్లుగా మాట్లాడడమే.
ఆ తరువాత మాత్రం స్క్రిప్ట్ రాయడం మొదలైంది’ అంటుంది డాలీ సింగ్. కామెడీ అయినా సరే, ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాల్పనిక హాస్యం కంటే నిజజీవిత సంఘటనల నుంచి తీసుకున్న కామెడీనే ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచ్‌లైన్స్ విషయంలో రకరకాలుగా ఎక్సర్సైజ్లు చేస్తుంటుంది డాలీ.
‘ప్రేక్షకులను మెప్పించడం అనేది ఫన్ అండ్ చాలెంజింగ్‌గా ఉంటుంది. రెండు మూడు నెలలకు ఒకసారి రీస్టార్ట్ కావాల్సిందే. కంటెంట్ క్రియేషన్‌లో అతి ముఖ్యమైనది ఎప్పుటికప్పుడు మనల్ని మనం పునరావిష్కరించుకోవడం’ అంటుంది డాలీ.
తాము క్రియేట్ చేయాలనుకునేదానికీ, ప్రేక్షకులు ఇష్టపడుతున్న కంటెంట్‌కూ మధ్య కంటెంట్ క్రియేటర్ సమన్వయం సాధించాల్సి ఉంటుంది. మరి డాలీ సంగతి?
‘అనేకసార్లు నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో... నేను క్రియేట్ చేసేది ప్రేక్షకులకు నచ్చేది కాదు. వారికి నచ్చేది నాకు నచ్చేది కాదు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది డాలీ.
కంటెంట్ క్రియేటర్లకు ఒత్తిడి అనేది సర్వసాధారణం. ‘ఒత్తిడిని పనిలో భాగంగానే భావించాను. దానినుంచి దూరం జరగడం అనేది కుదిరే పని కాదు. అయితే ఒత్తిడి ప్రభావం కంటెంట్‌పై పడకుండా జాగ్రత్త పడాలి’ అంటుంది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన డాలీ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్‌సీరిస్ ‘మోడ్రన్ లవ్ ముంబై’తో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది.
‘నేను విజయం సాధించాను అనుకోవడం కంటే, ఇప్పుడే బయలుదేరాను అనుకుంటాను. అప్పుడే ఫ్రెష్‌గా ఆలోచించడానికి, మరిన్ని విజయాలు సాధించడానికి వీలవుతుంది’ అంటున్న డాలీసింగ్ ఒక షార్ట్‌ఫిల్మ్ కోసం స్క్రిప్ట్రెడీ చేసుకుంటోంది. అందులో తానే నటించనుంది.