Dalit community
-
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
మేము గుర్తుకు రాలేదా.. బాబు?
ఇటీవల చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎస్సీలను విస్మరించారని ఆరోపిస్తున్నారు. వారిపై పనిగట్టుకుని దాడులు చేస్తున్నారని నోరుపారేసుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం వారిని అణగదొక్కడానికే ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా ఆ సామాజిక వర్గాన్ని దూరంగా నెట్టేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇది తేటతెల్లమయ్యింది. రిజర్వు స్థానాలు ఉన్నా ఏ ఒక్క చోటా అధ్యక్షులుగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించలేదు. దీనిపై ఆ సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారు. ఆయన కుటిల నీతికి, స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. సాక్షి, తిరుపతి : జిల్లాలో సుమారు 45 లక్షల జనాభా ఉంటే.. 25 లక్షలకుపైగా ఎస్సీలు ఉన్నారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండింటిని, 14 అసెంబ్లీ స్థానాల్లో మూడు నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వు చేశారు. చంద్రబాబు ఆదివారం మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. కానీ ఏ ఒక్క స్థానానికి ఎస్సీలకు కేటాయించలేదు. జిల్లా అధ్యక్ష పదవులపై ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఎస్సీ సామాజికవర్గం పట్ల ఆయన వివక్ష చూపారంటూ పలువురు లోలోపలే కుమిలిపోతున్నారు. దివంగత మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ కుటుంబం టీడీపీనే శ్వాసగా.. చంద్రబాబే ధ్యాసగా పెట్టుకుంది. (కులాల మధ్య చంద్రబాబు చిచ్చు) ఆ కుటుంబంలోని వారికి ఈ సారి అధ్యక్ష పదవి లభిస్తుందని ఆశించారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ జేడీ రాజశేఖర్ టీడీపీ జెండా మోస్తున్న వ్యక్తి. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచి, టీడీపీ కండువా కప్పుకున్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్, సీనియర్ నాయకులు పరసారత్నం, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారితో పాటు పలువురు ఎస్సీ సామాజికవర్గ నాయకులు ఉన్నారు. వీరిలో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించారు. అయితే చంద్రబాబు ఆ సామాజికవర్గం వారిని పూర్తిగా పక్కనపెట్టారు. బీసీలు టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉండడంతో తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష పదవిని నరసింహయాదవ్‌కు కట్టబెట్టారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. చర్చించకుండానే.. పార్లమెంట్ జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపుపై టీడీపీ శ్రేణులతో చర్చించిన దాఖలాలు లేవని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమైన నాయకులను కూడా సంప్రదించలేదని తెలిసింది. 2019 ఎన్నికల్లో కూడా కొన్ని స్థానాలకు ఇదే తరహాలో అభ్యర్థులను ప్రకటించడంపై పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు టికెట్లు ఆశించి భంగపడిన నాయకులు చెబుతున్నారు.తంలో పార్టీ పదవులు ప్రకటించే ముందు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసేవారని, ఆ సమావేశాల్లో పలువురు నాయకులతో చర్చించేవారని గుర్తుచేస్తున్నారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్ష పదవిని పులివర్తి నానికి ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. మదనపల్లె, తిరుపతి అధ్యక్ష పదవులపై ఆశలు పెట్టుకున్న వారు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. తమకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా.. మాట మాత్రానికైనా చెప్పి పదవులు ఇచ్చి ఉంటే బాగుండేందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాలే అజెండాగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
పసిరిక క్రీనీడల్లో పంచమవేదం
మూడుసార్లు ముఖ్యమంత్రిగా పాలించి దళిత సామాజిక వర్గంలో కొంచెం కూడా నమ్మకాన్ని నింపలేకపోయిన పాలకుడు నారా చంద్రబాబు. ఆయనే నేడు ఆ సామాజిక వర్గం మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయని యుద్ధప్రాతిపదికన శంఖారావం పూరించడం విడ్డూరం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం మీద నిందలు వేయడం హాస్యాస్పదం. తెలుగుదేశం పాలనలో దళితులు ఎదుర్కొన్న అవమానాల చరిత్రను ఎవరూ మరిచిపోలేదు. 1985 జూలై 17న జరిగిన కారంచేడు నరమేధం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే చోటుచేసుకుంది. ఆ గాయాలు మానకముందే 1986 జూలై 16న మంగళగిరి పట్టణానికి సమీపంలోగల నీరుకొండలో దళితులను వేటాడారు. ఒక దళిత వృద్ధుడ్ని తన ఇంట్లోనే హత్యచేసి, 30 మందిని పొలాల్లో క్షతగాత్రుల్ని చేశారు. జనవరి 17, 1990న ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో భూపంపిణీకి సంబంధించిన విషయమై అప్పటి తెలుగుదేశం నాయకులే దళితుల మీద బాంబులతో దాడి చేయించారనే అభియోగాల్ని ఎదుర్కొన్నారు. సుమారు ఏడువందల దళిత కుటుంబాలు పొరుగు ఊర్లకు పారి పోయి తలదాచుకోవలసి వచ్చింది. 1998 జూలై 16న కర్నూలు జిల్లా వేంపెంటలో దళితులపై దాడి జరిగింది. ఇది ఆధిపత్య కులాలు, అణగారిన కులాల మధ్య చోటుచేసుకున్న ఘటన అయినా నక్సలైటు గ్రూపుల మధ్య దాడిగా ప్రచారం చేయించారు. బాధితులు న్యాయంకోసం హైదరాబాద్ వెళ్ళి అప్పటి సీఎం బాబును కలిశారు. ‘నక్సలైటు శక్తులతో సంబంధంలేని దళితులుగా రండి, బయటకు పొండి’ అని ఆగ్రహంతో అవమానపరచి వారిని బయటకు పంపిం చారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో 2003 సెప్టెంబర్‌లో దళితులపై దాడులు జరిగాయి. దళితులు తమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లే సమయంలో చోటుచేసుకున్న ఘటన ఇది. దళితులకు రక్షణ కల్పిం చడంలో బాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తదనంతరకాలంలో ‘ఎస్సీ వర్గీకరణ’ను తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు. అన్యాయానికి గురవుతున్న ఉపకులాలేవైనావుంటే వారికి న్యాయం జరగవలసిన అవసరం వుంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని తన రాజకీయ మనుగడకు వాడుకున్నది మాత్రం పచ్చనాయకుడే. ఇక ఇంగ్లిష్ మీడియం విషయంలో పరోక్షంగా బురదజల్లే ప్రయత్నం చేశారు. ఉన్నతవిద్యను గ్రామాలకు, పేదలకు చేరువ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. సీనియర్ దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్ని కూడా ఆయన దుర్భాషలాడారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా ఒక దళిత కులానికి చెందిన ఐఏఎస్ అధికారిని అవమానపరచిన సందర్భం లేదు. 2017 జూలైలో పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన ఘటనపట్ల అప్పటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిం చింది. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హుటాహుటిన జగన్మోహన్రెడ్డి పర్యటించారు. బాధితుల కష్టాలు విన్న తర్వాత ప్రతి కుటుంబానికి లక్ష నష్టపరిహారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవకాశవాద రాజకీయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమని గడిచిన ఎన్నికల్లోనూ కూడా ఆయన నిరూపించారు. టికెట్ల ఎంపికలోనూ, నియామకాల్లోనూ సమతుల్యతను పాటించి పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ కులాలైతే రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యాయో వారికి ప్రాధాన్యతనివ్వడంలో జగన్మోహన్రెడ్డి సమన్యాయాన్ని పాటించారు. అందుకే ఆయన 2019 ఎన్నికలప్పుడు ఇడుపులపాయలో సీట్లు ప్రకటించే సమయంలో ప్రస్తుత బాపట్ల లోక్‌సభ సభ్యుడు నందిగాం సురేష్‌ను తన సరసన కూర్చోబెట్టుకొని అతనితో ఇరవై ఐదు మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను వెల్లడింపజేశారు. ఇక్కడే ఆయన తన రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం నందిగాం సురేష్ ‘నేను కూలికెళ్ళిన ప్రాంతానికి నన్ను ఎంపీని చేశారు’ అని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. నాయకుడిని నిండా నమ్మిన కార్యకర్తకు జాతీయస్థాయిలో సముచితస్థానం కల్పించిన అధినాయకులు అరుదు. ఇలాంటి చరిత్రను కూడా చిన్నవయస్సులోనే జగన్ మోహన్‌రెడ్డి నమోదు చేసుకోగలిగారు. వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్ విభాగం, ఏయూ, విశాఖపట్నం ‘ మొబైల్ : 93931 11740 -
‘మలిన’ చరితకు ముగింపు
పసిబిడ్డలు మట్టితో ఆడుకుంటున్నట్టు నా మనుషులు మలంతో ఆడుతున్నారు. మలంతోనే పాడుతున్నారు. అదే మలినంలో తింటూ, దానిపక్కనే పడుకొంటూ 4000 సంవ త్సరాల నుంచీ కులం అనే మలాన్ని నెత్తిన మోస్తున్నారు నా జాతి స్త్రీలు. స్వచ్ఛతకీ, కులానికీ మధ్యనున్న అతి సున్నితమైన అంశం నా జాతి జనుల ప్రాణాలు. వేలయేళ్ల మానవ మలాల్లోంచి బయట పడలేకా, అందులో పడి చావలేకా లక్షలాది మంది దళితులు గిజగిజలాడుతున్నారు. ఏదీ దొరక్క ఈ పనిచేస్తున్నారన్నది సర్దిచెప్పుకునే సమా ధానం. అలా అయితే వాళ్లు మాత్రమే ఈ పనినెందుకు చేస్తున్నారు? ఇదెవ్వరూ ఆలోచించరు. ఎవ్వరూ చేయనిది వీళ్ళెందుకు చేస్తున్నారు? అన్నది మాత్రమే శతాబ్దాల నయ వంచనకు సంబంధించిన ప్రశ్న. నువ్వు దళితుడివి కాబట్టి నువ్వీపని చేయాల న్నారు. అంతేకాదు. దళి తుడు మాత్రమే ఈ పని చేయాలన్నారు. అంతేనా దళితుల్లోని కొందరు మాత్రమే ఈ పనిచేయా లన్నారు. అంతేనా దళితు ల్లోని స్త్రీలు ఈ పనిని కచ్చి తంగా చేయాలన్నారు. అలా 4000 ఏళ్లుగా నా జాతి స్త్రీలు, మొత్తంగా దళిత సమాజం ఈ మురికిని మోస్తూనే ఉన్నది. ఇప్పటికి దాదాపు 6 లక్షలకుపైగా ఈ అమానవీయ పనినుంచి విముక్తుల య్యారు. సఫాయి కర్మచారీ ఆందోళన దాదాపు 2లక్షల మందిని ఈ పనినుంచి విముక్తి చేసింది. దేశవ్యాప్తంగా ఇంకా 2లక్షలకు పైబడి మనుషులు ఆత్మగౌరవం ఇసుమం తైనా లేని ఈ పనినే చేస్తున్నారు. వారి విముక్తికే నా ఈ అవార్డు అంకితం అంటున్న రామన్ మెగసెసె అవార్డు గ్రహీత తెలుగు బిడ్డ బెజవాడ విల్సన్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. నాకు ఊహ తెలిసేప్పటికే మానవ మలాన్ని చేతుల్తో ఎత్తి నెత్తినమోసే అమానవీయ పనిని నా తాత ముత్తాతల నుంచి కొన్ని లక్షల మంది దళిత జనులు చేస్తున్నారు. ఇది అమానుషమనీ, మానవ విసర్జితాలను చేతుల్తో ఎత్తివే యడం దుర్మార్గమనీ, మనిషి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తుందనీ, ఇటువంటి వ్యవస్థను సమూలంగా నిర్మూ లించాలనీ అర్థం చేసుకునే సరికి నా పాఠశాల విద్య పూర్త య్యింది. కుప్పంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పదవ తరగతి పూర్తి చేసుకొని కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని నా స్వగృహానికి వచ్చినప్పుడు విద్యుద్దీపాలతో మిలమిలా మెరిసిపోయే నా ప్రాంతంలో మానవ మలంలో మునిగితేలుతున్న నా వారి జీవితాలను అతి దగ్గరనుంచి చూసాను. తాగుడుతో జీవితాలు ధ్వంసం అవుతున్నాయని తాగుడు మానమన్నాను. ఈ పనికి సారా తాగక తప్పద న్నారు. నెత్తిన బక్కెట్లో నుంచి ముఖంపైకి కారుతున్న మలాన్ని చేతుల్తో తుడుచుకుంటూ, అది పూర్తిగా కారిపోక ముందే గమ్యాన్ని చేరుకోవాలని పరుగులా నడుస్తున్న వారిని చూసి బోరున ఏడ్చాను. ఇది మానెయ్యమని కాళ్లా వేళ్లా పడ్డాను. ఎవ్వరూ వినలేదు. కిందపడి గిలగిలా కొట్టు కున్నాను. చివరకు ఎలాగో నన్ను ఇంటికి లాక్కొచ్చారు. ఆ రాత్రంతా వేడి నీళ్ళుండే అతి పెద్దట్యాంకు వద్ద ఎత్తై ప్రదే శంలో కూర్చుని ఏడ్చాను. ఏడుస్తూ ఆలోచించాను. అయితే ఈ వేణ్ణీళ్లలో పడి చావడమా? లేకపోతే వీరితో ఈ పనిని మాన్పించడమా? అని తీవ్రంగా ఆలోచించాను. వేడి వేడిగా కిందకి జారిపోతున్న నీళ్లు నన్నంతపని చేయొద్ద న్నాయి. తెలతెలవారుతుండగా చెట్లపైన వాలిన పక్షులూ ఏదో చెప్పుకుంటూ ఎగిరెళ్లిపోతుంటే ఆకాశంవైపు చూశాను. అక్కడే దొరికింది సమాధానం. ఈ ఆకాశానికి చెబితే నా సమస్య తీరుతుంది. ఆకాశం ఎక్కడైనా ఆకాశమే కదా.. నా ప్రజలు ఎక్కడైనా మోసేది మలాన్నే కదా. ఆ కథనే అన్ని చోట్లా వినిపిస్తాను అనుకుని లేచాను. అలా విల్సన్ తన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఇక విశ్ర మించేందుకు అతనికి తీరిక దొరకలేదు. చివరకు పెళ్లికి కూడా. అప్పుడు కోలార్ లోనూ, ఇప్పుడు ఢిల్లీలోనూ సఫాయి కర్మచారీ ఆందోళన్ ఆఫీసే ఆయన నివాసం. అయితే అంబేడ్కర్ పరిచయ మయ్యాకే కులానికీ, ఈ మలి నానికీ ఉన్న సంబంధం తనకు అర్థం అయ్యిందంటాడు విల్సన్. 1990లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీసంఘం వాళ్ళు చిత్తూరు నుంచి హైద రాబాద్ వరకు అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాల సంద ర్భంగా నిర్వహించిన సైకిల్ యాత్ర అంబేడ్కర్‌ని పరి చయం చేసింది. ‘నా జాతి జనుల విముక్తి కేవలం మలం బక్కెట్లను తన్ని తగలెయ్యడంలో లేదనీ, కులం మూలాల్లో ఉందనీ అప్పుడే తెలుసుకున్నాను. కులాన్ని సమూలంగా నిర్మూ లించినప్పుడే దళితులకు గౌరవప్రదమైన జీవితం. సర్వ మానవ సమానత్వం సాధ్యం అవుతుంది. కులం చేసిన గాయం యింకా నా జాతి మదిలో సలుపుతూనే వుంది. అలాగే పురుషాధిపత్యం కూడా. అంబేడ్కర్ తరువాత నాకి ష్టమైన, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్.’ ‘ఆ తరువాత సఫాయి కర్మచారీ ఆందోళన్ని స్థాపిం చాం. మూడు దశాబ్దాలకు పైగా ఇదే పనిచేస్తున్నాం. నేను పెద్దగా చేసిందేమీ లేదు. మనుషుల్ని మనుషులుగా బతకనివ్వమన్నానంతే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి మొదలు కొని ఈ రోజు వరకు 22 రాష్ట్రాల్లో 6000 మంది వాలం టీర్లతో మా సంస్థ పనిచేస్తోంది. ప్రత్యేకించి మహిళా స్కావెంజింగ్ వర్కర్స్ మా సంస్థలో కీలకమైన వాలంటీర్లు. 2014లో సుప్రీంకోర్టు తొలిసారిగా మా పనిని గుర్తించింది. ఈ అమానవీయ పనిని దుర్మార్గమైనదిగా వ్యాఖ్యానిం చింది. ఇందుకు కారకులైన వారిని శిక్షార్హులుగా ప్రకటిం చింది. అటువంటి వారికి జైలు శిక్షని ఖరారు చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పింది. ఇప్పటికి 1,268 మంది సెప్టిక్ ట్యాంక్‌లు క్లీన్ చేస్తూ మరణించారు. వారిలో 36 మందికి మాత్రమే నష్టపరిహారం వచ్చింది. అది కూడా పూర్తిగా కాదు. మ్యాన్‌హోల్స్‌లో పడి మరణిస్తున్నవారు లెక్కేలేదు. ఈ పనిచేసినందుకు జలమండలి ఐదువేల రూపాయలి స్తుంది. కానీ చస్తే ఎవ్వరి బాధ్యతా ఉండదు. నా జీవితం ఉన్నంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ (వ్యాసకర్త: అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి) -
ప్రేమి‘కుల’ చిచ్చు
భగ్గుమన్న సోమం పట్టి ఇళ్లపై దాడులు గుడిసెలకు నిప్పు వాహనాల ధ్వంసం దళిత సంఘాల్లో ఆగ్రహం ఉద్రిక్తత, బలగాల మొహరింపు సేలం: ప్రేమి‘కుల’ చిచ్చు మళ్లీ భగ్గుమంది. దళిత సామాజిక వర్గంపై వన్నియర్ సామాజిక వర్గం తమ ప్రతాపం చూపించింది. సోమం పట్టిలో ఇళ్లపై దాడులు చేశారు. గుడిసెలకు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ప్రాణ భయంతో అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలోని దళిత సామాజిక వర్గం పక్కనే ఉన్న మరో గ్రామంలో తలదాచుకుంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత నెలకొనడంతో బలగాలను మోహరింప చేశారు. సేలం, ధర్మపురి, నామక్కల్ జిల్లాల్లో ఇటీవల కాలంగా ప్రేమ వ్యవహారం చిచ్చు రేపుతుంది. గత ఏడాది ధర్మపురిలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఇలవరసన్, వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన దివ్యను ప్రేమించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. చివరకు ప్రేమ కుల చిచ్చుకు రైలు పట్టాలపై ఇళవరసన్ శవం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే, వారం రోజులుగా ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ రైలు పట్టాలపై శవం కావడం సేలంలో ఉద్రిక్తతను కొనసాగుతోంది. వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడన్న నెపంతో గోకుల్‌రాజ్‌ను హతమార్చినట్టుగా, హత్య కేసు నమోదుకు డిమాండ్ చేస్తూ సేలం నిరసన జ్వాల రగులుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరో ప్రేమ వ్యవహారం సోమం వాలప్పాడి సమీపంలోని సోమం పట్టిని రణరంగంగా మారింది. ప్రేమి‘కుల’ చిచ్చు : సేలం జిల్లా వాలప్పాడి సమీపంలోని సోమం పట్టి గ్రామం ఉంది. ఇక్కడ వందకు పైగా దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన శరవణన్ చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. చదువుకునే రోజుల నుంచే విలాడి పాళయంకు చెందిన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వన్నియ ప్రియను ప్రేమించాడు. ప్రస్తుతం వన్నియ ప్రియ ఓ పాఠశాలలో టీ చర్. తమకు ఉద్యోగం రావడంతో ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. ఈ ఇద్దరు ఆదివారం ఉడాయించారు. సోమవారం ఉదయాన్నే సేలం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సమాచారం వన్నియ ప్రియ కుటుంబీకుల్లో , బంధు వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. అర్ధరాత్రి దాడులు: సోమవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో యాభై మందికి పైగా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు దుడ్డు కర్రలను చేత బట్టి సోమం పట్టిలోకి ప్రవేశించారు. అక్కడున్న గుడిసెలకు నిప్పులు పెడుతూ, ఆ పరిసరాల్లోని వాహనాలపై తమ ప్రతాపం చూపిస్తూ ముందుకు సాగారు. అర్ధరాత్రి వేళ ఈ దాడులతో అక్కడున్న దళిత సామాజిక వర్గంలో ఆందోళన బయలు దేరింది. తమను ఎక్కడ కొట్టి చంపేస్తారోనన్న భయంతో పిల్లలతో కలసి చీకట్లో కూత వేటు దూరంలో ఉన్న మరో గ్రామంలోకి పరుగులు తీశారు. తమను రక్షించాలని శరణు కోరారు. దీంతో ఆ గ్రామస్తులు దళితులకు అండగా ముందుకు సాగారు. అప్పటికే ఆ వ్యక్తులు మూడు గుడిసెలకు నిప్పు పెట్టడం, రెండు ఆటోలు, మోటారు సైకిల్, సైకిళ్లను ధ్వంసం చేసి ఉడాయించారు. వెళ్తూ వెళ్తూ పల్లత్తనూరు వద్ద గుడిసెలు వేసుకుని ఉన్న దళితుల మీద తమ ప్రతాపం చూపించి వెళ్లారు. అక్కడున్నకొన్ని గుడిసెల్ని దగ్ధం చేశారు. రంగంలోకి బలగాలు: అర్ధరాత్రి దాడులతో బెంబేళెత్తిన పోలీసులు సోమం పట్టికి పరుగులు తీశారు. అప్పటికే పక్క గ్రామస్తులు మంటల్ని ఆర్పి ఉండడంతో ఆస్తి నష్టం తగ్గిందని చెప్పవచ్చు. స్వల్పంగా గాయ పడ్డ పలువుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారంతో దళిత సంఘాల్లో ఆగ్రహం రేగింది. దాడులకు నిరసనగా దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తుండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుని ఉంది. రెండు సామాజిక వర్గాల మధ్య వాతావరణం వేడెక్కే అవకాశం ఉండడంతో ఆ పరిసరాల్లో బలగాల్ని రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ సుబ్బులక్ష్మి పర్యవేక్షణలో బలగాలు ఆ గ్రామం, పరిసరాల్లో తిష్ట వేసి ఉన్నారు. ఇటీవల కాలంగా ఇక్కడ కులాంతర ప్రేమ వ్యవహారాలు గ్రామాల్లో చిచ్చు రేపుతుండడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు కుల ప్రేమ వ్యవహారాల కేసులు కొలిక్కి రాని సమయంలో, గోకుల్ రాజ్ మృతి వెలుగులోకి రావడం, తాజాగో, మరో జంట ఉడాయించడం వెరసి పోలీసులకు పని భారాన్ని పెంచుతోంది. తాజా వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్న దృష్ట్యా, ఈ ప్రేమి‘కుల’ చిచ్చు ఎపిసోడ్ మరెన్ని రోజులు సాగుతుందో వేచి చూడాల్సిందే. అదే సమయంలో, గోకుల్ రాజ్ మృతి వ్యవహారంలో తానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చేసిన వ్యాఖ్యలు వాట్సాప్‌లో కలకలం రేపుతున్నాయి. అయితే, గోకుల్ రాజ్‌ను బెదిరించి ఆ వ్యాఖ్యలు చెప్పించినట్టుగా ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలు అటు దళితులు, ఇటు వన్నియర్ల మధ్య మరో యుద్ధానికి దారి తీసి ఉండడంతో ఆ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.