‘మలిన’ చరితకు ముగింపు | " Foul " to the end history | Sakshi
Sakshi News home page

‘మలిన’ చరితకు ముగింపు

Published Fri, Jul 29 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

‘మలిన’ చరితకు ముగింపు

‘మలిన’ చరితకు ముగింపు

సిబిడ్డలు మట్టితో ఆడుకుంటున్నట్టు నా మనుషులు మలంతో ఆడుతున్నారు. మలంతోనే పాడుతున్నారు. అదే మలినంలో తింటూ, దానిపక్కనే పడుకొంటూ 4000 సంవ త్సరాల నుంచీ కులం అనే మలాన్ని నెత్తిన మోస్తున్నారు నా జాతి స్త్రీలు. స్వచ్ఛతకీ, కులానికీ మధ్యనున్న అతి సున్నితమైన అంశం నా జాతి జనుల ప్రాణాలు. వేలయేళ్ల మానవ మలాల్లోంచి బయట పడలేకా, అందులో పడి చావలేకా లక్షలాది మంది దళితులు గిజగిజలాడుతున్నారు. ఏదీ దొరక్క ఈ పనిచేస్తున్నారన్నది సర్దిచెప్పుకునే సమా ధానం. అలా అయితే వాళ్లు మాత్రమే ఈ పనినెందుకు చేస్తున్నారు? ఇదెవ్వరూ ఆలోచించరు. ఎవ్వరూ చేయనిది వీళ్ళెందుకు చేస్తున్నారు? అన్నది మాత్రమే శతాబ్దాల నయ వంచనకు సంబంధించిన ప్రశ్న.

నువ్వు దళితుడివి కాబట్టి నువ్వీపని చేయాల న్నారు. అంతేకాదు. దళి తుడు మాత్రమే ఈ పని చేయాలన్నారు. అంతేనా దళితుల్లోని కొందరు మాత్రమే ఈ పనిచేయా లన్నారు. అంతేనా దళితు ల్లోని స్త్రీలు ఈ పనిని కచ్చి తంగా చేయాలన్నారు. అలా 4000 ఏళ్లుగా నా జాతి స్త్రీలు, మొత్తంగా దళిత సమాజం ఈ మురికిని మోస్తూనే ఉన్నది. ఇప్పటికి దాదాపు 6 లక్షలకుపైగా ఈ అమానవీయ పనినుంచి విముక్తుల య్యారు. సఫాయి కర్మచారీ ఆందోళన దాదాపు 2లక్షల మందిని ఈ పనినుంచి విముక్తి చేసింది. దేశవ్యాప్తంగా ఇంకా 2లక్షలకు పైబడి మనుషులు ఆత్మగౌరవం ఇసుమం తైనా లేని ఈ పనినే చేస్తున్నారు. వారి విముక్తికే నా ఈ అవార్డు అంకితం అంటున్న రామన్ మెగసెసె అవార్డు గ్రహీత తెలుగు బిడ్డ బెజవాడ విల్సన్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.

నాకు ఊహ తెలిసేప్పటికే మానవ మలాన్ని చేతుల్తో ఎత్తి నెత్తినమోసే అమానవీయ పనిని నా తాత ముత్తాతల నుంచి కొన్ని లక్షల మంది దళిత జనులు చేస్తున్నారు. ఇది అమానుషమనీ, మానవ విసర్జితాలను చేతుల్తో ఎత్తివే యడం దుర్మార్గమనీ, మనిషి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తుందనీ, ఇటువంటి వ్యవస్థను సమూలంగా నిర్మూ లించాలనీ అర్థం చేసుకునే సరికి నా పాఠశాల విద్య పూర్త య్యింది. కుప్పంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో పదవ తరగతి పూర్తి చేసుకొని కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని నా స్వగృహానికి వచ్చినప్పుడు విద్యుద్దీపాలతో మిలమిలా మెరిసిపోయే నా ప్రాంతంలో మానవ మలంలో మునిగితేలుతున్న నా వారి జీవితాలను అతి దగ్గరనుంచి చూసాను. తాగుడుతో జీవితాలు ధ్వంసం అవుతున్నాయని తాగుడు మానమన్నాను.

ఈ పనికి సారా తాగక తప్పద న్నారు. నెత్తిన బక్కెట్‌లో నుంచి ముఖంపైకి కారుతున్న మలాన్ని చేతుల్తో తుడుచుకుంటూ, అది పూర్తిగా కారిపోక ముందే గమ్యాన్ని చేరుకోవాలని పరుగులా నడుస్తున్న వారిని చూసి బోరున ఏడ్చాను. ఇది మానెయ్యమని కాళ్లా వేళ్లా పడ్డాను. ఎవ్వరూ వినలేదు. కిందపడి గిలగిలా కొట్టు కున్నాను. చివరకు ఎలాగో నన్ను ఇంటికి లాక్కొచ్చారు. ఆ రాత్రంతా వేడి నీళ్ళుండే అతి పెద్దట్యాంకు వద్ద ఎత్తై ప్రదే శంలో కూర్చుని ఏడ్చాను. ఏడుస్తూ ఆలోచించాను. అయితే ఈ వేణ్ణీళ్లలో పడి చావడమా? లేకపోతే వీరితో ఈ పనిని మాన్పించడమా? అని తీవ్రంగా ఆలోచించాను. వేడి వేడిగా కిందకి జారిపోతున్న నీళ్లు నన్నంతపని చేయొద్ద న్నాయి. తెలతెలవారుతుండగా చెట్లపైన వాలిన పక్షులూ ఏదో చెప్పుకుంటూ ఎగిరెళ్లిపోతుంటే ఆకాశంవైపు చూశాను. అక్కడే దొరికింది సమాధానం. ఈ ఆకాశానికి చెబితే నా సమస్య తీరుతుంది. ఆకాశం ఎక్కడైనా ఆకాశమే కదా.. నా ప్రజలు ఎక్కడైనా మోసేది మలాన్నే కదా. ఆ కథనే అన్ని చోట్లా వినిపిస్తాను అనుకుని లేచాను.

అలా విల్సన్ తన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఇక విశ్ర మించేందుకు అతనికి తీరిక దొరకలేదు. చివరకు పెళ్లికి కూడా. అప్పుడు కోలార్ లోనూ, ఇప్పుడు ఢిల్లీలోనూ సఫాయి కర్మచారీ ఆందోళన్ ఆఫీసే ఆయన నివాసం. అయితే అంబేడ్కర్ పరిచయ మయ్యాకే కులానికీ, ఈ మలి నానికీ ఉన్న సంబంధం తనకు అర్థం అయ్యిందంటాడు విల్సన్. 1990లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీసంఘం వాళ్ళు చిత్తూరు నుంచి హైద రాబాద్ వరకు అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాల సంద ర్భంగా నిర్వహించిన సైకిల్ యాత్ర  అంబేడ్కర్‌ని పరి చయం చేసింది.

‘నా జాతి జనుల విముక్తి కేవలం మలం బక్కెట్లను తన్ని తగలెయ్యడంలో లేదనీ, కులం మూలాల్లో ఉందనీ అప్పుడే తెలుసుకున్నాను. కులాన్ని సమూలంగా నిర్మూ లించినప్పుడే దళితులకు గౌరవప్రదమైన జీవితం. సర్వ మానవ సమానత్వం సాధ్యం అవుతుంది. కులం చేసిన గాయం యింకా నా జాతి మదిలో సలుపుతూనే వుంది. అలాగే పురుషాధిపత్యం కూడా. అంబేడ్కర్ తరువాత నాకి ష్టమైన, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి మహానుభావుడు ఎస్‌ఆర్ శంకరన్.’

 ‘ఆ తరువాత సఫాయి కర్మచారీ ఆందోళన్‌ని స్థాపిం చాం. మూడు దశాబ్దాలకు పైగా ఇదే పనిచేస్తున్నాం. నేను పెద్దగా చేసిందేమీ లేదు. మనుషుల్ని మనుషులుగా బతకనివ్వమన్నానంతే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి మొదలు కొని ఈ రోజు వరకు 22 రాష్ట్రాల్లో 6000 మంది వాలం టీర్లతో మా సంస్థ పనిచేస్తోంది. ప్రత్యేకించి మహిళా స్కావెంజింగ్ వర్కర్స్ మా సంస్థలో కీలకమైన వాలంటీర్లు. 2014లో సుప్రీంకోర్టు తొలిసారిగా మా పనిని గుర్తించింది. ఈ అమానవీయ పనిని దుర్మార్గమైనదిగా వ్యాఖ్యానిం చింది. ఇందుకు కారకులైన వారిని శిక్షార్హులుగా ప్రకటిం చింది. అటువంటి వారికి జైలు శిక్షని ఖరారు చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పింది. ఇప్పటికి 1,268 మంది సెప్టిక్ ట్యాంక్‌లు క్లీన్ చేస్తూ మరణించారు. వారిలో 36 మందికి మాత్రమే నష్టపరిహారం వచ్చింది. అది కూడా పూర్తిగా కాదు. మ్యాన్‌హోల్స్‌లో పడి మరణిస్తున్నవారు లెక్కేలేదు. ఈ పనిచేసినందుకు జలమండలి ఐదువేల రూపాయలి స్తుంది. కానీ చస్తే ఎవ్వరి బాధ్యతా ఉండదు. నా జీవితం ఉన్నంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’
 
(వ్యాసకర్త: అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement