ప్రేమి‘కుల’ చిచ్చు | Attacks on homes in Love affair | Sakshi
Sakshi News home page

ప్రేమి‘కుల’ చిచ్చు

Published Wed, Jul 1 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

ప్రేమి‘కుల’ చిచ్చు

ప్రేమి‘కుల’ చిచ్చు

భగ్గుమన్న సోమం పట్టి
 ఇళ్లపై దాడులు    గుడిసెలకు నిప్పు
 వాహనాల ధ్వంసం  దళిత సంఘాల్లో ఆగ్రహం
 ఉద్రిక్తత, బలగాల మొహరింపు


సేలం: ప్రేమి‘కుల’ చిచ్చు మళ్లీ భగ్గుమంది. దళిత సామాజిక వర్గంపై వన్నియర్ సామాజిక వర్గం తమ ప్రతాపం చూపించింది. సోమం పట్టిలో ఇళ్లపై దాడులు చేశారు. గుడిసెలకు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ప్రాణ భయంతో అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలోని దళిత సామాజిక వర్గం పక్కనే ఉన్న మరో గ్రామంలో తలదాచుకుంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత నెలకొనడంతో బలగాలను మోహరింప చేశారు.

సేలం, ధర్మపురి, నామక్కల్ జిల్లాల్లో ఇటీవల కాలంగా ప్రేమ వ్యవహారం చిచ్చు రేపుతుంది. గత ఏడాది ధర్మపురిలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఇలవరసన్, వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన దివ్యను ప్రేమించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. చివరకు ప్రేమ కుల చిచ్చుకు రైలు పట్టాలపై ఇళవరసన్ శవం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే, వారం రోజులుగా ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ రైలు పట్టాలపై శవం కావడం సేలంలో ఉద్రిక్తతను కొనసాగుతోంది. వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడన్న నెపంతో గోకుల్‌రాజ్‌ను హతమార్చినట్టుగా, హత్య కేసు నమోదుకు డిమాండ్ చేస్తూ సేలం నిరసన జ్వాల రగులుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరో ప్రేమ వ్యవహారం సోమం వాలప్పాడి సమీపంలోని సోమం పట్టిని రణరంగంగా మారింది.

ప్రేమి‘కుల’ చిచ్చు : సేలం జిల్లా వాలప్పాడి సమీపంలోని సోమం పట్టి గ్రామం ఉంది. ఇక్కడ వందకు పైగా దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.  ఈ ప్రాంతానికి చెందిన శరవణన్ చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. చదువుకునే రోజుల నుంచే విలాడి పాళయంకు చెందిన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వన్నియ ప్రియను ప్రేమించాడు. ప్రస్తుతం వన్నియ ప్రియ ఓ పాఠశాలలో టీ చర్. తమకు ఉద్యోగం రావడంతో ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. ఈ ఇద్దరు ఆదివారం ఉడాయించారు. సోమవారం ఉదయాన్నే సేలం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సమాచారం వన్నియ ప్రియ కుటుంబీకుల్లో , బంధు వర్గంలో ఆగ్రహాన్ని రేపింది.

అర్ధరాత్రి దాడులు: సోమవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో యాభై మందికి పైగా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు దుడ్డు కర్రలను చేత బట్టి సోమం పట్టిలోకి ప్రవేశించారు. అక్కడున్న గుడిసెలకు నిప్పులు పెడుతూ, ఆ పరిసరాల్లోని వాహనాలపై తమ ప్రతాపం చూపిస్తూ ముందుకు సాగారు. అర్ధరాత్రి వేళ ఈ దాడులతో అక్కడున్న దళిత సామాజిక వర్గంలో ఆందోళన బయలు దేరింది. తమను ఎక్కడ కొట్టి చంపేస్తారోనన్న భయంతో పిల్లలతో కలసి చీకట్లో కూత వేటు దూరంలో ఉన్న మరో గ్రామంలోకి పరుగులు తీశారు. తమను రక్షించాలని శరణు కోరారు. దీంతో ఆ గ్రామస్తులు దళితులకు అండగా ముందుకు సాగారు. అప్పటికే ఆ వ్యక్తులు మూడు గుడిసెలకు నిప్పు పెట్టడం, రెండు ఆటోలు, మోటారు సైకిల్, సైకిళ్లను ధ్వంసం చేసి ఉడాయించారు. వెళ్తూ వెళ్తూ పల్లత్తనూరు వద్ద గుడిసెలు వేసుకుని ఉన్న దళితుల మీద తమ ప్రతాపం చూపించి వెళ్లారు. అక్కడున్నకొన్ని గుడిసెల్ని దగ్ధం చేశారు.

రంగంలోకి బలగాలు:  అర్ధరాత్రి దాడులతో బెంబేళెత్తిన పోలీసులు సోమం పట్టికి పరుగులు తీశారు. అప్పటికే పక్క గ్రామస్తులు మంటల్ని ఆర్పి ఉండడంతో ఆస్తి నష్టం తగ్గిందని చెప్పవచ్చు. స్వల్పంగా గాయ పడ్డ పలువుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారంతో దళిత సంఘాల్లో ఆగ్రహం రేగింది. దాడులకు నిరసనగా దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తుండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుని ఉంది. రెండు సామాజిక వర్గాల మధ్య వాతావరణం వేడెక్కే అవకాశం ఉండడంతో ఆ పరిసరాల్లో బలగాల్ని రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ సుబ్బులక్ష్మి పర్యవేక్షణలో బలగాలు ఆ గ్రామం, పరిసరాల్లో తిష్ట వేసి ఉన్నారు. ఇటీవల కాలంగా ఇక్కడ కులాంతర ప్రేమ వ్యవహారాలు గ్రామాల్లో చిచ్చు రేపుతుండడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

ఇప్పటికే పలు కుల ప్రేమ వ్యవహారాల కేసులు కొలిక్కి రాని సమయంలో,  గోకుల్ రాజ్ మృతి వెలుగులోకి రావడం, తాజాగో, మరో జంట ఉడాయించడం వెరసి పోలీసులకు పని భారాన్ని పెంచుతోంది. తాజా వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్న దృష్ట్యా, ఈ ప్రేమి‘కుల’ చిచ్చు ఎపిసోడ్ మరెన్ని రోజులు సాగుతుందో వేచి చూడాల్సిందే. అదే సమయంలో, గోకుల్ రాజ్ మృతి వ్యవహారంలో తానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చేసిన వ్యాఖ్యలు వాట్సాప్‌లో కలకలం రేపుతున్నాయి. అయితే, గోకుల్ రాజ్‌ను బెదిరించి ఆ వ్యాఖ్యలు చెప్పించినట్టుగా ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలు అటు దళితులు, ఇటు వన్నియర్ల మధ్య మరో యుద్ధానికి దారి తీసి ఉండడంతో ఆ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement