dalmia cements
-
శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట
నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం కేసు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెపై ఐపీసీలోని 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టివేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 13 (ప్రభుత్వ ఉద్యోగి దుష్ప్రవర్తన) కింద నమోదుచేసిన కేసును కొట్టివేసేందుకు నిరాక రించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు గురువారం తీర్పునిచ్చారు. కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో 408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకానికి పాల్పడారనేందుకు ప్రాథమిక ఆధారాలేమీ లేవని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసును విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 కింద నమోదు చేసిన కేసును మాత్రం కొట్టివేసేందుకు నిరాకరించారు. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన అభియోగాలు మినహా.. మిగతా సెక్షన్ల కింది కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
శ్రీలక్ష్మి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ తనను అన్యాయంగా ఇరికించిందని, అందువల్ల ఆ కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్షి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ నిబంధనలను సీబీఐ సరిగా అర్థం చేసుకోలేదన్నారు. లీజు మంజూరు వ్యవహారం మొత్తం నిబంధనల మేరకే జరిగిందని, ఈ విషయం రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. ఈ వాదనలను సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ తోసిపుచ్చారు. లీజుల మంజూరు విషయంలో శ్రీలక్షి కుట్రపూరితంగా వ్యవహరించి ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అభియోగాల నమోదు ప్రక్రియ ఆపండి
దాల్మియాపై చార్జిషీట్లో సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో రెండు వారాలపాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు మంగళవారం సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కడప జిల్లాలో సున్నపురాయి గనుల లీజు కేటాయింపులకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయడంతోపాటు ఈ కేసులో తదుపరి చర్యల్ని నిలిపేయాలంటూ దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ జైశ్వాల్ మంగళవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లీజు బదలాయింపులు నిబంధనల మేరకే జరిగాయన్నారు. సీబీఐ చేసిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాలు చూపలేదన్నారు. పిటిషనర్ కేవలం కంపెనీ ఎండీ మాత్రమేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.